ఏటీఎం కార్డుపై రూ.20లక్షలు! - ఉచితంగా బీమా ఉందని మీకు తెలుసా?
ఉచిత బీమా సౌకర్యం - ప్రీమియం చెల్లించాల్సిన పని లేదు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 19, 2026 at 5:05 PM IST
SBI Free Insurance Policy : బీమా అనగానే ప్రీమియం గురించి ఆలోచిస్తుంటారు. నెల, త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక చెల్లింపులతో బీమా పథకాలు అమలులో ఉన్నాయి. ఎంచుకున్న ప్రీమియం చెల్లిస్తేనే బీమా సొమ్ము అందుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది తక్కువ ప్రీమియం, ఎక్కువ ప్రయోజనాలున్న పథకాలను ఎంచుకుంటుంటారు. కానీ, ప్రీమియం చెల్లించలేక మధ్యలోనే వదిలేస్తున్నవారెందరో ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అసలు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే రూ.20లక్షల ప్రమాద బీమా అమలులో ఉందని తెలుసా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు ఉచిత బీమా పథకాన్ని వర్తింపజేస్తోంది. ప్రత్యేకంగా ఒక్క రూపాయి చెల్లించకుండానే రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బీమా పొందే అవకాశం కల్పిస్తోంది. అదెలా? అని ఆశ్చర్యపోతున్నారా? ఇందుకు మీ వద్ద ఏటీఎం కార్డు ఉంటే చాలు! ప్రభుత్వ బ్యాంక్ SBI అందిస్తున్న ఈ బీమా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?
రోడ్డు లేదా ఇతర ప్రమాదాల్లో మృతి చెందితే :
SBI గోల్డ్ (మాస్టర్ కార్డ్/వీసా) కార్డు ఉన్న వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది.
SBI ప్రైడ్ (బిజినెస్ డెబిట్) మాస్టర్ కార్డ్/వీసా) కార్డు ఉన్న వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా అమలులో ఉంది.
SBI ప్లాటినమ్ (మాస్టర్ కార్డ్/వీసా) కార్డు ఉన్న వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా ఉంటుంది.
SBI ప్రీమియం (బిజినెస్ డెబిట్) (మాస్టర్ కార్డ్/వీసా) కార్డు ఉన్న వారికి రూ.5 లక్షలు ప్రమాద బీమా వర్తిస్తుంది.
SBI వీసా సిగ్నేచర్/మాస్టర్ కార్డ్ వరల్డ్ డెబిట్ కార్డ్ ఉన్న వారికి రూ.10 లక్షలు ప్రమాద బీమా చెల్లిస్తారు.
విమాన ప్రమాదాల్లో మృతి చెందిన వారికి :
SBI గోల్డ్ (మాస్టర్ కార్డ్/వీసా) కార్డుదారులకు రూ.4 లక్షల ప్రమాద బీమా ఉంటుంది.
SBI ప్రైడ్ (బిజినెస్ డెబిట్) మాస్టర్ కార్డ్/వీసా) కార్డుదారులకు రూ.4 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది.
SBI ప్లాటినమ్ (మాస్టర్ కార్డ్/వీసా) కార్డుదారులకు రూ.10 లక్షల ప్రమాద బీమా ఉంటుంది.
SBI ప్రీమియం (బిజినెస్ డెబిట్) (మాస్టర్ కార్డ్/వీసా) కార్డుదారులకు రూ.10 లక్షలు ప్రమాద బీమా చెల్లిస్తారు.
SBI వీసా సిగ్నేచర్/మాస్టర్ కార్డ్ వరల్డ్ డెబిట్ కార్డుదారులకు రూ.20 లక్షలు ప్రమాద బీమా వర్తిస్తుంది.
అర్హతలు ఇవీ :
ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే బ్యాంకులు బీమా సదుపాయం కల్పిస్తున్నప్పటికీ కొన్ని షరతులు ఉన్నాయని తెలుసుకోవాలి. ప్రమాదం జరిగిన రోజును లెక్కిస్తే అంతకు ముందు 90 రోజుల్లో ఏటీఎం కార్డును ఉపయోగించి ఉండాలి. కార్డు ఉపయోగించకుండా వదిలేస్తే బీమా వర్తించదని తెలుసుకోవాలి.
ఏటీఎం ఉపయోగించి లావాదేవీలు జరపొచ్చు. కేవలం ఏటీఎం కేంద్రానికి వెళ్లి డబ్బు డ్రా చేయడం మాత్రమే గాకుండా స్వైపింగ్ మెషీన్ ద్వారా పేమెంట్ చేయొచ్చు.
కార్డును ఉపయోగించి ఈ కామర్స్ వెబ్‌సైట్లలో కొనుగోలు చెల్లింపులు చేయొచ్చు.
బ్యాంక్ మిత్రలు, బిజినెస్ కరస్పాండెంట్ల వద్ద కార్డు ద్వారా లావాదేవీలు చేసినా బీమా వర్తిస్తుంది.
ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? :
ప్రమాదం అనంతరం నామినీ లేదా కుటుంబ సభ్యులు సంబంధిత బ్యాంకుకు విషయం తెలియజేసి క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి
ప్రమాదంపై పోలీసులు నమోదు చేసిన FIR కాపీని దరఖాస్తుకు జత చేయాల్సి ఉంటుంది.
సహజ, అనారోగ్య మరణాలకు బీమా పాలసీ వర్తించదు.
బీమా పాలసీ నిబంధనలు అన్ని బ్యాంకులకు ఒకేలా వర్తించవు, బ్యాంకును బట్టి మారొచ్చు .

