'జెన్ జీ' యువతకు శ్రీకృష్ణుడు ఆనాడే ఏం చెప్పారంటే! - శ్రీ కృష్ణ జన్మాష్టమి - ఒక కొత్త వైబ్!
కాలం, తరాలు మారినా కృష్ణుడు ఎప్పటికీ కొత్తగానే! - కృష్ణతత్వం చెప్పే జీవిత పాఠాలు అనేకం

By ETV Bharat Andhra Pradesh Team
Published : September 1, 2026 at 5:21 PM IST
|Updated : September 3, 2026 at 9:34 AM IST
Srikrishna Janmashtami 2026 : కృష్ణుడంటే కేవలం వేణువు, వెన్నదొంగతనం, గోపికలు, ఉట్ల వేడుకలు మాత్రమే కాదు. కష్టాల్లో ధైర్యం చెప్పే స్నేహితుడు, సమస్యల్లో సరైన దారి చూపే గురువు, సంక్షోభంలో నిర్ణయం తీసుకునేలా చేసే మార్గదర్శి, ప్రకృతిని కాపాడాలని చెప్పే సంరక్షకుడు. అందుకే వేల ఏళ్ల కిందట కృష్ణుడు చెప్పిన మాటలు నేటి తరానికీ అంతే సులభంగా అర్థమవుతున్నాయి, ఆదర్శవంతంగా ఉంటున్నాయి.
జన్మాష్టమి అంటే సాధారణంగా పూజలు, భజనలు, ఉట్ల వేడుకలు గుర్తుకొస్తాయి. అయితే కాలంతో పాటు పండుగలను చూసే విధానం కూడా మారుతోంది. ఈ జన్మాష్టమికి కృష్ణుడి జీవితాన్ని, ఆయన బోధనలను నేటి యువత ఎదుర్కొంటున్న సమస్యలతో అనుసంధానించుకుంటే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి.
కష్టాల్లో ధైర్యం చెప్పే స్నేహితుడు
కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు తీవ్రంగా కలత చెందినప్పుడు కృష్ణుడు అతనికి అండగా నిలిచాడు. కేవలం ఓదార్పు చెప్పకుండా, తన కర్తవ్యాన్ని నిర్వర్తించేలా ధైర్యం ఇచ్చాడు. భయంతో వెనక్కి తగ్గవద్దని సూచించాడు.
నేటి యువత కూడా చదువు, ఉద్యోగం, కెరీర్, సంబంధాలు, భవిష్యత్తు వంటి ఎన్నో విషయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో సమస్య నుంచి పారిపోవడం కంటే, ప్రశాంతంగా ఆలోచించి పరిష్కారం వెతకాలని కృష్ణుడి బోధలు చెబుతున్నాయి.
ఫలితం కంటే ప్రయత్నంపైనే దృష్టి
'కర్మణ్యేవాధికారస్తే' అనే గీతా సందేశం నేటి జీవితానికి కూడా ఎంతో దగ్గరగా ఉంటుంది. పరీక్షలో ర్యాంక్ వస్తుందా? ఉద్యోగం వస్తుందా? ప్రమోషన్ వస్తుందా? అనుకున్న విజయం దక్కుతుందా? అనే ఆలోచనల్లో చాలామంది తమ ముందున్న పనిపై దృష్టి కోల్పోతారు.
మన చేతిలో ఉన్నది ప్రయత్నం. ఫలితం పూర్తిగా మన నియంత్రణలో ఉండకపోవచ్చు. అందుకే ఫలితం గురించి అతిగా ఆలోచించకుండా, చేయాల్సిన పనిని శ్రద్ధగా చేయాలన్నది కృష్ణుడి సందేశం.
ఓవర్ థింకింగ్‌కు చెక్
జరిగిపోయిన విషయాల గురించి ఆలోచించి బాధపడటం, భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఆందోళన చెందడం, ఈ రెండింటి మధ్య ప్రస్తుతాన్ని మర్చిపోవడం నేటి యువతలో సాధారణంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో 'ఇప్పుడు నేను ఏం చేయాలి?' అని ఆలోచించడం సమస్యకు పరిష్కారం చూపే మొదటి అడుగు. పరిస్థితులు ఎలా ఉన్నా మనసును స్థిరంగా ఉంచుకోవాలని గీత బోధిస్తుంది.
ఆవేశంలో నిర్ణయాలు వద్దు
సోషల్ మీడియాలో ఒక కామెంట్, స్నేహితుడితో చిన్న గొడవ, ఆఫీస్ లో ఒక మాట, సంబంధాల్లో అపార్థం! ఇలా చిన్న విషయాలకే వెంటనే స్పందించడం వల్ల సమస్యలు మరింత పెరుగుతాయి. కోపంలో తీసుకున్న నిర్ణయాలు చాలాసార్లు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది. అందుకే ముందుగా మనసును శాంతపరుచుకుని, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలన్న పాఠాన్ని కృష్ణుడి బోధనల నుంచి నేర్చుకోవచ్చు.
గెలుపైనా, ఓటమైనా సమానంగానే
జీవితంలో విజయం, వైఫల్యం రెండూ సహజమే. ఒక విజయం వచ్చినంత మాత్రాన మనం ఎప్పటికీ విజేతలం కాదు. అలాగే ఒక ఓటమి మన సామర్థ్యానికి ముగింపు కాదు. గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కుంగిపోకుండా ముందుకు సాగడం నేటి పోటీ ప్రపంచంలో ఎంతో అవసరం. గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్న 'సమత్వం' భావన ఇక్కడ ఉపయోగపడుతుంది.
