పాతకాలం పద్ధతిలో "రాగి అంబలి" - తయారీ సింపుల్ - టేస్ట్ వేరే లెవల్!
ఎండాకాలం ఆరోగ్యానికి మేలుచేసే అద్భుతమైన రెసిపీ - ప్రతి ఒక్కరూ తప్పక తాగాల్సిందే!

Published : February 27, 2026 at 3:18 PM IST
Summer Special Ragi Malt: ఎండలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఇక ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది రకరకాల జావలు తాగుతుంటారు. మరీ ముఖ్యంగా రాగి అంబలిని ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటుంటారు. సమ్మర్లో రాగి జావ తాగడం వల్ల బాడీ కూల్ అవుతుంది. అయితే ఈ జావను అందరూ చేస్తుంటారు కానీ కొద్దిమంది మాత్రమే టేస్టీగా చేస్తుంటారు. అయితే ఇకపై అంబలి చేసేటప్పుడు ఈ ప్రాసెస్ ఫాలో అయితే ప్రతి ఒక్కరూ టేస్టీగా ప్రిపేర్ చేయవచ్చు. తయారు చేసుకోవడం కూడా సులువే. మరి లేట్ చేయకుండా ఆరోగ్యానికి మేలు చేసే రాగి అంబలి ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- రాగి పిండి - ముప్పావు కప్పు
- నీళ్లు - సరిపడా
- పెరుగు - 1 కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా
- జీలకర్ర పొడి - అర టీస్పూన్
- ఉల్లిపాయ - 1
- పచ్చిమిర్చి - 2
- కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:
- మిక్సింగ్ బౌల్లోకి రాగి పిండిని తీసుకుని 1 కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన ఉంచాలి.
- స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి పాన్ పెట్టి 4 కప్పుల వాటర్ పోసుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు సిమ్‌లో పెట్టి కలిపి పెట్టుకున్న రాగి పిండిని తీసుకుని ఉండలు లేకుండా కలుపుతూ ఉడికించాలి.
- రాగి పిండి మిశ్రమం ఉడికి చిక్కని పేస్ట్‌లా మారినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి.

- రాగి మిశ్రమం కూల్ అయినాక గరిటెతో ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దను కొద్దికొద్దిగా తీసుకుని బాల్స్ లాగా చేసుకోవాలి.
- వెడల్పాటి మిక్సింగ్ బౌల్లోకి లీటర్ నీళ్లు పోసుకుని ప్రిపేర్ చేసుకున్న రాగి బాల్స్ వేసుకుని మూత పెట్టి రాత్రంతా పులియబెట్టాలి.
- మరుసటి రోజు ఉదయం పులిసిన రాగి ముద్దలను అదే నీటిలో కలుపుతూ చిక్కగా చేసుకోవాలి. అస్సలు ఉండలు లేకుండా అంతా కలిసేలా మిక్స్ చేసుకుని రెడీగా ఉంచాలి.
- ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయను వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి.
- రాగి పిండిలోనికి పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి.
- ఈ విధంగా కలుపుకున్నాక అందులోకి జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ తరుగు వేసి కలిపి సర్వ్ చేసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే రాగి అంబలి రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- కచ్చితంగా ఉడికించిన రాగి పిండిని నీటిలో రాత్రంతా పులియబెట్టాలి. ఇలా చేయడం వల్లనే పోషకాలు శరీరానికి అందుతాయి.
- రాగి పిండి చక్కగా ఉడికి చిక్కని పేస్ట్‌లా మారి పాన్‌కు అంటుకోకుండా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
- పెరుగు తాజాది తీసుకుంటేనే అంబలి రుచి బాగుండి పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు.
- రాగి ముద్దలను పులియబెట్టడానికి స్టీల్ గిన్నెల బదులు మట్టి పాత్రలు వాడితే రుచితో పాటు ఆరోగ్యం కూడా.
- రాగి అంబలిలో అల్లం తరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అంబలిని తాగేముందు కాస్త నిమ్మరసం కలుపుకుంటే ఎక్ట్స్రా రుచిగా ఉంటుంది.
తెలంగాణ స్టైల్లో సూపర్ టేస్టీ "సల్ల చారు" - ఒంటికి చలువ, పొట్టకి హాయిగా!
పల్లీలు, టమాటాలతో కిర్రాక్ "చట్నీ" - 10 నిమిషాల్లో రెడీ - అన్ని టిఫెన్స్లోకి అదుర్స్!

