సంక్రాంతి స్పెషల్ "మినప జంతికలు" - ఆయిల్ తక్కువ, క్రంచీ ఎక్కువ!
క్రిస్పీ, టేస్టీ జంతికలు - శనగపిండి లేకుండా ఇలా చేయండి ఎంతో టేస్టీగా వస్తాయి!

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 7, 2026 at 1:49 PM IST
Urad Dal Janthikalu Prepare : సంక్రాంతి వస్తోదంటే చాలు తెలుగు లోగిళ్లన్నీ పిండి వంటలతో ఘుమఘుమలాడుతాయి. ఈ సందర్భంగా స్వీట్, హాట్ అంటూ వివిధ రకాల తినుబండరాలు తయారు చేస్తుంటారు. ఇందులో జంతికలు కూడా ఒకటి. వీటిని ఎక్కువగా శనగపిండితో ప్రిపేర్ చేస్తారు. అలా కాకుండా ఈసారి ఉడికించి గ్రైండ్ చేసిన మినప్పిండితో జంతికలు చేశారంటే కరకరలాడుతూ భలే రుచికరంగా వస్తాయి.
పైగా ఈ రెసిపీని తక్కువ పదార్థాలతోనే సింపుల్‌గా రెడీ చేసుకోవచ్చు. అలాగే నూనె కూడా తక్కువగానే పడుతుంది! వీటిని ఎయిర్‌టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి! ఇలా చేసి పెడితే పిల్లలు ఒకటికి రెండు ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా మినప జంతికలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
జొన్నపిండితో "ఇడ్లీలు" - సూపర్ సాఫ్ట్‌గా ఉంటాయి - ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చు!

కావాల్సిన పదార్థాలు :
- మినపప్పు - ఒక కప్పు
- బియ్యప్పిండి - 3 కప్పులు
- వాము - ఒకటిన్నర టేబుల్ స్పూన్
- జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
- నువ్వులు - 3 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా
- ఆయిల్ - సరిపడా

తయారీ విధానం :
- ముందుగా గిన్నెలో కప్పు మినపప్పు, సరిపడా నీళ్లు పోసి మూడు గంటల పాటు నానబెట్టాలి.
- మూడు గంటల తర్వాత కుక్కర్లో నానబెట్టిన మినపప్పు వేసి, రెండు కప్పుల నీళ్లు పోయాలి. ఇప్పుడు మూతపెట్టి మూడు విజల్స్ వచ్చేవరకు ఉడికించాలి. మూడు విజిల్స్ వచ్చాక నీటిని వడకట్టి పప్పును పక్కనుంచాలి.
- మినపప్పు చల్లారిన తర్వాత మిక్సీజార్‌లో వేయాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేయాలి.

- అలాగే మిక్సింగ్ బౌల్లో గ్రైండ్ చేసుకున్న మినప్పిండి, మూడు కప్పుల బియ్యప్పిండి, ఒకటిన్నర టేబుల్ స్పూన్ వాము, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. పిండి బాగా కలిసిన తర్వాత నీటిని కొద్దికొద్దిగా పోస్తూ మిక్స్ చేయాలి.
- ఇందులోనే పావు కప్పు వేడి నూనె పోసి కలపాలి. ఆపైన కొద్దిగా నీటిని తడిచేసి క్లాత్ వేసి 15 నిమిషాల పాటు పక్కనుంచాలి.
- పదిహేను నిమిషాల తర్వాత జంతికల గొట్టంలో పిండిని ఉంచాలి. అనంతరం ఓ ప్లేట్ తీసుకొని జంతికల గొట్టంతో జంతికల ఆకారంలో పిండిని వేసి ఉంచాలి.

- అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి. నూనె బాగా వేడైన తర్వాత రెడీ చేసుకున్న జంతికలను వేయాలి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి.
- 5 నిమిషాల తర్వాత జంతికలను రెండు వైపులా టర్న్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేగనివ్వాలి. అనంతరం వీటిని ప్లేట్లో వేయాలి.
- అంతే కరకరలాడే మినప జంతికలు మీ ముందుంటాయి!
- ఈ జంతికలను ఎయిర్‌టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి!
"కరకరలాడే గారెలు, చెక్కలు" - పక్కా కొలతల్లో చేస్తే క్రిస్పీగా వస్తాయి!
అన్నం, కర్రీ చేయాల్సిన అవసరం లేదు - ఇలా చేస్తే లంచ్ బాక్స్ కళకళ!

