పల్లీలను ఇలా వేయించి "చట్నీ" చేయండి - టేస్ట్ అదుర్స్, వారం రోజులు నిల్వ!
అన్ని టిఫెన్స్లోకి అద్దిరిపోయే 'పల్లీ చట్నీ' - ఈ కొలతలతో చేస్తే హోటల్ టేస్ట్ పక్కా!

Published : January 5, 2026 at 7:06 PM IST
Secret Tips to Make Palli Pachadi : కొన్నిసార్లు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎన్ని రకాల చట్నీలు చేసినా పిల్లలకు అవి ఒక పట్టాన నచ్చవు. దాంతో టిఫెన్ తినమంటే చట్నీ బాగలేదని మారాం చేస్తుంటారు. అలాంటి వారూ ఇష్టంగా తినేలా చేసి పెట్టే ఒక అద్భుతమైన రెసిపీ ఉంది. అదే, హోటల్ స్టైల్లో అద్దిరిపోయే "పల్లీ చట్నీ". ఇది రెగ్యులర్‌గా చేసుకునే వాటితో పోల్చితే చాలా రుచికరంగా ఉంటుంది. పల్లీలను వేయించడంలోనే ఈ చట్నీ టేస్ట్ మొత్తం దాగి ఉంటుంది. ఇలా చేశారంటే చిన్నారులు ఏ టిఫెన్ అయినా కాస్త ఎక్కువే తింటారు. అంతేకాదు, ఈ పచ్చడిని వారం రోజులు నిల్వ కూడా చేసుకోవచ్చు! మరి, తక్కువ టైమ్‌లోనే ఈ సూపర్ టేస్టీ పల్లీ చట్నీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- పల్లీలు - అర కిలో
- నూనె - నాలుగు టేబుల్‌స్పూన్లు
- పచ్చిమిర్చి - 50 గ్రాములు
- పచ్చికొబ్బరి ముక్కలు - 250 గ్రాములు
- చింతపండు - ఏడెనిమిది గ్రాములు
- అల్లం - చిన్నముక్క
- బెల్లం - ఒక టేబుల్‌స్పూన్
తెలంగాణ స్టైల్ "టమాటా పప్పు" - వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే ఆహాఁ!

తయారీ విధానం :
- హోటల్ స్టైల్లో అద్దిరిపోయే ఈ పల్లీ చట్నీ తయారీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయిలో నాలుగు టేబుల్స్పూన్ల నూనె వేసుకోవాలి.
- ఆయిల్ లైట్‌గా వేడయ్యాక పల్లీలను వేసి సన్నని సెగ మీద వేరుశనగ గుండ్లు చిట్లే వరకు కలుపుతూ నిదానంగా వేయించుకోవాలి.
- అప్పుడే పల్లీలు లోపలి వరకు బాగా వేగి చట్నీ మంచి రుచికరంగా వస్తుంది. పల్లీలు ఆయిల్లో మంచిగా వేగాయనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
- తర్వాత అదే కడాయిలో మరో నాలుగు టేబుల్స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి.

- ఆయిల్ హీట్ అయ్యాక మీ రుచికి తగినన్ని పచ్చిమిరపకాయలను వేసి వాటిని బాగా వేయించి మరో ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇప్పుడు పచ్చడిలోకి కావాల్సిన పరిమాణంలో పచ్చికొబ్బరి ముక్కలను సిద్ధం చేసుకుని పక్కనుంచాలి.
- అనంతరం మిక్సీ జార్ తీసుకుని అందులో వేయించుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, సన్నని పచ్చికొబ్బరి ముక్కలు, చాలా కొద్దిగా నానబెట్టిన చింతపండు, చిన్న అల్లం ముక్క, బెల్లం వేసుకోవాలి.
- ఆపై అవసరంమేరకు కొద్దికొద్దిగా వాటర్(నాలుగైదు కప్పుల వరకు) యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తగా పచ్చడిని గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకుని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చడిలోకి తాలింపును రెడీ చేసుకోవాలి.

తాలింపు కోసం :
- నూనె - ఎనిమిది టేబుల్‌స్పూన్లు
- ఎండుమిర్చి - నాలుగైదు
- మినప్పప్పు - రెండు టీస్పూన్లు
- శనగపప్పు - రెండు టీస్పూన్లు
- ఆవాలు - కొద్దిగా
- ధనియాలు - ఒక టీస్పూన్
- జీలకర్ర - ఒకట్రెండు టీస్పూన్లు
- కరివేపాకు - కొద్దిగా

- పోపు కోసం స్టవ్ మీద చిన్న కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిర్చి ముక్కలు వేసి కాస్త కలర్ మారేంత వరకు వేయించాలి.
- ఆ తర్వాత అందులో మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించాలి. అవి వేగి ఎర్రగా అవుతున్నప్పుడు ధనియాలను చేతితో నలిపి వేసుకోవాలి.
- అలాగే, జీలకర్ర, కరివేపాకు వేసుకుని తాలింపు మంచిగా వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అనంతరం ఆ తాలింపును ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసి ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటే చాలు.
- అంతే, హోటల్ స్టైల్లో సూపర్ టేస్టీగా ఉండే "పల్లీ చట్నీ" మీ ముందు ఉంటుంది!
- మీరు ఈ పచ్చడిని పోపు పెట్టకుండా ఎయిర్ టైటెడ్ డబ్బాలోకి తీసుకుని ఫ్రిడ్జ్‌లో ఉంచితే వారం పాటు నిల్వ ఉంటుంది!
- టిఫెన్స్లోకి తినాలనుకున్నప్పుడు అవసరం మేరకు కొద్దిగా తీసుకుని పోపు పెట్టి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
- మరి, నచ్చితే మీరూ ఓసారి ఇలా పల్లీ చట్నీ ట్రై చేసి చూడండి. హోటల్ టేస్ట్‌లో అద్దిరిపోయే దీన్ని ఇంటిల్లిపాదీ భలే ఇష్టంగా తింటారు.

చిట్కాలు :
- ఇక్కడ పచ్చిమిర్చీలను మీ రుచిని బట్టి తగినన్ని తీసుకోవాలి. ఎందుకంటే బయట మార్కెట్లో దొరికే వాటిల్లో కొన్ని కారం ఉంటాయి. మరికొన్ని చప్పగా ఉంటాయి.
- మీరు ఏ కొలతలతో ఈ పచ్చడిని చేసుకున్నా పల్లీల క్వాంటిటీలో సగం పచ్చికొబ్బరిని తీసుకోవాలి.
- ఒకవేళ మీరు ఈ చట్నీని తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే పల్లీలతో పాటు ఇతర పదార్థాలను అందుకు అనుగుణంగా తగ్గించి తీసుకుంటే సరిపోతుంది.
కరకరలాడే "సొరకాయ గారెలు" - నూనె పీల్చవు! - భలే రుచిగా ఉంటాయి!
నోరూరించే "పెసరపప్పు చెక్కలు" - సంక్రాంతి పండక్కి కరకరలాడించండి!

