ఘుమఘుమలాడే "బిర్యానీ మసాలా పౌడర్" - ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 2 నెలలు నిల్వ!
- మార్కెట్లో కొనే పని లేకుండా ఇంట్లోనే తయారీ! - వెజ్, నాన్‌వెజ్ బిర్యానీల్లోకి అదుర్స్!

Published : October 17, 2025 at 3:37 PM IST
Shahi Biryani Masala: బిర్యానీ పేరు చెబితే నాలుక లబలబలాడుతుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని నోరు ఊరుతుంది. ఘుమఘుమలాడే సువాసనతో పొగలు కక్కే బిర్యానీ ఎదురుగా ఉంటే తగ్గేదేలే అని ఓ పట్టుపడతారు ఫుడ్డీస్. అందుకే చాలా మంది ఫేవరెట్ ఫుడ్ లిస్ట్‌లో బిర్యానీ ముందు వరసలోనే ఉంటుంది. అయితే బిర్యానీ అంత టేస్టీ అండ్ యమ్మీగా రావడానికి మెయిన్ రీజన్ "మసాలా".
ఎందుకంటే, మసాలా ఫ్లేవర్‌ను బట్టే బిర్యానీ రుచి ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద రెస్టారెంట్స్, హోటల్స్ లో బిర్యానీ టేస్ట్ అద్దిరిపోవడానికి రీజన్ ఇదే! అయితే, హోటల్స్ టేస్ట్ రావాలని చాలా మంది మార్కెట్లో లభించే మసాలా పొడిని కొనుగోలు చేస్తుంటారు. కానీ అది ఓపెన్ చేసిన కొద్దిరోజులకే వాసన, రుచి మారుతుంది. ఇలాంటి సమస్య రాకూడదంటే ఇంట్లోనే బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకోవడం మంచిది. చాలా అంటే చాలా సింపుల్‌గా దీన్ని తయారు చేసుకోవచ్చు. మరి, లేట్ చేయకుండా ఇంట్లోనే షాహీ బిర్యానీ మసాలా ఎలా చేయాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- ధనియాలు - 3 స్పూన్లు
- షాజీరా - ఒకటిన్నర స్పూన్లు
- జీలకర్ర - ఒకటిన్నర స్పూన్లు
- పచ్చ యాలకులు - 2 స్పూన్లు
- నల్ల యాలకులు - 1 స్పూన్
- మిరియాలు - 2 స్పూన్లు
- లవంగాలు - 1 స్పూన్
- దాల్చిన చెక్క - 4 ఇంచ్‌లు
- అనాస పువ్వులు - 2
- మరాఠీ మొగ్గలు - 5
- జాపత్రి - అర స్పూన్
- జాజికాయ - అర ముక్క
- బ్యాడిగీ మిర్చి - 5
- రాతి పువ్వు - 2 స్పూన్లు
- బిర్యానీ ఆకులు - 15
- కసూరీ మేథీ - 1 స్పూన్
- పసుపు - 1 స్పూన్

తయారీ విధానం:
- ముందుగా దాల్చినచెక్క, బిర్యానీ ఆకులను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న పాన్ పెట్టి హీట్ చేసుకోవాలి. పెనం వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
- ఇప్పుడు పెనంలోకి ధనియాలు, షాజీరా, జీలకర్ర, పచ్చ యాలకులు, నల్ల యాలకులు, మిరియాలు, దాల్చినచెక్క, లవంగాలు, అనాసపువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, జాజికాయ, బ్యాడిగీ మిర్చి, రాతి పువ్వు, బిర్యానీ ఆకులు వేసుకోవాలి.

- మసాలా దినుసులు అన్నీ పాన్‌లోకి వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి లో-ఫ్లేమ్‌లో కలుపుతూ 5 నిమిషాల పాటు వేయించుకోవాలి.
- మసాలా దినుసులు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కసూరీ మేథీ వేసి కలిపి పాన్‌ను పక్కకు దింపి పూర్తిగా చల్లారనివ్వాలి.
- మసాలా దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత అందులో నుంచి కొన్ని యాలకులు తీసి పక్కన పెట్టాలి.
- మిగిలిన దినుసులను మిక్సీజార్‌లోకి వేసుకోవాలి. ఆపై అందులో పసుపు వేసి మూత పెట్టి పల్స్ మోడ్‌లో మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

- పదార్థాలను గ్రైండ్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుని పక్కకు తీసిన యాలకులు, కొన్ని ముక్కలుగా కట్ చేసిన బిర్యానీ ఆకులు వేసి కలపాలి.
- చివరగా ఈ పొడిని తడి లేని, గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే సరి. ఎంతో ఘుమఘుమలాడే బిర్యానీ మసాలా పౌడర్ రెడీ.
- ఈ పొడిని వెజ్, నాన్‌వెజ్ బిర్యానీల్లోకి వేసుకోవచ్చు. వెజ్ బిర్యానీకి అయితే ఒక స్పూన్, నాన్వెజ్లోకి ఒకటిన్నర స్పూన్లు వేసుకోవాలి. లేదంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవచ్చు.

చిట్కాలు:
- మసాలా దినుసులను మరీ ఎక్కువ సేపు వేయించాల్సిన పనిలేదు. మనం చేతితో తాకేంత వేడి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
- కేవలం లో-ఫ్లేమ్‌లో మాత్రమే వేయించుకోవాలి. హై -ఫ్లేమ్‌లో అయితే మసాలా రుచి మారుతుంది.
- గ్రైండింగ్ కోసం ఉపయోగించే మిక్సీజార్, మసాలా పొడిని స్టోర్ చేయాడానికి ఉపయోగించే జార్లో అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. తడి ఉన్నట్లైతే పొడి పాడయ్యే అవకాశం ఉంటుంది.
దీపావళికి శ్రీలంకన్ "లవారియా" స్వీట్ - ఈ మిఠాయితో పండగ చేసుకుంటారు!
ఇడ్లీ పిండితో "వడలు" చేసుకోండి - నూనె పీల్చకుండా క్రిస్పీగా వస్తాయి!

