ETV Bharat / offbeat

కిసాన్​గా మారిన జవాన్ - క్యారెట్ల సాగుతో ఏటా రూ.50 కోట్లు!

"క్యారెట్ కింగ్ ఆఫ్ ఇండియా" - రైతుల రాత మార్చిన దేశ్వాల్

carrot_king_of_india
carrot_king_of_india (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2026 at 2:49 PM IST

3 Min Read
Choose ETV Bharat

Carrot King of India : అతడు ఆర్మీలో పనిచేసే వాడు. ఆ తర్వాత సాగుపై ఆసక్తి కొద్దీ స్నేహితుడితో కలిసి సేద్యం ప్రారంభించాడు. పెట్టుబడి కూడా రాకపోవడం అతన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎలాగైనా తిరిగి రాబట్టుకోవాలని చేసిన ప్రయత్నం విజయతీరాలకు చేర్చింది. పాతికేళ్ల వ్యవసాయ ప్రస్థానంలో "క్యారెట్ కింగ్" అనిపించుకుంటూఆదర్శరైతుగా, వ్యాపార వేత్తగా ఎదిగాడు సుభాష్ చంద్ర దేశ్వాల్.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సికింద్రాబాద్‌కి చెందిన సుభాష్ ను స్థానికులే కాదు, పరిసర ప్రాంతాల రైతులు సైతం క్యారెట్ కింగ్ అని పిలుచుకుంటారు. దాదాపు మూడు దశాబ్దాలుగా క్యారెట్ సాగుపై ఆయన చేయని ప్రయోగం లేదు. పూర్తిగా క్యారెట్ సాగులోనే మునిగితేలిన ఆయన తనతో పాటు ప్రతి ఒక్క రైతునూ ఆ దిశగా అడుగులు వేయించాడు. ఫలితంగా సికింద్రాబాద్ ఇపుడు క్యారెట్‌ హబ్‌గా మారిపోయింది. తన ఆదాయం ఏటా రూ.50కోట్ల టర్నోవర్ చేరింది. క్యారెట్ సాగు ఆయన ఎలా ప్రారంభించారు? ఎలా విజయం సాధించారో తెలుసుకుందాం.

"ఏపీ To గోవా" పెరగనున్న కనెక్టివిటీ - గుంతకల్ వరకు 'తిరుమల ఎక్స్​ప్రెస్'

carrot_king_of_india
carrot_king_of_india (ETV Bharat)

హరియాణాలోని భదానీకి చెందిన సుభాష్ కుటుంబం పూర్తిగా వ్యవసాయ నేపథ్యం. ఆర్మీలో పనిచేస్తూ సెలవుల్లో తన సోదరుడు ఉండే ఉత్తర్‌ప్రదేశ్‌లోని సికింద్రాబాద్‌కి వెళ్తుండేవాడు. స్థానికుడైన లాల్‌ కృష్ణన్‌ యాదవ్‌ పరిచయం అతడి జీవితాన్ని మలుపు తిప్పి వ్యవసాయం వైపు అడుగులు వేయించింది. ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం నూతన వ్యవసాయ విధానాలవైపు అడుగు వేయించింది. ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనే ఉద్దేశంతో తాను ఆర్మీ నుంచి పదవీ విరమణ తీసుకున్న తర్వాత సికింద్రాబాద్‌కి వెళ్లాడు సుభాష్‌. స్నేహితులిద్దరూ ముందుగా 2 ఎకరాలు కౌలుకు తీసుకుని ఆలూ, ఉల్లి, గోధుమ సాగు చేయగా కనీసం పెట్టుబడి కూడా దక్కలేదు. అయినా పట్టువదలకుండా నాలుగేళ్లు చెమటోడ్చారు.

carrot_king_of_india
carrot_king_of_india (ETV Bharat)

కొత్త పంటతో ప్రయోగం

వ్యవసాయంలో మూస విధానాలు ఏ మాత్రం ప్రయోజనకరం కాదనే ఆలోచనతో కొత్తగా ఏదైనా ప్రారంభించాలన్న లక్ష్యంతో వ్యవసాయ విశ్వవిద్యాలయాల చుట్టూ తిరగడంతో పాటు ఎందరో శాస్త్రవేత్తల్ని కలిశాడు. దుంపల సాగుకు ఇక్కడి నేలలు, వాతావరణం అనుకూలమనే విషయం తెలుసుకుని 'ఇంగ్లిష్‌ క్యారెట్ల' సాగుకు శ్రీకారం చుట్టారు.

