నోరూరించే "బెల్లం గవ్వలు, బూందీ లడ్డూ" - పండక్కి ఇవి చేస్తే ఇంటిల్లిపాదీ ఫుల్ ఖుష్!
సంక్రాంతి స్పెషల్ : అద్దిరిపోయే 'గవ్వలు, లడ్డూలు' - స్వీట్ షాప్ స్టైల్లో ఈజీగా చేసుకోండిలా!

Published : January 7, 2026 at 11:03 AM IST
Sankranti 2026 Special Recipes : సరదాల సంక్రాంతికి పిండి వంటల ఘుమఘుమలతో తెలుగు లోగిళ్లన్నీ కొత్త శోభను సంతరించుకుంటాయి. వారం రోజుల ముందు నుంచే అరిసెలు, సకినాలు, గారెలు అంటూ నోరూరించే పిండి వంటలెన్నో తయారు చేస్తుంటుంటారు. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతూ కొత్త రుచులను ఆస్వాదిస్తుంటారు. అయితే, మరికొద్ది రోజుల్లో ఏడాదిలో మొదటి పెద్ద పండగ 'సంక్రాంతి' రానుంది. మరి, ఈసారి పండక్కి కొత్తగా ఏమైనా తీపి వంటకాలు ట్రై చేయాలనుకుంటున్నారా? అలాంటి వారికోసమే క్విక్ అండ్ ఈజీగా చేసుకునే రెండు అద్భుతమైన స్వీట్ రెసిపీలను తీసుకొచ్చాం. ఇవి స్వీట్ షాప్ స్టైల్లో సూపర్ టేస్టీగా ఉండి ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చుతాయి. మరి, అవేంటో ఇప్పుడు చూద్దాం.

బెల్లం గవ్వలు :
కావాల్సిన పదార్థాలు :
- పావు కప్పు - బొంబాయి రవ్వ
- రెండు టేబుల్‌స్పూన్లు - మిల్క్ పౌడర్
- పావు కేజీ - మైదా
- పావు చెంచా - ఉప్పు
- రెండు టేబుల్‌స్పూన్లు - నెయ్యి
- చిటికెడు - వంటసోడా
- పావుటీస్పూన్ - యాలకుల పొడి
- ఒకటిన్నర కప్పులు - బెల్లం తురుము
- వేయించేందుకు సరిపడా - నూనె
కజ్జికాయలు కాదు "పాకం కజ్జికాయలు" చేసుకోండి - జ్యూసీజ్యూసీగా ఉంటాయి!

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లో బొంబాయి రవ్వ, మిల్క్ పౌడర్ వేసుకుని సన్నని రవ్వ మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం వెడల్పాటి మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మైదా, గ్రైండ్ చేసుకున్న రవ్వ మిశ్రమం, రుచికి తగినంత ఉప్పు, నెయ్యి, వంటసోడా వేసుకొని ఒకసారి అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత అందులో తగినన్ని నీళ్లు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చేతి మణికట్టుతో గట్టిగా వత్తుతూ పూరీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఆపై పిండి ముద్దపై ఒక క్లాత్ ఉంచి ఐదు నిమిషాల పాటు పక్కనుంచాలి.

- ఐదు నిమిషాల తర్వాత పిండిని మూడు భాగాలు చేసుకోవాలి. ఒక్కో పిండి ముద్దను చేతితో పొడవుగా రోల్ చేసుకోవాలి. ఆ తర్వాత చాకుతో అంగుళం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని ఉండలుగా చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్లో గవ్వల చెక్కను ఉంచి దానిపై ఒక్కో పిండి ఉండను పెట్టి చేతితో అదిమితే గవ్వల మాదిరిగా వస్తుంది. ఇలా అన్నింటినీ చేసుకొని పక్కనుంచాలి.
- అనంతరం స్టవ్ మీద కడాయిలో వేయించడానికి తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న గవ్వలను కడాయిలో సరిపడా వేసుకుని మీడియం ఫ్లేమ్‌లో ఎర్రగా, మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే అన్నింటినీ వేయించుకుని ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి.