శ్రీ కృష్ణుడు - అసలైన 'ఫ్రెండ్ షిప్ ఐకాన్'
బృందావనంలో గోపాలకులతో కలిసి ఆడిపాడిన కృష్ణుడు, కష్టసుఖాలను స్నేహితులతో పంచుకున్నాడు. అదే కృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడికి మార్గదర్శిగా నిలిచాడు. అంటే స్నేహితుడిగా సరదాగా ఉండటమే కాదు! అవసరమైనప్పుడు సరైన సలహా ఇవ్వడం కూడా నిజమైన స్నేహమే. ఆపదలో అండగా నిలిచే స్నేహితుడి విలువను కృష్ణుడి జీవితం గుర్తు చేస్తుంది.
ఎన్నో పాత్రలు, ఒకే వ్యక్తి
కృష్ణుడి జీవితంలో ఎన్నో పాత్రలు కనిపిస్తాయి. బాలుడిగా, ఆబాల గోపాలుడిగా, స్నేహితుడిగా, రాజుగా, రాయబారిగా, రథసారథిగా, గురువుగా ఆయన తన బాధ్యతలను నిర్వర్తించాడు.
జీవితంలో పరిస్థితులకు అనుగుణంగా పాత్రలు మారినా, ప్రతి బాధ్యతను సక్రమంగా నిర్వహించాలన్న సందేశాన్ని ఇది అందిస్తుంది. నేటి భాషలో చెప్పాలంటే కృష్ణుడు ఒక 'మల్టీటాస్కర్'!
ప్రకృతిని ప్రేమిద్దాం
కృష్ణుడి జీవితంలో ప్రకృతికి ప్రత్యేక స్థానం ఉంది. గోవులు, చెట్లు, కొండలు, నదులతో ఆయనకు ఉన్న అనుబంధం పురాణ కథల్లో కనిపిస్తుంది. గోవర్ధన గిరి కథ కూడా ప్రకృతి ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తుంది.
నేటి కాలంలో పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమైన అంశంగా మారింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ప్రకృతిని గౌరవించడం, చెట్లు, పశుసంపదను కాపాడుకోవడం వంటి విషయాల్లో కృష్ణుడి కథలు మనకు స్ఫూర్తినిస్తాయి.
ఈ జన్మాష్టమి ఇలా జరుపుకొందాం!
ప్లాస్టిక్ కు దూరంగా ఉట్ల వేడుక: ఉట్ల వేడుకల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం. పర్యావరణానికి హాని కలిగించని సహజ పదార్థాలతో వేడుకలను నిర్వహిద్దాం. పండుగ ఆనందంతో పాటు ప్రకృతి సంరక్షణకూ ప్రాధాన్యం ఇద్దాం.
సందేశాలకే పరిమితం కాకుండా, స్నేహితులను కలుద్దాం: పండుగ శుభాకాంక్షలను కేవలం సందేశాల ద్వారా పంపించడంతో సరిపెట్టకుండా, చిన్ననాటి స్నేహితులను ఒకచోట కలుద్దాం. కలిసి మాట్లాడుకుందాం. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం. ఆ స్నేహబంధం ఇచ్చే ఆనందం ప్రత్యేకమే.
వేణుగానంతో మనసుకు ప్రశాంతత : ఎప్పుడూ గట్టిగా వినిపించే సంగీతానికి కాసేపు విరామం ఇచ్చి వేణుగానాన్ని ఆస్వాదిద్దాం. మృదువైన స్వరాలు మనసుకు ప్రశాంతతను కలిగించి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.
ఆహారంపై అపరాధ భావన వద్దు : ఆరోగ్యం కోసం ఆహార నియమాలు పాటించడం మంచిదే. అయితే పండుగ రోజు ఇంట్లో తయారుచేసిన సంప్రదాయ ఆహారాలను మితంగా ఆస్వాదించడంలో తప్పులేదు.
పనినే పూజగా భావిద్దాం : అనవసరంగా తెరపై సందేశాలు, వినోద కార్యక్రమాలు చూస్తూ సమయాన్ని వృథా చేయకుండా మన లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. మనకు నచ్చిన మంచి పనిని శ్రద్ధగా చేయడమే ఆధునిక కాలంలో కృష్ణుడి కర్మయోగాన్ని ఆచరించే మార్గం.
కృష్ణుడంటే భయభక్తులతో దూరం పెట్టే దేవుడు కాదు మనలో ఒకడిగా కలిసి పోయి, మనకు సరైన దారి చూపే కాలంతో పాటు మారే మానవ మనస్తత్వాలను, ఆధునిక సవాళ్లను ముందే ఎరిగిన 'మోస్ట్ రిలేటబుల్ ఐకాన్". చిలిపి అల్లరి చేసే స్నేహితుడిగా, సంక్షోభంలో ఆదుకునే మెంటార్గా, ఒత్తిడిని జయించమనే సైకాలజిస్ట్ గా, ప్రకృతిని ప్రేమించే ఎకో-ఫ్రెండ్లీ లీడర్‌గా! ప్రతి తరం తనను తాను ప్రతిబింబించుకునే ఒకే ఒక్క పూర్ణ పురుషుడు కృష్ణయ్య.
అందుకే కాలం మారినా, తరాలు మారినా, కృష్ణుడు మాత్రం ఎప్పటికీ కొత్తగానే కనిపిస్తాడు.
'వినాయకుడు, శ్రీకృష్ణుడు' మీ ఇంటికి వచ్చేది ఈ నెలలోనే! - సెప్టెంబర్‌లో దాదాపు 'ప్రతి రోజూ పండగే'!
ఆ గుడిలో చేసే 'పాయసం' కోసం శ్రీకృష్ణుడే రోజూ వస్తాడట! - ఎందుకో తెలుసా?

