పసందైన "పనీర్ పాయసం" - ఇంట్లోనే ఇలా తియ్యని వేడుక చేసుకోండి!
సేమియా, సగ్గుబియ్యంతో పాయసం రొటీన్ - ఇలా ఓసారి పనీర్‌తో ట్రై చేయండి!

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 1, 2026 at 5:13 PM IST
Paneer Payasam Prepare : పాయసాన్ని చాలా మంది ఇష్టంగా తింటారు. పండగలు, ఇతర అకేషన్స్లోనూ దీన్ని ఎక్కువగా చేస్తుంటారు. అయితే పాయసం అనగానే చాలా మందికి సేమియా, సగ్గుబియ్యంతో చేసేవే తెలుసు. కానీ పనీర్‌తో కూడా దీనిని చేసుకోవచ్చు. ఇలా చేశారంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. పైగా నిమిషాల్లోనే రెడీ అవుతుంది. అంతేకాక ఒక్కసారి చేసుకుంటే రెండు రోజుల పాటు హ్యాపీగా తినేయొచ్చు!
మీకు కొత్తగా ఏదైనా స్వీట్ తినాలపించినప్పుడు ఓసారి ఇలా ట్రై చేయండి. అదేవిధంగా బంధువులు లేదా స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు ఈ విధంగా చేసి వారికి సర్ప్రైజ్ ఇవ్వండి. దీనిని చల్లగా లేదా వేడిగా ఎలా తిన్నా అద్భుతంగా ఉంటుంది. ఇలా ఒక్కసారి ఇంట్లో చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీ ఇంకోసారి చేయమని అడుగుతారు. మరి ఆలస్యం చేయకుండా టేస్టీటేస్టీ పనీర్ పాయసం ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూసేయండి.
రొటీన్‌కి భిన్నంగా "అలసందల చారు" - ఒక్కసారి తింటే ఫేవరెట్ డిష్‌గా మారడం పక్కా!

కావాల్సిన పదార్థాలు :
- పనీర్ - 400 గ్రాములు
- పాలు - 2 లీటర్లు
- కుంకుమపువ్వు - 2 చిటికెడ్లు
- యాలకుల పొడి - 1 టీ స్పూన్
- డ్రైఫ్రూట్స్ - కొన్ని
- పంచదార - ఒక కప్పు

తయారీ విధానం :
- ఈ స్వీట్ రెసిపీ కోసం గిన్నెలో రెండు కప్పల నీళ్లు పోసి మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మరిగించిన నీటిలో 400 గ్రాముల పనీర్ వేసి 15 నిమిషాల పాటు నానబెట్టాలి.
- పదిహేను నిమిషాల తర్వాత పనీర్‌ను బయటకు తీసి గ్రేటర్‌తో సన్నగా తురుముకోవాలి.

- మరోవైపు స్టవ్ ఆన్ చేసి పాన్‌లో రెండు లీటర్ల పాలు పోయాలి. పాలు మరుగుతున్నప్పుడు కప్పు పంచదార వేసి కలుపుతూ మరిగించాలి.
- పాలు కాస్త చిక్కగా మారిన తర్వాత పనీర్ తరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. అలాగే ఒక టీ స్పూన్ యాలకుల పొడి, రెండు చిటికెడ్ల కుంకుమపువ్వు, కొన్ని డ్రైఫ్రూట్స్ యాడ్ చేసి కలుపుతూ 15 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

- అంతే తియ్యతియ్యని పనీర్ పాయసం రెడీ అయినట్లే!
- అనంతరం పాయసాన్ని ఫ్రిడ్జ్‌లో పెడితే రెండు రోజుల నిల్వ ఉంటుంది!

- ఈ పద్ధతిని పాటిస్తూ ఇంట్లో చేశారంటే ఇంటిల్లిపాదీ సూపర్ అనాల్సిందే!
- మీరు ఈ పాయసాన్ని ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుంటే పనీర్, పాలతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకోవాలి.
కమ్మని "కీరదోసకాయ పచ్చడి" - ఇలా చేస్తే నోటికి పుల్లగా, కారంగా!
'జీడిపప్పు, కాకరకాయ కారం ఫ్రై' - ఇలా చేశారంటే పిల్లలూ ఇష్టంగా తింటారు!