- అవి చల్లారేలోపు బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని బెల్లం తురుము, మూడు టేబుల్స్పూన్ల వాటర్ వేసుకుని ముదురు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి.
- ఆ విధంగా పాకాన్ని పట్టుకున్నాక అందులో యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఆపై అందులో వేయించి చల్లార్చుకున్న గవ్వలను వేసి హై-ఫ్లేమ్ మీద బాగా కోట్ చేసుకోవాలి.
- పాకం మొత్తం గవ్వలకు మంచిగా పట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి దింపి పావుగంట పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత జల్లిగిన్నెలో వేసుకుని కాసేపు అలా ఉంచితే గవ్వలు పూర్తిగా ఆరిపోతాయి.
- అవి పూర్తిగా ఆరిన తర్వాత ఏదైనా స్టీల్ డబ్బాలోకి తీసుకుని స్టోర్ చేసుకున్నారంటే చాలు. అంతే, నోరూరించే "బెల్లం గవ్వలు" అప్పటికప్పుడు సింపుల్‌గా రెడీ అవుతాయి!
సంక్రాంతి స్పెషల్ : జొన్నపిండి "రిబ్బన్ పకోడీ" - తక్కువ నూనెతోనే కరకరలాడిపోద్ది!

బూందీ లడ్డూలు :
కావాల్సిన పదార్థాలు :
- అర కిలో - శనగపిండి
- కేజీన్నర - పంచదార
- అర కప్పు - కాజు
- తగినంత - ఆయిల్
- అర టీస్పూన్ - యాలకుల పొడి
- పావు కప్పు - కిస్మిస్
- చిటికెడు - పచ్చ కర్పూరం
నోరూరించే "పెసరపప్పు చెక్కలు" - సంక్రాంతి పండక్కి కరకరలాడించండి!

తయారీ విధానం :
- నోరూరించే ఈ లడ్డూల కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో జల్లించుకున్న శనగపిండిని తీసుకుని తగినన్ని నీళ్లను కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలిపి పక్కనుంచాలి.
- ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ జారుగా, చిక్కగా ఉండకుండా కాస్త వాటర్ పోసి చిలుకున్న చిక్కని పెరుగులా ఉండాలి.
- అనంతరం స్టవ్ మీద వెడల్పాటి కడాయి లేదా పాన్ పెట్టుకుని పంచదార వేసి, 750ఎంఎల్ నీళ్లు పోసి లేత తీగ పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. ఆ విధంగా పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కడాయిని దింపి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు బూందీని రెడీ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద మరో కడాయిలో తగినంత ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి.

- నూనె బాగా హీట్ అయ్యాక ఆయిల్‌కి దగ్గరగా బూందీ గరిటెను ఉంచి ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా మొత్తం పిండిని బూందీలా ప్రిపేర్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మీరు వేయించి తీసుకున్న బూందీని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసి కలుపుతూ ఉండాలి.
- బూందీ మొత్తం వేసిన తర్వాత ఒకసారి గరిటెతో పైకి కిందికి బాగా కలిపి కాసేపు అలా వదిలేయాలి. అంటే పూర్తిగా చల్లారనివ్వాలి. అలా చేయడం ద్వారా బూందీ పాకాన్ని మంచిగా పీల్చుకుంటుంది.

- అనంతరం చల్లారిన బూందీని జాలి గరిటెలోకి తీసుకుని కాసేపు అలా వదిలేయాలి. ఇలా చేయడం ద్వారా బూందీలోని అదనపు పాకం దిగిపోతుంది.
- నెక్ట్స్ ఆ బూందీని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో జీడిపప్పు పలుకులు, కిస్మిస్, యాలకుల పొడి, పచ్చ కర్పూరాన్ని నలిపి వేసుకుని మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత అందులో నుంచి కొద్దికొద్దిగా తీసుకుంటూ మీకు నచ్చిన పరిమాణంలో లడ్డూల్లా చుట్టుకుంటే సరిపోతుంది.
- అంతే, స్వీట్ షాప్ స్టైల్లో ఎంతో రుచికరంగా ఉండే "బూందీ లడ్డూలు" ఇంట్లోనే అప్పటికప్పుడు రెడీ అవుతాయి!

