చల్లని వేళ నోరూరించే "చంద్రముఖి చికెన్ ఫ్రై" - తిన్నారంటే లక లక లక అనాల్సిందే!
రెగ్యులర్ చికెన్ కర్రీలను మించిన టేస్ట్ - ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకోవడం పక్కా!

Published : February 24, 2026 at 10:46 AM IST
Chandramukhi Chicken Fry in Telugu : వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చాలా మందికి స్పైసీ స్పైసీగా నాన్‌వెజ్ రుచులను ఆస్వాదించాలని ఉంటుంది. ఈ క్రమంలోనే ఎక్కువ మంది చికెన్‌తో రకరకాల రెసిపీలు ప్రిపేర్ చేసుకుని ఆరగిస్తుంటారు. అయితే, చికెన్ కర్రీని ఎప్పుడూ తినే రుచిలో కాకుండా ఈసారి కాస్త వెరైటీగా ట్రై చేయండి. అదే, నోరూరించే "చంద్రముఖి చికెన్ ఫ్రై". ఆంధ్ర క్యాటరింగ్ స్టైల్లో సూపర్ టేస్టీగా ఉండే ఈ చికెన్ వేపుడును ఇంటిల్లిపాదీ ముక్క మిగల్చకుండా కమ్మగా తినేస్తారు. ఈ ఫ్రై స్టార్టర్‌గా కూడా అద్దిరిపోతుంది. మరి, మంచి ఘాటైన గ్రేవీ కోటింగ్‌తో స్పైసీ స్పైసీగా ఉండే ఈ చికెన్ ఫ్రైను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
ఫ్రై కోసం :
- చికెన్ - కేజీన్నర
- నూనె - తగినంత
- లవంగాలు - నాలుగు
- యాలకులు - మూడు
- దాల్చిన చెక్క - చిన్న ముక్క
- జీడిపప్పులు - ఆరు టేబుల్‌స్పూన్లు
- సన్నని ఉల్లిపాయ తరుగు - ఒకటిన్నర కప్పు
- కరివేపాకు - కొద్దిగా
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - మూడు చెంచాలు
- కసూరి మేతి - కొద్దిగా
- కారం, ఉప్పు - రుచికి తగినంత
- ఎండుకొబ్బరి పొడి - నాలుగు చెంచాలు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- నిమ్మరసం - కొద్దిగా
- చెట్టినాడు మసాలా పొడి - రెండు టీస్పూన్లు

మసాలా పేస్ట్ కోసం :
- నూనె - ఏడెనిమిది చెంచాలు
- లవంగాలు - ఆరేడు
- అనాసపువ్వు - ఒకటి
- యాలకులు - నాలుగు
- దాల్చినచెక్క - మూడించుల ముక్క
- మిరియాలు - రెండు టీస్పూన్లు
- ఎండుమిర్చి - ఆరేడు
- జీలకర్ర - రెండు టీస్పూన్లు
- ధనియాలు - నాలుగు టేబుల్‌స్పూన్లు
- సోంపు - రెండు టీస్పూన్లు
- ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
- పచ్చిమిర్చి - నాలుగు
ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలనే "చేపల కుర్మా" - పిల్లలకూ బాగా నచ్చేస్తుంది!

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా ఒక గిన్నెలో శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కలను తీసుకోవాలి.
- ఆపై అందులో రెండున్నర కప్పుల నీళ్లు, అరటీస్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుతూ రెండు మూడు నిమిషాలు ఉడికించాలి.
- ఆ తర్వాత గిన్నెపై మూత పెట్టి ముక్క 70 నుంచి 80 శాతం ఉడికే వరకు మధ్యమధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి.
- చికెన్ ఉడికేలోపు రెసిపీలోకి కావాల్సిన స్పెషల్ మసాలా పేస్ట్‌ను రెడీ చేసుకోవాలి.
- ఇందుకోసం స్టవ్ మరో బర్నర్ మీద పాన్‌లో ఏడెనిమిది టేబుల్స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి.

