ETV Bharat / offbeat

పక్కా కొలతలతో స్వీట్​ షాప్​ స్టైల్​ "బూందీ లడ్డూలు" - నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి!

సంక్రాంతి స్పెషల్​గా "బూందీ లడ్డూలు" - స్వీట్ షాప్ స్టైల్​లో ఈజీగా చేసుకోండిలా!

Tasty Boondi Laddu Recipe
Tasty Boondi Laddu Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : January 9, 2026 at 11:34 AM IST

3 Min Read
Choose ETV Bharat

Tasty Boondi Laddu Recipe: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ మొదలైంది. ఇక సంక్రాంతి అంటే పండక్కి వారం ముందు నుంచే గ్రామాల్లో పిండి వంటల జాతర మొదలవతుంది. ఇంటికి వచ్చే బంధువుల నోరు తీపి చేసేందుకు రకరకాల స్వీట్లు తయారు చేస్తుంటారు. ఈ పండక్కి చేసే స్వీట్స్​లలో అరిసెల తర్వాత బూందీ లడ్డూ స్పెషల్​. నోట్లో వేసుకోగానే కరిగిపోయే వీటిని పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా తింటుంటారు. తయారు చేసుకోవడం కూడా సులువే. పాకం పర్ఫెక్ట్​గా వచ్చిందంటే లడ్డూలు టేస్ట్​ వేరే లెవల్​. ఇక వీటిని ఒక్కసారి చేసి స్టోర్​ చేసుకుంటే సుమారు 20 రోజులపైనే నిల్వ ఉంటాయి. మరి లేట్​ చేయకుండా స్వీట్​ షాప్​ స్టైల్​ కమ్మని బూందీ లడ్డూలు ఎలా చేయాలో చూసేయండి.

Boondi Laddu Recipe
శనగపిండి (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • శనగపిండి - 2 కప్పులు
  • బేకింగ్​ సోడా - చిటికెడు
  • నెయ్యి - పావు కప్పు
  • జీడిపప్పు - అర కప్పు
  • కిస్​మిస్​ - పావు కప్పు
  • పంచదార - 2 కప్పులు
  • యాలకుల పొడి - అర టీస్పూన్​
  • పచ్చ కర్పూరం - చిటికెడు
Boondi Laddu Recipe
నెయ్యి (Getty Images)

తయారీ విధానం:

  • ముందుగా శనగపిండిని జల్లించి ఓ వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. అందులోకి బేకింగ్​ సోడా, కొద్దికొద్దిగా వాటర్​ పోసుకుంటూ అస్సలు ఉండలు లేకుండా బజ్జీల పిండి కన్నా కాస్త పల్చగా కలుపుకోవాలి.
  • పిండిని పర్ఫెక్ట్​గా కలుపుకున్నాక స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • నూనె కాగినాక కలిపి పెట్టుకున్న శనగపిండిని ఏదైనా గ్లాస్​ లేదా గిన్నెతో తీసుకుని బూందీ గరిటెలో పోసుకుని చేతితో అంటుంటే బూందీ నూనెలో పడుతుంది.
Boondi Laddu Recipe
పంచదార (Getty Images)
  • ఇలా కడాయికి సరిపడా వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి మరీ క్రిస్పీగా కాకుండా పైన కాస్త క్రిస్పీగా, లోపల సాఫ్ట్​గా వచ్చేవరకు ఫ్రై చేసుకుని జల్లి గరిటెతో తీసుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఇలా పిండి మొత్తాన్ని బూందీ గరిటె సాయంతో బూందీల్లాగా వేసుకుని కాల్చుకుని తీసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసినాక అందులో నుంచి కొద్దిగా తీసుకుని మిక్సీజార్​లోకి వేసుకుని కాస్త బరకగా గ్రైండ్​ చేసుకోవాలి.
Boondi Laddu Recipe
డ్రైఫ్రూట్స్​ (Getty Images)
  • స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి పావు కప్పు నెయ్యి వేసి కరిగించాలి. కాగిన నెయ్యిలో జీడిపప్పు పలుకులు వేసి వేయించాలి.
  • ఇవి సగం మేర వేగినాక కిస్​మిస్​ వేసి వేయించాలి. జీడిపప్పు, కిస్​మిస్​ మంచి గోల్డెన్​ కలర్​లోకి మారినాక పాన్​ను దింపి పక్కన పెట్టుకోవాలి.
  • అదే స్టవ్​ మీద అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి పంచదార, 1 కప్పు నీళ్లు పోసి కరిగించుకోవాలి.
  • పంచదార పూర్తిగా కరిగినాక లేత తీగ పాకం వచ్చేవరకు మరిగించాలి. పాకం రాగానే స్టవ్​ ఆఫ్​ చేసి పాన్​ను దింపి అందులో యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.
Boondi Laddu Recipe
యాలకులు (Getty Images)
  • అదే పాకంలోకి వేయించిన బూందీ, గ్రైండ్​ చేసిన బూందీ పౌడర్​, పచ్చ కర్పూరం, వేయించిన జీడిపప్పు, కిస్​మిస్​ను నెయ్యితో సహా వేసుకుని అంతా కలిసేలా మిక్స్​ చేసుకుని మూత పెట్టి కొద్దిసేపు పక్కన ఉంచాలి.
  • బూందీ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి.
  • ఇలా మిశ్రమం మొత్తాన్ని లడ్డూలుగా చుట్టుకుని ఓ గంటసేపు అలానే వదిలేయాలి. లడ్డూలు ఆరినాక గాలి చొరబడని డబ్బాలో స్టోర్​ చేస్తే ఎంతో రుచికరంగా ఉండే బూందీ లడ్డూలు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Boondi Laddu Recipe
బూందీ లడ్డూలు (ETV Bharat)

చిట్కాలు:

  • శనగపిండి మిశ్రమం అనేది మరీ గట్టిగా, మరీ లూజుగా కాకుండా బజ్జీల పిండి కన్నా కాస్త పల్చగా ఉండేలా కలుపుకోవాలి.
  • బూందీ గరిటెను మరీ నూనెకు తగిలేలా కాకుండా కాస్త పైకి పెట్టి పిండిని దూస్తుంటే శనగపిండి మంచి రౌండ్​ షేప్​లో బూందీల్లాగా పడుతుంది. బూందీ గరిటెను కడాయికి ఆనిస్తే తోకల్లాగా పడుతుంది.
  • బూందీ లడ్డూలు పర్ఫెక్ట్​గా రావాలంటే లేత తీగపాకం రావాలి. పాకం రాగానే స్టవ్​ ఆఫ్​ చేసి పాన్​ను దింపాలి. పాకం ముదిరితే లడ్డూలు సరిగ్గా రావు.
  • శనగపిండిని ఏ కప్పుతో తీసుకుంటే అదే కప్పుతో పంచదార, నీళ్లు వంటివి తీసుకోవాలి. ఇవి కప్పు కొలత ప్రకారం. అదే కేజీల ప్రకారం తీసుకుంటే కేజీ శనగపిండికి మీరు తినే తీపిని బట్టి కేజీన్నర నుంచి రెండు కేజీల మధ్యలో పంచదార తీసుకోవాలి.

  • మినప్పప్పుతో "మైసూర్ బోండాలు" - టిఫెన్ సెంటర్​ మాదిరి రుచిగా ఉంటాయి!

పండక్కి పసందైన "రవ్వ జిలేబీ" - తక్కువ పదార్థాలతో సింపుల్​గా రెడీ!