ఇడ్లీ పిండితో "వడలు" చేసుకోండి - నూనె పీల్చకుండా క్రిస్పీగా వస్తాయి!
-డైలీ ఇడ్లీలు తినడం బోరింగ్‌గా ఉందా? - ఇలా వడలు చేసుకొని ఆరగించండి!

Published : October 17, 2025 at 12:38 PM IST
Tasty Vada with Idli Batter: హెల్దీగా, పొట్టకు లైట్‌గా ఉండే టిఫెన్స్లో ఇడ్లీలు ముందు వరుసలో ఉంటాయి. అందుకే చాలా మంది అమ్మలు తమ ఇంట్లో వాళ్ల కోసం క్రమం తప్పకుండా వీటిని చేస్తుంటారు. అయితే కొన్నికొన్ని సార్లు ఎక్కువ మొత్తంలో ఇడ్లీ పిండి మిగిలిపోతుంది. దాంతో ఏం చేయాలో తెలియక కొద్దిమంది పడేస్తే.. మరికొద్దిమంది పునుగులు, గుంత పొంగనాలు వంటివి చేస్తుంటారు. అయితే ఎప్పుడూ అవే కాకుండా ఇడ్లీ పిండి మిగిలినప్పుడు ఎంచక్కా వడలు చేసుకోవచ్చు. నార్మల్‌గా వడలు చేయాలంటే కాస్త టైమ్ పడుతుంది. ఇలాంటి సమయంలో ఇడ్లీ పిండి ఉంటే నిమిషాల్లో చేసుకోవచ్చు. ప్రిపరేషన్ కూడా సులువే. చట్నీ లేకపోయినా నేరుగా వీటిని తినొచ్చు. మరి లేట్ చేయకుండా కమ్మని ఇడ్లీ పిండితో వడలు ఎలా చేయాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- ఇడ్లీ పిండి - 2 కప్పులు
- బొంబాయి రవ్వ - అర కప్పు
- జీలకర్ర - అర టీస్పూన్
- పచ్చిమిర్చి - 2
- ఉల్లిపాయ - 1
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఉప్పు - రుచికి సరిపడా
- బేకింగ్ సోడా - చిటికెడు

తయారీ విధానం:
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్‌లో కలుపుతూ వేయించాలి. రవ్వ లైట్‌గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఓ ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
- మిక్సీజార్‌లోకి వేగిన రవ్వను వేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి.
- మిక్సింగ్ బౌల్లోకి ముందుగా ఇడ్లీ పిండి తీసుకోవాలి. ఆపై అందులోకి గ్రైండ్ చేసిన రవ్వను వేసి అంతా కలిసేలా మిక్స్ చేసి మూత పెట్టి కొద్దిసేపు పక్కన ఉంచాలి.
- ఈలోపు వడలకు అవసరమైన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకును వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి.
- 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరోసారి కలుపుకోవాలి. అనంతరం అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా వేసి పదార్థాలు అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి.

- పదార్థాలు అన్నీ కలిసిన తర్వాత పిండిని ఓ ఐదు నిమిషాల పాటు ఆపకుండా ఒకటే డైరెక్షన్లో చేతితో కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల వడలు గుల్లగా వస్తాయి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
- నూనె వేడయ్యాక చేతిని తడిపి కొద్దిగా పిండిని తీసుకొని అరటి ఆకు లేదా బటర్ పేపర్ మీద వడలుగా వత్తుకుని కాగుతున్న నూనెలో నెమ్మదిగా వేసుకోవాలి.
- ఇలా కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి రెండు వైపులా గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి.
- వడలు పర్ఫెక్ట్గా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండి మొత్తాన్ని ఇలానే వడలుగా చేసుకుని నూనెలో వేసి ఫ్రై చేయాలి.
- ఇక వీటిని వేడివేడిగా ప్లేట్లోకి వేసి సర్వ్ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ పిండి వడలు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
- వీటిని చట్నీ లేకున్నా నేరుగా తిన్నా చాలా రుచికరంగా ఉంటాయి. లేదంటే మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తినొచ్చు.

చిట్కాలు:
- మీరు ఎక్కువ మొత్తంలో వడలను ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చెప్పిన క్వాంటిటీని పెంచి తీసుకోవచ్చు.
- రవ్వకు బదులుగా బియ్యప్పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే అటుకులను దోరగా వేయించి మెత్తని పొడిలా చేసి అయినా పిండిలో కలుపుకోవచ్చు.
- ఇడ్లీ పిండిలో రవ్వను కలిపి కొద్దిసేపు నానబెట్టిన తర్వాత వడలు వేసుకునేందుకు సరిపడేలా పిండి కన్సిస్టెన్సీ ఉండాలి. రవ్వ కలిపిన తర్వాత పిండి ఏమైనా మరీ గట్టిగా అనిపిస్తే లైట్‌గా నీళ్లు యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. అదే పిండి లూజ్‌గా ఉండే మరికొంచెం రవ్వ మిక్స్ చేసుకోవచ్చు.
- వడలను వేయించేటప్పుడు స్టవ్‌ను హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వేయిస్తే అవి లోపలి వరకు చక్కగా ఫ్రై అవుతాయి.
కరకరలాడే "ఆలూ 65" - ఇంట్లోనే రెస్టారెంట్ టేస్ట్! - పిల్లలకు ఎంతో ఇష్టం
దీపావళికి పాలకూర "మురుకులు" - నూనె పీల్చకుండానే Extra Crispy!

