రేషన్ బియ్యం అమ్ముతున్నారా? - మీరు చాలా కోల్పోతున్నారు!
- ఫోర్టిఫైడ్ రైస్‌ను మిక్స్ చేసి పంపిణీ చేస్తున్న ప్రభుత్వం - వాటిని తక్కువకే విక్రయిస్తూ ఆరోగ్యం, డబ్బును కోల్పోతున్న జనం!

Published : December 27, 2025 at 3:14 PM IST
Ration Rice : "ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యం ఇంటికి తెచ్చుకోవడం. వాటిని 10 రూపాయలకో, 20 రూపాయలకో అమ్ముకోవడం. ఆ తర్వాత దుకాణానికి వెళ్లి సన్నబియ్యం కొనుగోలు చేసి తినడం." చాలా మంది లబ్ధిదారులు చేస్తున్న పని ఇదే. అయితే, ఈ చర్యవల్ల జనం ఆరోగ్యపరంగా తీవ్రంగా నష్టపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యంలో అద్భుతమైన పోషకాలు ఉన్నాయని, ఈ విషయం తెలియక వాటిని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోషకాలు నిండిన "ఫోర్టిఫైడ్ బియ్యం" వదులుకొని, మార్కెట్లో దొరికే సాధారణ బియ్యం తెచ్చుకొని తింటున్నారని చెబుతున్నారు! మరి, ఇంతకీ ఈ ఫోర్టిఫైడ్ బియ్యం అంటే ఏంటి? వీటిని పండిస్తారా? తయారు చేస్తారా? ఇందులో ఏమేం పోషకాలు ఉంటాయి? సాధారణ బియ్యానికి, వీటికి తేడా ఏంటి? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
మీ ఇంట్లో పోషకాహార లోపం :
దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో పోషకాహార లోపం ఒకటి. పిల్లల నుంచి పెద్దల వరకు దీనిబారిన పడుతున్నారు. వయసుకు తగిన బరువు లేకపోవడం కొందరి సమస్యకాగా.. తగినంత ఎత్తులేకపోవడం ఇంకొందరి ఇబ్బంది. ఇంకెంతో మందిని రక్తహీనత వేధిస్తోంది! జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశంలోని ఐదేళ్లలోపు పిల్లల్లో 32 శాతం మంది వయసుకు తగిన బరువు లేరు. 35 శాతం మంది వయసుకు తగిన ఎత్తులేరు. ఇక మహిళలు, గర్భిణులు 50 శాతం మందికి పైగా రక్తహీనతతో బాధపడుతున్నారట. తెలంగాణ విషయానికి వస్తే 19 ఏళ్లలోపు అమ్మాయిల్లో ఏకంగా 64 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారట! ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పోషకాహార లోపాన్ని నివారించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రజలకు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ రేషన్ దుకాణాలకు, అంగన్ వాడీ కేంద్రాలకు ఈ రైస్ సరఫరా చేస్తోంది.
ఫోర్టిఫైడ్ బియ్యం అంటే?
ఫోర్టిఫైడ్ రైస్ అనేవి ప్రత్యేకంగా తయారు చేసిన బియ్యం. పోషకాహార లోపాన్ని భర్తీ చేసేందుకు ఉద్దేశించినవి. వీటిని ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారు. ముందుగా సాధారణ బియ్యం/నూకలు పిండిగా మారుస్తారు. ఇందులో ఐరన్, పోలిక్ యాసిడ్, విటమిన్ బీ12 పోషకాలను ఈ పిండిలో మిక్స్ చేస్తారు. ఆ తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు కలిపి ముద్దగా తయారు చేస్తారు. అనంతరం యంత్రాల ద్వారా ఈ పిండిని మళ్లీ బియ్యంగా మారుస్తారు. ఇలా తయారు చేసిన బియ్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్‌గా పిలుస్తారు. 100 కేజీల సాధారణ బియ్యంలో ఒక కేజీ ఫోర్టిఫైడ్ రైస్‌ను మిక్స్ చేస్తారు.
సన్న బియ్యాన్నీ అమ్మేసుకుంటున్నారు - సరిహద్దులు దాటించేస్తున్నారు
ప్రభుత్వానికి అదనపు వ్యయం :
రైతులు పండించిన సాధారణ ధాన్యాన్ని రైసుమిల్లుల్లో బియ్యంగా మారుస్తారు. దీనికోసం ప్రభుత్వానికి కిలో ఒక్కంటికి 38 రూపాయల వరకు ఖర్చు అవుతోంది. ఇక ఫోర్టిఫైడ్ను మిక్స్ చేయడానికి మరిత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. కిలో ఫోర్టిఫైడ్ మార్కెట్‌లో దాదాపు రూ.65 పలుకుతోంది. దీన్ని సర్కారు కొనుగోలు చేసి రేషన్ బియ్యంలో కలిపి జనాలకు పంపిణీ చేస్తోంది. కానీ, ప్రజలకు దీని విలువ తెలియక తక్కువ ధరకే రేషన్ బియ్యాన్ని విక్రయిస్తూ ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు.
అడ్డదారిలో తరలింపు :
జనాలు రేషన్ షాపు నుంచి తెచ్చిన బియ్యాన్ని దళారులు కొనుగోలు చేస్తున్నారు. కేజీ బియ్యానికి 10 నుంచి 20 రూపాయలు చెల్లించి, ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు తరలించి 40 నుంచి 50 రూపాయలకు విక్రయిస్తున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా తరచూ ఎక్కడో ఒక చోట అడ్డదారిలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న 121 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని దిలావర్‌పూర్ టోల్‌ప్లాజా సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్మల్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు పౌరసరఫరాల అధికారులు తెలిపారు.
ఆరోగ్యంతోపాటు :
ఫోర్టిఫైడ్ బియ్యం అమ్ముతూ జనాలు సాధారణ కార్బోహైడ్రేట్స్ ఉన్న బియ్యం ఎక్కువ ధరకు కొనుగోలు చేసి తింటున్నారు. దీనివల్ల ఆరోగ్యంతోపాటు డబ్బును కూడా కోల్పోతున్నారు. ఫోర్టిఫైడ్ బియ్యంలో ఐరన్ ఉంటుంది. దీనివల్ల రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. ఇక బీ12 లోపం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు అన్నీఇన్నీ కావు. వాటిని రూపుమాపేందుకు ఈ ఫోర్టిఫైడ్ రైస్ సహకరిస్తాయి. గుండె ఆరోగ్యం నుంచి DNA నిర్మాణం వరకు ఎంతో కీలకంగా ఉండే ఫోలిక్ యాసిడ్ కూడా ఈ రైస్‌లో ఉంటుంది. ఇవన్నీ అందే బియ్యాన్ని పది, ఇరవై రూపాయలకు అమ్ముకొని, 60 - 70 రూపాయలు పెట్టి సాధారణ బియ్యం కొనుగోలు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.
రేషన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్ - సన్న బియ్యం తీసుకోకుంటే ఏమవుతుందో తెలుసా?

