కమ్మని "పుదీనా కొబ్బరి చట్నీ" - అన్ని టిఫెన్స్లోకి పర్ఫెక్ట్ - ఈజీగా చేసుకోవచ్చు!
-ఎప్పుడూ చేసే పల్లీ చట్నీ కాకుండా - ఓసారి ఇలా పుదీనా, కొబ్బరి కాంబోతో ట్రై చేయండి, అద్దిరిపోతుంది!

Published : October 28, 2025 at 4:25 PM IST
Tasty Pudina Kobbari Chutney: ఇడ్లీ, దోశ, వడ, బోండా ఇలా టిఫెన్ ఏదైనా ఇష్టంగా తినాలంటే అందులోకి చేసే చట్నీ టేస్టీగా ఉండాలి. అందుకే మెజార్టీ పీపుల్ పల్లీ చట్నీని ప్రిపేర్ చేస్తుంటారు. ఇది టేస్టీగా ఉండటంతో పాటు ఈజీగా చేసుకోవచ్చు. అయితే టిఫెన్స్లోకి ఎప్పుడూ పల్లీ చట్నీనే కాకుండా ఓసారి పుదీనా కొబ్బరి చట్నీ చేయండి. అమోఘంగా ఉంటుంది. తయారు చేసుకోవడం కూడా సులువే. అంతేకాకుండా టిఫెన్ ఏదైనా ఈ చట్నీ కాంబో అద్దిరిపోతుంది. మరి లేట్ చేయకుండా అమోఘమైన పుదీనా కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- నూనె - 2 టీస్పూన్లు
- పచ్చి శనగపప్పు - 1 టీస్పూన్
- మినప్పప్పు - 1 టీస్పూన్
- జీలకర్ర - అర టీస్పూన్
- అల్లం ముక్క - చిన్నది
- వెల్లుల్లి రెబ్బలు - 5
- చింతపండు - 3 రెబ్బలు
- పచ్చిమిర్చి - 5
- పుదీనా ఆకులు - గుప్పెడు
- పుట్నాల పప్పు - పావు కప్పు
- పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా

తాలింపు కోసం:
- నూనె - 2 టీస్పూన్లు
- ఆవాలు - అర టీస్పూన్
- మినప్పప్పు - అర టీస్పూన్
- ఎండుమిర్చి - 3
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఇంగువ - చిటికెడు
తయారీ విధానం:
- ఈ చట్నీ కోసం పచ్చి కొబ్బరిని సన్నగా తురిమి ఓ కప్పు పరిమాణంలో తీసుకుని పక్కన ఉంచాలి. అలాగే తాజా పుదీనా ఆకులను సన్నగా కట్ చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి.
- ఈ పప్పులు వేగిన తర్వాత జీలకర్ర, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, పచ్చిమిర్చి వేసి బాగా కలిపి వేయించాలి.

- వెల్లుల్లి మిశ్రమం కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన పుదీనా తరుగు వేసి మగ్గించాలి.
- పుదీనా ఆకులు మగ్గిన తర్వాత పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి అంతా కలిసేలా మిక్స్ చేసి ఓ నిమిషం మగ్గించాలి.
- అనంతరం స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. మిక్సీజార్లోకి చల్లారిన పుదీనా కొబ్బరి మిశ్రమం, రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

- అస్సలు పలుకు అనేది లేకుండా రుబ్బుకున్న పచ్చడిని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి.
- అందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసుకోవాలి. కాగిన నూనెలో మినప్పప్పు, ఆవాలు వేసి వేయించుకోవాలి.
- అనంతరం ఎండుమిర్చి వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా కరివేపాకు, ఇంగువ వేసి వేయించి గ్రైండ్ చేసిన పచ్చడిలో కలుపుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పుదీనా కొబ్బరి చట్నీ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- ఈ పచ్చడిలో కారం కాస్త తక్కువగానే ఉంటుంది. ఒకవేళ మీకు స్పైసీగా కావాలనుకుంటే మరికొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు.
- పుదీనా, కొబ్బరి తురుము తాజాగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది.
ఉడిపి స్టైల్ "వెజ్ పులావ్" - ఈ మసాలా పేస్ట్ వేసి చేస్తే అద్భుతం - లంచ్బాక్స్లకు పర్ఫెక్ట్!
కమ్మని "ఉసిరికాయల ముక్కల పచ్చడి" - పక్కా కొలతలతో సంవత్సరం నిల్వ!

