కమ్మని "బీరకాయ పొట్టు పచ్చడి" - వారెవ్వా ఏం టేస్ట్ గురూ అనాల్సిందే!
బీరకాయ పొట్టుతో చట్నీ - ఈ పద్ధతిలో చేస్తే నోటికి కొత్త రుచినిస్తుంది!

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 4, 2026 at 12:53 PM IST
Beerakaya Pottu Pachadi Recipe in Telugu : బీరకాయతో కర్రీ, ఫ్రై, పప్పు, గారెలు అంటూ వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. అయితే వీటిని చేసే క్రమంలో పైన పొట్టు తీసి పడేస్తుంటారు. కానీ దీనితోనూ పచ్చడి చేసుకోవచ్చని మీకు తెలుసా? లేదంటే మాత్రం ఈ విధంగా చేశారంటే నోటికి కొత్త రుచినిస్తుంది. ఇది వేడివేడి అన్నంతో పాటు టిఫిన్స్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. మరి నోరూరించే బీరకాయ పొట్టు పచ్చడి ఎలా చేయాలి? ఇందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.
కర్ణాటక స్పెషల్ "క్యాబేజీ కుర్మా" - ఒక్కసారి తిన్నారంటే అదరహో అనాల్సిందే!

కావాల్సిన పదార్థాలు :
- బీరకాయ పొట్టు - ఒక కప్పు
- పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు
- పసుపు - 1 టీ స్పూన్
- తాలింపు దినుసులు - 1 టేబుల్ స్పూన్
- ఎండుమిర్చి - 6
- కరివేపాకు - కొద్దిగా
- చింతపండు - 20 గ్రాములు
- వెల్లుల్లి రెబ్బలు - 10
- పచ్చిమిర్చి - 3
- ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం :
- ఇప్పుడు ముందుగా కావాల్సిన పరిమాణంలో బీరకాయ పొట్టును తీసి పెట్టుకోవాలి. అలాగే మూడు పచ్చిమిర్చిని తరిగి ఉంచాలి.
- అనంతరం స్టవ్ ఆన్ చేసి పాన్లో కప్పు బీరకాయ పొట్టు, ఒక టీ స్పూన్ పసుపు వేయాలి. అదేవిధంగా పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా ఉప్పు , కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి.

- ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి పాన్లో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి వేయించాలి. పల్లీలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
- అనంతరం పల్లీలను పొట్టు తీసి మిక్సీజార్లో వేసి గ్రైండ్ చేయాలి. ఇందులోనే ఉడికించిన బీరకాయ పొట్టు మిశ్రమం, 20 గ్రాముల చింతపండు, సరిపడా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టాలి.

- ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. నూనె వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు, ఆరు ఎండుమిర్చి, పది వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడి మిశ్రమాన్ని యాడ్ చేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అంతే ఘుమఘుమలాడే బీరకాయ పొట్టు పచ్చడి మీ ముందుంటుంది!

- ఈ పద్ధతిని పాటిస్తూ ఓసారి ఇంట్లో చేశారంటే ఇంటిల్లిపాదీకి ఫేవరెట్ పచ్చడిగా మారుతుంది.
- మీరు ఈ పచ్చడిని ఎక్కువ పరిమాణంలో చేసుకోవాలనుకుంటే బీరకాయ పొట్టుతో పాటు ఇతర పదార్థాలను అందుకనుగుణంగా పెంచి తీసుకుంటే సరి.
కమ్మని "నువ్వుల బొబ్బట్లు" - నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతాయి!
మసాలా ఘాటుతో అద్దిరిపోయే "మటన్ దో ప్యాజా" - ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

