చిలగడదుంపలతో "ఫ్రూట్ కస్టర్డ్" - కస్టర్డ్ పౌడర్ అవసరం లేదు - చాలా టేస్టీ!
-సరికొత్తగా ఫ్రూట్ కస్టర్డ్ - చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు!

Published : February 25, 2026 at 3:28 PM IST
Sweet Potato Fruit Custard: మెజార్టీ పీపుల్ ఇష్టంగా తినే డెజర్ట్‌లలో ఫ్రూట్ కస్టర్డ్ ఒకటి. రకరకాల పండ్లతో తయారు చేసే ఈ రెసిపీని చల్లచల్లగా తింటుంటే సూపర్‌గా ఉంటుంది. అయితే ఫ్రూట్ కస్టర్డ్ చేయాలంటే కార్న్‌ఫ్లోర్ లేదా కస్టర్డ్ పౌడర్ కంపల్సరీ. ఇవి ఉంటనే క్రిమీగా ఉంటుంది. కానీ మీకు తెలుసా ఇవేమి లేకుండా కూడా టేస్టీ అండ్ క్రిమీ ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోవచ్చు. అందుకోసం స్వీట్ పొటాటోలు ఉంటే సరిపోతుంది. మీరు విన్నది నిజమే. చిలగడదుంపలతో రుచికరమైన ఫ్రూట్ కస్టర్డ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తయారు చేసుకోవడం చాలా సింపుల్. మరి లేట్ చేయకుండా స్వీట్ పొటాటో ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- పాలు - అర లీటర్
- స్వీట్ పొటాటోలు - 4(మీడియం సైజ్)
- జీడిపప్పులు - 10
- బాదం పప్పులు - 10
- బ్రౌన్ షుగర్ - 2 టేబుల్‌స్పూన్లు
- వెనీలా ఎసెన్స్ - అర టీస్పూన్
- అరటి పండు - 1
- దానిమ్మ గింజలు - 1 కప్పు
- గ్రేప్స్ - 1 కప్పు
- యాపిల్ - 1
- సన్నగా కట్ చేసిన డ్రైఫ్రూట్స్ - కొన్ని

తయారీ విధానం:
- ఓ గిన్నెలోకి బాదం పప్పులు, జీడిపప్పులు తీసుకుని వేడి నీరు పోసి సుమారు అరగంట సేపు నానబెట్టుకోవాలి.
- ఈలోపు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి చిక్కటి పాలు పోసి మరిగించాలి. పాలను మరిగించేటప్పుడు చిటికెడు కుంకుమపువ్వు వేసుకోవడం మర్చిపోవద్దు. ఈలోపు మరో స్టవ్ ఆన్ చేసి చిలగడదుంపలను ఆవిరికి ఉడికించాలి.

- పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. అదే విధంగా ఉడికించిన చిలగడదుంపలపై పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు నానిన బాదంపప్పులపై ఉండే పొట్టు తీసేసుకోవాలి.

- పాలు చల్లారినాక మిగిలిన ప్రాసెస్ చేసుకోవాలి.అందుకోసం మిక్సీజార్‌లోకి కట్ చేసిన చిలగడదుంప ముక్కలు, నానిన జీడిపప్పు, బాదం పప్పులు, బ్రౌన్ షుగర్, వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కాచి చల్లార్చిన పాలను కొద్దికొద్దిగా పోసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసిన మిక్స్‌ను వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. అయితే ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా, మరీ పల్చగా కాకుండా ఉండేలా పాలను యాడ్ చేసుకోవాలి.

- ఈ బౌల్‌ను ఫ్రిజ్‌లో సుమారు 1 గంట సేపు ఉంచాలి. ఈలోపు అరటి పండు, దానిమ్మ, గ్రేప్స్, యాపిల్‌ను సన్నగా కట్ చేసుకోవాలి.
- గంట తర్వాత గిన్నెను ఫ్రిజ్ నుంచి తీసి అందులోకి పండ్లు, డ్రైఫ్రూట్స్ పలుకులు వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చిలగడదుంప ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- బ్రౌన్ షుగర్ బదులు పంచదార లేదా బెల్లం వాడుకోవచ్చు. అయితే చిలగడదుంపలు తియ్యగానే ఉంటాయి కాబట్టి వీటిని చూసి యాడ్ చేసుకోవాలి.
- కుంకుమ పువ్వు లేకపోతే పాలలో చిటికెడు పసుపు వేసి మరిగించి అయినా యాడ్ చేసుకోవచ్చు.
- అప్పటికప్పుడు పాలు మరిగించకపోయినా చేసుకోవాలనుకునే సమయానికి ముందుగానే పాలను కాగబెట్టి ఫ్రిజ్‌లో ఉంచి ఆ తర్వాత వాడుకున్నా సరిపోతుంది.
- పైన చెప్పిన ఫ్రూట్స్ మాత్రమే కాకుండా మీకు నచ్చిన ఇతర పండ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు.
చికెన్ స్టఫింగ్తో "మిర్చి బజ్జీలు" - కిర్రాక్ టేస్ట్‌తో అద్దిరిపోతాయి!
ఎండాకాలం వచ్చేస్తోంది - పెరుగు పుల్లగా మారకూడదంటే ఈ చిట్కాలు బెస్ట్!

