ETV Bharat / offbeat

"సర్" వస్తున్నారు! మీ ఓటు జాగ్రత్త" - ఓటరు జాబితాలో ఉంచాలన్నా, తీసేయాలన్నా ఇపుడే!

తెలుగు రాష్ట్రాల్లో "SIR"కు సన్నాహాలు - ముఖ్యమైన తేదీలివే!

sir_in_ap_and_telangana
sir_in_ap_and_telangana (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 3, 2026 at 10:34 AM IST

3 Min Read
Choose ETV Bharat

Special Intensive Revision SIR 2026 : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)కు సమయం సమీపించింది. మూడో విడతలో భాగంగా ఏపీలోనూ ఓటర్ల జాబితా ప్రక్షాళన జరగనుంది. 2002 తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మరో సారి ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా ఓటర్ల జాబితా పరిశీలన, ఇంటింటికీ వెళ్లి ధ్రువీకరణ, ముసాయిదా జాబితా ప్రకటన అనంతరం ఫిర్యాదులు పరిశీలించి చివరగా తుది జాబితా ప్రకటించడంతో "సర్" పూర్తవుతుంది.

మూడో దశలో

సర్ ప్రక్రియ మొదటి దశ 2025 జూన్ నుంచి సెప్టెంబర్ వరకు బీహార్​లో విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత రెండో దశలో నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో పూర్తి చేశారు. ఇందులో యూపీ, గుజరాత్, రాజస్థాన్, బెంగాళ్, తమిళనాడు, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్​గడ్ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరి, అండమాన్, లక్షద్వీప్ ఉన్నాయి.

ఇక తాజాగా మూడో దశలో భాగంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరాఖండ్, మేఘాలయ, మిజోరం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల్లో జరగనుంది. అదే విధంగా దిల్లీ, చండిగఢ్, దాద్రానగర్ హవేలి, డయ్యూడమన్ కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తి చేయనున్నారు.

హిమాచల్​ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్ లో సర్ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది.

"యమునా పుష్కరాల స్పెషల్" - అయోధ్య-కాశీ పుణ్యక్షేత్ర యాత్ర

"సర్‌" ఎలా నిర్వహిస్తారు? ఓటర్లు ఏయే వివరాలు సమర్పించాలి?, ఏఏ పత్రాలు సిద్ధం చేసుకోవాలో ఇపుడు చూద్దాం.

ఇంటింటి సర్వే దశలో ఇలా..

బూత్‌ స్థాయి అధికారులు (BLO) మీ ఇంటికి వచ్చి 2 ఎన్యుమరేషన్‌ ప్రతులు అందజేస్తారు. వాటిల్లో ఓటరు పేరు, ఫొటో గుర్తింపుకార్డు నంబరు, చిరునామా, వంటి వివరాలతోపాటు పాత ఫొటో ముద్రించే ఉంటాయి. మిగతా వివరాలను పూర్తి చేసి అందించాలి.

ఆన్​లైన్​లోనూ ఛాన్స్

బీఎల్​ఓలు ఇంటికి రాకున్నా, ఒక వేళ ఆ సమయంలో మీరు అందుబాటులో లేకున్నా https://voters.eci.gov.in సైట్‌లోకి వెళ్లి నేరుగా ఫాం డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. వివరాలు నమోదు చేసిన తర్వాత ఆన్‌లైన్‌లోనే సమర్పించడం లేదా ప్రింట్ తీసుకుని బీఎల్‌వోకు అందించవచ్చు. బీఎల్‌వో ఫోన్‌ నంబరు స్థానిక పోలింగ్‌ కేంద్రంలో లేదా ఈసీఐనెట్‌ మొబైల్‌ యాప్‌ లేదా సీఈవో ఆంధ్ర వెబ్‌సైట్‌ నుంచీ తీసుకోవచ్చు.

మీకు బదులుగా కుటుంబ సభ్యులు

2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకున్న నేపథ్యంలో ఒకవేళ ఆ జాబితాలో మీ పేరు లేకపోతే మీ తల్లిదండ్రులు లేదా భార్య/భర్త లేదా ఇతరత్రా కుటుంబీకులు, సంబంధీకుల పేర్లు, వివరాలు నమోదు చేయాలి. వీటితో పాటు మీ పుట్టిన తేదీ, ఆధార్, సెలఫోన్ నంబర్, తండ్రి/సంరక్షకుడి పేరు, తల్లి పేరు, భార్య/భర్త పేరు సమర్పించాలి. వివరాలన్నీ పూర్తి చేసిన తర్వాత కొత్త కలర్‌ ఫొటోలు అతికించి బీఎల్‌వోకి అందించాలి. మీరు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నట్లయితే ఎన్యుమరేషన్‌ ఫాంను ఇంటి పెద్ద లేదా ఇతర కుటుంబ సభ్యులు పూర్తి చేసి అందించవచ్చు. మీ తరఫున వారే సంతకం చేసి బీఎల్‌వోకు ఇవ్వాల్సి ఉంటుంది.

మీ పేరు లేకపోతే ఫిర్యాదు చేయొచ్చు

జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసిన తర్వాత అందులో మీ పేరు లేకపోతే ఆగస్టు 20 వరకూ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. కొత్తగా ఓటరుగా చేరాలంటే ఫాం-6, అడ్రస్ మార్చుకోవడానికి ఫాం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు సెప్టెంబరు 18లోగా పరిశీలన పూర్తి చేసి తుది జాబితాలో చేరుస్తారు. సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితా ప్రచురించడంతో సర్ ప్రక్రియ పూర్తవుతుంది.

ఈ తేదీలు గుర్తు పెట్టుకోండి

  1. జూన్‌ 5 నుంచి 14 : సిబ్బందికి శిక్షణ, ఎన్యుమరేషన్‌ పత్రాలు, 2002నాటి ఓటర్ల జాబితా ముద్రణ.
  2. జూన్‌ 15 నుంచి జులై 14 : బూత్‌ స్థాయి అధికారుల ఇంటింటి సర్వే
  3. జులై 14 నాటికి : పోలింగ్‌ కేంద్రాల రేషనలైజేషన్‌
  4. జులై 21: ముసాయిదా ఓటర్ల జాబితా
  5. జులై 21 నుంచి ఆగస్టు 20 వరకు : ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ
  6. జులై 21 నుంచి సెప్టెంబరు 18 వరకు : ఫిర్యాదులు, దరఖాస్తుల పరిష్కారం
  7. సెప్టెంబరు 22 : ఓటర్ల తుది జాబితా విడుదల

నల్లమల అభయారణ్యంలో "చారిత్రక సంపద" - చెంచులు, గిరిజనుల సహకారంతో రంగంలోకి!

తిరుమలలో "నల్ల బంగారం" నయా రికార్డు - టీటీడీ లెక్కలు ఏం చెప్తున్నాయంటే!