2005లో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని క్యారెట్‌ సాగు చేయడంతో అద్భుతమైన ఫలితాలు, ఆదాయం వచ్చింది. అదే ఉత్సాహంతో 20 ఎకరాల్లో తాము సాగు చేయడంతో పాటు చుట్టుపక్కల రైతులకూ క్యారెట్‌ పండించాలని చెప్పాడు. కానీ, మార్కెట్లో దళారులు మోసం చేస్తుండడం మరో ఆలోచనకు బీజం వేసింది. ఛార్జీలూ, కమీషన్లూ అంటూ దళారుల దోపిడీ ఎక్కువ కావడంతో సుభాష్‌ తట్టుకోలేకపోయాడు. పెద్ద మొత్తంలో నాణ్యమైన పంటతీస్తే నేరుగా వ్యాపారులే దగ్గరకు వస్తారని, రైతు చెప్పిన ధరే నిర్ణయిస్తారని నమ్మాడు.

carrot_king_of_india
carrot_king_of_india (ETV Bharat)

మలుపుతిప్పిన నిర్ణయం

తాను బలంగా నమ్మిన సిద్ధాంతాన్ని అనుకరిస్తూ ఈ సారి వంద ఎకరాల్లో క్యారెట్‌ సాగు చేశాడు. పంట సాగుకు అనుగుణంగా ఎత్తయిన మడుల తయారీ, విత్తనాలు, నీళ్లు, ఎరువుల కోసం ప్రత్యేకంగా యంత్రాల్ని ఉపయోగించాడు. సాగుతో పాటు ఉత్పత్తి ప్రాసెసింగ్ కోసం ప్రత్యేకమైన యంత్రాల్ని తెచ్చాడు. క్యారెట్లను తెంపడం, శుభ్రం చేయడం కోసం మినీ ట్రాక్టర్లు, డ్రమ్‌ వాషర్లను తయారు చేయించి ఉపయోగించాడు. దిగుబడి పెరగడంతో పాటు నాణ్యమైన ఉత్పత్తి కారణంగా మొదటిసారిగా రూ.75 లక్షల ఆదాయం ఆర్జించాడు. దళారుల జోక్యం లేకుండా తానే సొంతంగా అమ్మాలనుకుని స్నేహితులిరువురూ కంపెనీ ప్రారంభించారు.

ఏటా రూ.50కోట్ల టర్నోవర్!

సుభాష్-యాదవ్‌ ద్వయం 2009లో 'సన్‌షైన్‌ వెజిటబుల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌' ఏర్పాటు చేసింది. పంట పండించడం దగ్గర్నుంచీ అమ్మడం వరకూ అన్ని పనులూ ఈ కంపెనీ చూసుకుంటుంది. దీంట్లో రైతుల భాగస్వామ్యం పెరగడంతో టన్నుల కొద్దీ క్యారెట్ల దిగుబడిని నిల్వ చేయడం సమస్యగా మారింది. దీంతో తమ దగ్గర ఉన్న డబ్బుతోపాటు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సబ్సిడీలతో కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటు చేశాడు. విత్తనాల తయారీ మొదలుకుని పంట అమ్మకాల వరకూ రైతులకు దన్నుగా నిలవడంతో పాటు ఎకరానికి దాదాపు లక్షన్నర వరకూ ఆదాయం కల్పిస్తున్నాడట. ప్రస్తుతం సుభాష్‌-యాదవ్‌ కలిసి 1500 ఎకరాల్లో క్యారెట్‌ సాగు చేస్తూ ఏడాదికి రూ.50 కోట్ల టర్నోవర్‌ సాధిస్తున్నారు. తాను కొత్తగా ప్రయత్నించి విజయం సాధించడంతో పాటు ఏళ్ల తరబడి మూస ధోరణిలో సాగు చేస్తున్న రైతులకు సైతం మార్గనిర్దేశం చేసిన సుభాష్ ప్రయాణం ఎంతో మందికి ఆదర్శం అనడంలో సందేహం లేదు.

సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? - ముందుగా పరిశీలించాల్సిన "చెక్ లిస్ట్" ఇదే!

"మై పెంగ్విన్ ఫ్రెండ్" - డిండిమ్ ఈ ఏడాదైనా తిరిగొస్తుందా?