తెలంగాణ స్టైల్లో సూపర్ టేస్టీ "సల్ల చారు" - ఒంటికి చలువ, పొట్టకి హాయిగా!
సరికొత్త పద్ధతిలో నోరూరించే "మజ్జిగ చారు" - తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు రెడీ!

Published : February 27, 2026 at 1:13 PM IST
Telangana Special Salla Charu Recipe : ఎండాకాలం చాలా మంది వేడి వేడి అన్నంలోకి రసం, పచ్చి పులుసు, సాంబార్ వంటివి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అవి మాత్రమే కాకుండా పొట్టకి హాయిగా ఉంటుందని పెరుగుతో మజ్జిగ, పెరుగు చారు లేదా పెరుగు పులుసు వంటివి తయారు చేసుకుంటుంటారు. అయితే, పెరుగు చారును ఎప్పుడూ చేసుకునే పద్ధతిలో కాకుండా ఈసారి కాస్త వెరైటీగా ట్రై చేయండి. అదే, తెలంగాణ స్పెషల్ సూపర్ టేస్టీ "సల్ల చారు". ఇది మంచి రుచికరంగా ఉండి ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చుతుంది. పిల్లలైతే దీనితో నాలుగు ముద్దలు ఎక్కువే లాగిస్తారు. పైగా, దీన్ని తక్కువ పదార్థాలతో అప్పటికప్పుడు సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. మరి, లేట్ చేయకుండా తెలంగాణ స్టైల్లో నోరూరించే ఈ పెరుగు పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- పెరుగు - లీటర్
- ఉప్పు - రుచికి తగినంత
- అల్లం - రెండించుల ముక్క
- పచ్చిమిర్చి - ఏడెనిమిది
- కరివేపాకు - రెండు రెమ్మలు
- ఉల్లిపాయలు - రెండు
- సన్నని కొత్తిమీర తరుగు - గుప్పెడు
- పసుపు - కొద్దిగా

ఎండాకాలం వచ్చేస్తోంది - పెరుగు పుల్లగా మారకూడదంటే ఈ చిట్కాలు బెస్ట్!
తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే, సన్నని కొత్తిమీర తరుగును కట్ చేసుకుని పక్కనుంచాలి.
- అనంతరం ఒక వెడల్పాటి గిన్నెలో పెరుగును తీసుకుని అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి.
- ఆ తర్వాత విస్కర్‌తో ఎక్కడా గడ్డలు లేకుండా బాగా చిలికి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు చిన్న రోలు లేదా మిక్సీ గిన్నె తీసుకుని అందులో అల్లం ముక్కలు, పచ్చిమిర్చీలను ముక్కలుగా తుంచి వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

- తర్వాత అందులోనే కరివేపాకును కూడా వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పక్కనుంచాలి.
- నెక్ట్స్ ముందుగా విస్క్ చేసి పెట్టుకున్న పెరుగును తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర తరుగు, పసుపు వేసి ఒకసారి మిశ్రమం మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి-అల్లం పేస్ట్‌ను వేసుకుని మరోసారి మంచిగా కలుపుకోవాలి.
- అనంతరం మీకు పెరుగు పులుసు కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి తగినన్ని నీళ్లు యాడ్ చేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.

తాలింపు కోసం :
- నూనె - మూడ్నాలుగు చెంచాలు
- మెంతులు - అరటీస్పూన్
- ఆవాలు - ఒక టీస్పూన్
- జీలకర్ర - ఒక టీస్పూన్
- మినప్పప్పు - ఒక టీస్పూన్
- శనగపప్పు - ఒక టీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 8 నుంచి 10
- ఎండుమిర్చి - ఐదారు
- కరివేపాకు - కొద్దిగా

- ఇప్పుడు స్టవ్ మీద పోపు కోసం ఒక పాన్‌లో మూడ్నాలుగు టేబుల్స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి.
- ఆయిల్ కాగిన తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకుని అన్నింటినీ సన్నని సెగ మీద వేయించాలి.
- అవన్నీ లైట్‌గా వేగాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
- ఆ తర్వాత ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు వేసుకుని పోపును మంచిగా వేయించాలి.

- తాలింపు మంచిగా వేగిందనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగ చారును అందులో వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటే చాలు.
- అంతే, తెలంగాణ స్టైల్లో సూపర్ టేస్టీగా "సల్ల చారు లేదా మజ్జిగ పులుసు" అప్పటికప్పుడు సింపుల్‌గా రెడీ అవుతుంది!
- దీన్ని అప్పటికప్పుడు తినేదాని కంటే ప్రిపేర్ చేశాక ఒకట్రెండు గంటలు పక్కనుంచి తింటే ఆ టేస్ట్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది.
- మరి, నచ్చితే మీరూ ఓసారి ఈ స్టైల్లో మజ్జిగ చారు ట్రై చేయండి.
సరికొత్తగా "టమాటా చారు" - వేడివేడిగా అద్భుతంగా ఉంటుంది - తినడం కాదు తాగేస్తారు!
సరికొత్త రుచిలో "వంకాయ పెరుగు పచ్చడి" - ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చుతుంది!

