టేస్టీ అండ్ స్పైసీ "వెల్లుల్లి కారం పచ్చడి" - వేడివేడి అన్నంలోకి అమృతమే!
-వెల్లుల్లి, ఎండుమిర్చి కాంబినేషన్లో అద్దిరిపోయే పచ్చడి - చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది!

Published : November 4, 2025 at 1:33 PM IST
Spicy Vellulli Kaaram Pachadi: వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలో వెల్లుల్లి కారం వేసి తింటుంటే ఆ కిక్కే వేరు. అందుకే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, నోటికి కారంగా తినాలనిపించినప్పుడల్లా చాలా మంది ఈ కారం ప్రిపేర్ చేస్తుంటారు. అయితే దీనిని కూడా చాలా మంది చాలా పద్ధతుల్లో చేస్తుంటారు. కాగా, ఎప్పుడూ చేసేలా కాకుండా ఈ స్టైల్లో వెల్లుల్లి కారం పచ్చడి చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. కారంగా, కమ్మగా ఉంటుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి మాత్రమే కాదు, ఇడ్లీ, దోశ వంటి టిఫెన్స్లోకి కూడా కలిపి తినవచ్చు. మరి లేట్ చేయకుండా కమ్మని వెల్లుల్లి కారం పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేయండి.
కావాల్సిన పదార్థాలు:
- ఎండు మిరపకాయలు - 100 గ్రాములు
- వెల్లుల్లి - 7
- పసుపు - అర టీస్పూన్
- జీలకర్ర - 3 చెంచాలు
- ఉప్పు - రుచికి సరిపడా

తాలింపు కోసం:
- నూనె - 3 టేబుల్‌స్పూన్లు
- దంచిన వెల్లుల్లి రెబ్బలు - 10
- ఆవాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- కరివేపాకు - గుప్పెడు
- ఎండుమిర్చి - 3

తయారీ విధానం:
- ముందుగా వెల్లుల్లిని వలిచి పాయలుగా సెపరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిపై ఉండే పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఎండుమిర్చి తొడిమలు తీసేసి పక్కన పెట్టుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఎండుమిర్చి మంచిగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
- ఇప్పుడు మిక్సీజార్‌లోకి జీలకర్ర వేసి ఓసారి గ్రైండ్ చేసుకోవాలి. ఆపై అందులోకి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

- చివరగా అందులోకి వేయించిన ఎండుమిర్చి, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి.

- ఆయిల్ కాగిన తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేయాలి. అనంతరం జీలకర్ర, ఆవాలు వేసి చిటపటలాడించాలి.
- చివరగా కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించి గ్రైండ్ చేసిన వెల్లుల్లి మిశ్రమం వేసి ఓ రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసి ఓ గిన్నెలోకి తీసుకుంటే సరి. ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి కారం పచ్చడి రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- ఎండుమిర్చిని మీరు తినే కారానికి సరిపడా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఎండుమిర్చి లేకపోతే దాని బదులు ఎండు కారాన్ని వేసుకోవచ్చు. దానిని వెల్లుల్లి రెబ్బల్లో వేసి రుబ్బుకోవాలి. అయితే ఈ పచ్చడి కాస్త కారంగా ఉంటే బాగుంటుంది.
- వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి వాడుకుంటే పచ్చడి రుచి బాగుంటుంది.
కార్తిక పౌర్ణమి వేళ - నోరూరించే "చలిమిడి ప్రసాదం"! - ఈజీగా చేసుకోండిలా!
సింపుల్ పద్ధతిలో "పల్లీ చట్నీ" - హోటల్ టేస్ట్‌లో అద్దిరిపోవాల్సిందే!

