ETV Bharat / offbeat

నీట్​ లో సీట్​ రాలేదు - ఏకంగా రోల్స్ రాయిస్ రెడ్​ కార్పెట్​ పరిచింది!

- దారులు మూసుకుపోతే, ద్వారాలు తెరుచుకుంటాయని నిరూపించిన యువతి - ఏడాదికి 72 లక్షల వేతనంతో సత్తా చాటిన రితూ!

Rithuparna
Rithuparna (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : July 6, 2026 at 1:29 PM IST

2 Min Read
Choose ETV Bharat

Rithuparna : ఓటమి ఎదురైతే.. ఇక మిగిలింది ఏమీ లేదని బాధపడుతుంటారు చాలా మంది. కానీ అదే ఓటమిని విజయానికి తొలి మెట్టుగా మార్చుకున్నప్పుడే జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఇందుకు కర్ణాటకకు చెందిన 20 ఏళ్ల రితుపర్ణ ప్రయాణమే తిరుగులేని ఉదాహరణ.

డాక్టర్‌ కావాలన్నది ఆమె చిన్నప్పటి కల. ఆమెతోపాటే ఆ స్వప్నం కూడా పెరిగి పెద్దదైంది. దానికోసం ఎంతో కష్టపడి నీట్‌ పరీక్ష రాశారు. అయితే ఆశించిన MBBS సీటు రాలేదు. దాంతో తన కలలు చిద్రమైనట్టే అనిపించింది. ఇలాంటి పరిస్థితి ఎదురైతే, చాలామంది అక్కడితో నిరాశలో మునిగిపోతారు. కానీ రితుపర్ణ మాత్రం ఓటమిని అంగీకరించినా, జీవితాన్ని మాత్రం ఓడిపోనివ్వలేదు. "కేవలం ఒక పరీక్ష నా భవిష్యత్తును డిసైడ్ చేయదు" అని నిర్ణయించుకుని కొత్త దారిని ఎంచుకున్నారు. BE (రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌)లో చేరి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు.

కాలేజీలో చేరిన తొలి రోజు నుంచే ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. రైతులకు ఉపయోగపడేలా అరేకానట్‌ హార్వెస్టర్‌ అండ్‌ స్ప్రేయర్‌ రోబోను రూపొందించారు. ఇదే ఆమె తొలి ప్రాజెక్ట్‌. కానీ అదే ఆమె ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసింది. గోవా ఇనెక్స్‌ సహా పలు జాతీయ స్థాయి పోటీల్లో ఈ ప్రాజెక్టును ప్రదర్శించి బంగారు, వెండి పతకాలను సొంతం చేసుకున్నారు. అంతేకాదు, వైద్యులతో కలిసి రోబోటిక్‌ సర్జరీపై పరిశోధనలు చేశారు. NIT-సూరత్‌కల్‌లోని పరిశోధనా టీమ్​తో కలిసి పనిచేసే అరుదైన అవకాశాన్ని కూడా అందుకున్నారు.

అయితే, ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చింది ఒక ధైర్యమైన నిర్ణయం. ప్రపంచ ప్రఖ్యాత రోల్స్‌-రాయిస్‌కు చెందిన గ్లోబల్‌ ఏరోస్పేస్‌ సంస్థకు నేరుగా మెయిల్‌ పంపి ఇంటర్న్‌షిప్‌ అవకాశం కోరారు. మొదట ఆ సంస్థ ప్రతినిధులు "నెల రోజుల టైమ్ ఇచ్చినా ఒక టాస్క్‌ కూడా పూర్తిచేయలేవు" అని చెప్పారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. "ఒక్క అవకాశం ఇవ్వండి" అని పట్టుదలగా కోరారు. చివరకు అవకాశం లభించింది. అందరూ నెలరోజులు పడుతుందని భావించిన పనిని కేవలం వారం రోజుల్లోనే విజయవంతంగా పూర్తిచేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె ప్రతిభను గుర్తించిన సంస్థ వెంటనే ఇంటర్న్‌షిప్‌ను కొనసాగించింది.

ఎనిమిది నెలలపాటు అసైన్‌మెంట్లు, మూల్యాంకనాలు, ఇంటర్వ్యూలను విజయవంతంగా పూర్తి చేస్తూనే మరోవైపు ఇంజినీరింగ్‌ చదువును కూడా కొనసాగించారు. చివరకు గత ఏడాది వార్షిక రూ.39.6 లక్షల వేతనంతో రోబోటిక్స్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ప్రీ-ప్లేస్‌మెంట్‌ ఆఫర్‌ను దక్కించుకున్నారు. పగలు కాలేజీ, అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు ఉద్యోగం చేస్తూ తన ప్రతిభను మరింత నిరూపించారు. ఫలితంగా ఆమె వార్షిక వేతనం రూ.72.3 లక్షలకు పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇంజినీరింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఇప్పుడు మరిన్ని విజయాల వైపు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తున్నారు.

చిన్న చిన్న వైఫల్యాలకే కుంగిపోయే వారెందరో ఉన్న ఈ రోజుల్లో రితుపర్ణ కథ.. యువతకు గొప్ప సందేశం ఇస్తోంది. ఒక పరీక్షలో ఓడిపోవడం అంటే జీవితంలో ఓడిపోయినట్టుకాదు. ఒక దారి మూసుకుపోతే మరో దారి తప్పకుండా తెరుచుకుంటుంది. మనల్ని మనం నమ్ముకుని పట్టుదలతో ముందుకు సాగితే అపజయాలే విజయాలకు పునాదులవుతాయని రితుపర్ణ తన ప్రయాణంతో నిరూపించారు. నిజంగా ఈ తరానికి ఆమె ఓ గొప్ప స్ఫూర్తే కదా.. ఏమంటారు?