రోళ్లు పగిలే 'రోహిణి' వచ్చేసింది! - ఈ ఎండలు ఎప్పటివరకంటే!
ముందుంది 'ముసళ్ల పండగ'? - గరిష్ఠ ఉష్ణోగ్రతలు, పిడుగులు పడే అవకాశం

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 25, 2026 at 10:36 AM IST
|Updated : May 25, 2026 at 10:43 AM IST
Rohini Karthi 2026 : వేసవిలో, మరీ ముఖ్యంగా రోహిణి కార్తెలో రోళ్లు పగిలే స్థాయిలో ఎండలు దంచికొడుతుంటాయి. ఇప్పటికే దాదాపు 40రోజులుగా భగ్గుమంటున్న ఎండలతో జనం అల్లాడిపోతుండగా మరో పక్షం రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. రోహిణి కార్తె ఇవాళ రాత్రి 8.24గంటలకు ప్రవేశిస్తుందని పంచాంగం చెప్తోంది. జూన్8న మృగశిర రాకతో వాతావరణం చల్లబడుతుంది. ఈ నేపథ్యంలో రోహిణి కార్తె నేపథ్యం, ఆ విశేషాలు.
అగ్నిగుండంలా రాష్ట్రం - వడదెబ్బతో 16 మంది మృతి
'రోహిణి' అంటే 'ఎర్రని కాంతి' అని అర్థం. మొత్తం 27నక్షత్రాల్లో ఇది నాలుగోది కాగా, ఖగోళ శాస్త్రవేత్తలు అల్డెబరన్ (ఎర్రని నక్షత్రం) అని పిలుస్తారు. ఈ ఏడాది మే 25 సోమవారం రాత్రి 8.24గంటలకు రోహిణి కార్తె ప్రారంభం సమయంగా నిర్ధారించారు. సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి భూమికి దగ్గరగా రావడం వల్ల ఈ సమయంలో ఎండలు రోళ్లు పగిలిపోయే స్థాయిలో ఉంటాయి. సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకడం వల్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశాలున్నాయి. వాస్తవానికి రోహిణి లో నమోదయ్యే గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు వారం రోజుల ముందుగానే రికార్డయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచండ భానుడి ప్రతాపానికి అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. రోడ్లన్నీ నిర్మానుష్యమైపోయాయి. మరో వైపు వడదెబ్బ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది.
పిడుగులు పడే అవకాశం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తేమతో కూడిన గాలి హరించుకుపోయి రాజస్థాన్ నుంచి వీస్తున్న వేడిగాలులు అధిక ఉష్ణోగ్రతలకు కారణమని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (NIDM) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ గుబ్బల చినసత్యనారాయణ వెల్లడించారు. 'గతంలో 2015, 2023 సంవత్సరాల్లో ఎల్‌నినో ప్రభావం వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంకన్నా రెండు డిగ్రీల అదనంగా వేడి పెరగడంతో పాటు ఉక్కపోత ఎక్కువైంది. ఈ క్రమంలో పీడనం కారణంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉంటుంది. వర్షాలు కురిసినా ఆ ప్రభావం చాలా తక్కువే. మళ్లీ ఎండవేడి పెరిగిపోతుంది. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగానే ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి' అని చినసత్యనారాయణ పేర్కొన్నారు.
`రోహిణి తర్వాత జూన్ 8న మృగశిర కార్తె ప్రవేశిస్తుంది. ఈ కార్తె చల్లటి కబురు మోసుకొస్తుంది. నైరుతి రుతు పవనాలు అంతటా విస్తరించి వర్షాలు కురుస్తాయి. దీంతో వాతావరణం పూర్తిగా మారిపోతుంది.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్న్యూస్! - ఒక్క ట్రైన్లోనే తిరుపతి, అరుణాచలం, శ్రీరంగం!
ఇంట్లో "బొద్దింకలు" ఎక్కువగా ఉన్నాయా ? - ఈ టిప్స్ పాటిస్తే ఒక్కటి కూడా ఉండదు!