- ఆయిల్ కాగిన తర్వాత లవంగాలు, అనాసపువ్వు, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు వేసి అర నిమిషం పాటు వేయించాలి.
- ఆ తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, సోంపు వేసి మసాలాలు కాస్త పొంగే వరకు వేయించుకోవాలి.
- ఇక్కడ మసాలాలను మరీ ఎర్రగా వేయించుకోవద్దు. అలా వేయిస్తే కూర చేదు వస్తుందని గుర్తుంచుకోవాలి.
- మసాలాలను ఆవిధంగా వేయించుకున్నాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తుంపలు వేసి ఆనియన్స్ కాస్త రంగు మారేంత వరకు వేయిచుకోవాలి.
- అలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకుంటే మసాలా పేస్ట్ రెడీ అవుతుంది!
- ఇప్పుడు స్టవ్ మీద ఉడుకుతున్న చికెన్ 80 శాతం కుక్ అయ్యిందనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమంలో నుంచి చికెన్ ముక్కలను వడకట్టేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచాలి.

- నెక్ట్స్ ఫ్రై కోసం స్టవ్ మీద కడాయిలో అర కప్పు నూనె వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, జీడిపప్పులు వేసి వేయించాలి.
- జీడిపప్పులు లైట్‌గా వేగాక కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ తరుగు, రుచికి తగినంత ఉప్పు వేసి కలుపుతూ ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఉల్లిపాయ ముక్కలు వేగాక కరివేపాకు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి.
- ఆ తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి ఉల్లిపాయ మిశ్రమంలో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి.

- అనంతరం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మిశ్రమాన్ని వేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి అడుగంటకుండా కలుపుతూ చికెన్ మిశ్రమంలో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి.
- ఆవిధంగా వేయించుకున్నాక కసూరిమేతిని చేతితో నలిపి వేసుకోవాలి. ఆపై రుచికి తగినంత కారం వేసుకుని కలుపుకోవాలి.
- ఒకవేళ కర్రీ అడుగంటుతున్నట్లనిపిస్తే కొద్దిగా నీళ్లను చిలకరించుకుని కలుపుతూ బాగా వేయించుకోవాలి.
- కారాలు మంచిగా వేగాక చివరగా ఎండుకొబ్బరి పొడిని వేసుకుని మూడ్నాలుగు నిమిషాలు కలుపుతూ వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

- ఆ తర్వాత సన్నని కొత్తిమీర తరుగు, నిమ్మరసం పిండుకుని, చెట్టినాడు మసాలా పౌడర్ వేసుకుని అంతా కలిసేలా బాగా టాస్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలు.
- అంతే, ఆంధ్ర క్యాటరింగ్ స్టైల్లో స్పైసీ స్పైసీగా నోరూరించే "చంద్రముఖి చికెన్ ఫ్రై" రెడీ అవుతుంది!
- ఇక్కడ చెట్టినాడు మసాలా పొడి లేనివారు నార్మల్ గరంమసాలా వేసుకున్నా సరిపోతుంది.
- మరి, నచ్చితే ఈ చల్లని వేళ మీరూ ఓసారి ఇలా చంద్రముఖి చికెన్ వేపుడును ట్రై చేయండి. తిన్నవారేవరైనా సరే ఈ కర్రీ అద్భుతమైన టేస్ట్‌కు లక లక లక లక అనాల్సిందే!
ఎన్నడూ ట్రై చేయని కొత్తరకం "టమాటా పచ్చడి" - తక్కువ టైమ్‌లో ఎక్కువ రుచికరంగా!
పిల్లల కోసం అప్పటికప్పుడు చేసే క్రిస్పీ "స్నాక్" - నెల రోజులు కరకరలాడుతూ కమ్మగా తినేయొచ్చు!

