37ఏళ్ల జైలు శిక్ష ముగిసింది! - ఎట్టకేలకు సెంట్రల్ జైలు నుంచి బయటపడ్డ వృద్ధుడు!
జైలు నుంచి విడుదలైన 72ఏళ్ల తాత! - దేశంలోనే అత్యధిక కాలం జైలు శిక్ష అనుభవించిన ఖైదీ!

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 6, 2026 at 12:32 PM IST
37 years of imprisonment : ఆయన వయస్సు 72ఏళ్లు. కానీ, 37ఏళ్ల పాటు జైలులోనే (దాదాపు తన సగం జీవిత కాలం) గడిపాడు. తాజాగా బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చాడు. బక్క చిక్కిన శరీరం, తెల్లని జుట్టు, పొడవాటి గడ్డంతో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు గేట్ల గుండా నెమ్మదిగా బయటకు నడిచారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత స్వేచ్ఛా వాయువును పీల్చుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆయన పేరు సైబన్న ఎన్.నాటికర్. దేశంలోనే అత్యధిక కాలం జైలు శిక్ష అనుభవించిన ఖైదీ సైబన్న అని జైలు అధికారులు పేర్కొన్నారు. ఇంతకీ సైబన్న నాటికర్ ఏం నేరం చేశారు?
"బెల్గాం, కలబురిగి జైళ్లలో ఉన్నప్పుడు నేను సైబన్నతో మాట్లాడాను. జైలులో ఆయన ప్రవర్తన బాగుండేది" అని కర్ణాటక జైళ్ల డీజీపీ అలోక్ కుమార్ చెప్పారు. సైబన్న 1988లో తన మొదటి భార్య మల్కవ్వకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఆమెను హత్య చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దోషిగా తేలి జీవిత ఖైదు పడిన తర్వాత 1994లో ఆయనకు పెరోల్ లభించింది.
'రాత్రి ఏం జరిగిందో తెలియదు! - తెల్లారే సరికి రెండు కాళ్లూ పోయాయి!'
ఆ సమయంలో ఆయన రెండో వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఓ కూతురు పుట్టిన కొన్ని వారాల్లోనే తన జీవితం మళ్లీ మొదటికొచ్చింది. వివాహేతర సంబంధం ఆరోపణతోనే ఆయన తన రెండో భార్య నాగమ్మ, మైనర్ కూతురు విజయలక్ష్మిని కూడా హత్య చేశారు. మొదటి భార్య మల్కవ్వ మాదిరిగానే నాగమ్మను కూడా పదునైన ఆయుధంతోనే హత్య చేశారని పోలీసులు వెల్లడించారు.
సహకార రంగంలో పనిచేసిన సైబన్న నేరాలకు పాల్పడడం వల్ల ఉద్యోగాన్ని కోల్పోయాడు. అంతేకాదు! దాదాపు కోటి రూపాయల విలువైన తన 10 ఎకరాల భూమినీ కోల్పోయానని చెప్పారు. ఇన్నేళ్లు జైలులో ఉన్న సైబన్న, తన భార్యలకు వివాహేతర సంబంధం ఉందనడానికి ఆధారాలు ఉన్నాయని వాదిస్తున్నారు. ఈ హత్యల పట్ల ఆయనలో పెద్దగా పశ్చాత్తాపం కనిపించలేదు.
హత్యలు జరిగిన తీరు, వాటిల్లో కనిపించిన క్రూరత్వం ఆధారంగా కోర్టు సైబన్నకు 2003లో మరణశిక్ష విధించింది. ఆ తర్వాత కర్ణాటక హైకోర్టు ఆ శిక్షను జీవిత ఖైదుగా మార్చడంతో దాదాపు దశాబ్దం పాటు జైలు జీవితం గడిపాడు.
సైబన్న జైలు నుంచి విడుదలైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ "నా భార్యలు దారి తప్పినందుకే చంపాను. మొదటి హత్య జరిగినప్పుడు ఆమెతో ఉన్న వ్యక్తి పారిపోయాడు. అందుకే నేను నా భార్యను చంపాను. మళ్లీ రెండోసారి చేసుకున్నప్పుడు మా అత్తగారే తన కూతురిని దారి తప్పించారు. భార్య గుడ్డిదైనా, దివ్యాంగురాలైనా పర్వాలేదు కానీ, నడవడిక ముఖ్యం" అని అన్నారు. హత్యల పట్ల ఎలాంటి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయక పోవడం గమనార్హం.
పంజా విసిరిన "ప్రాజెక్ట్ చీతా" - అరుదైన మైలురాయి సాధించిన ఇండియా!
పాము కాటు వేస్తే ఎలా అనిపిస్తుంది? - లక్షణాలు, పాటించాల్సిన జాగ్రత్తలివే!

