ETV Bharat / offbeat

శివుడికి విభూతి ఎందుకు? - అసలు కారణం మీకు తెలుసా?

- పరమేశ్వరుడి ఆరాధనలో విభూతికి విశిష్ఠ స్థానం - దాని వెనుక పరమార్థాలు ఉన్నాయంటున్న పండితులు

Shiva vibudi
Shiva vibudi (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : June 2, 2026 at 2:50 PM IST

2 Min Read
Choose ETV Bharat

Shiva vibudi : ముక్కంటి ఆరాధనలో విబూదికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. "విష్ణుమూర్తి అలంకార ప్రియుడు.. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు" అనేది పెద్దల మాట. భోళాశంకరుడు కేవలం కాస్త విభూతి అభిషేకంతోనే సంతోషించి భక్తుల కోరికలు తీరుస్తాడని చెబుతారు. అందుకే ఆయనను ఆశుతోషుడు అని కూడా పిలుస్తారు. అయితే, శివుడు భౌతికమైన ఆభరణాలకు బదులుగా శరీరం అంతటా విభూతిని ధరించడం వెనుక, భక్తులు స్వామికి భస్మంతో పూజ చేయడం వెనుక.. ఆధ్యాత్మిక, తాత్విక పరమార్థాలు దాగి ఉన్నాయని పండితులు చెబుతారు.

శివుడు లయకారుడు. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణీ ఏదో ఒకరోజు మరణించక తప్పదనే అంతిమ సత్యాన్ని విభూతి మనకు గుర్తుచేస్తుందట. మనిషి బతికి ఉన్నంత కాలం ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించినా, ఎంతటి అధికారంలో ఉన్నా, ఆఖరికి ఈ భౌతిక శరీరం మొత్తం బూడిదగా మారాల్సిందేననే వైరాగ్య భావనను విబూతి సూచిస్తుందట. సమస్తాన్నీ కాల్చివేసే అగ్ని, ఎలాగైతే స్వచ్ఛమైన బూడిదను మిగులుస్తుందో, అలాగే శివుడు కూడా తనను ఆశ్రయించిన భక్తుల అజ్ఞానాన్ని, అహంకారాన్ని, పాపాలనూ దహించివేసి వారి అంతరాత్మను స్వచ్ఛంగా మారుస్తాడని, దానికి ప్రతీకే ఈ విబూతి అని తాత్విక గ్రంథాలు చెబుతున్నాయి.

ఇక, దిగంబరుడైన పరమేశ్వరుడు శ్మశానవాసి. రుద్రభూమిలో పేద, ధనిక, కుల, మత భేదాలు ఉండవు. అక్కడ అందరూ సమానమే. ప్రత్యేకమైన రంగూ, రూపూ లేని స్వచ్ఛమైన విభూతిని ధరించడం ద్వారా.. సమస్త లోకానికి సామాజిక సమానత్వాన్ని స్వామి బోధిస్తున్నాడు. భగవంతుడి దృష్టిలో ప్రాపంచిక ఆడంబరాలకు ఎలాంటి విలువా లేదని, అంతఃశుద్ధి మాత్రమే ముఖ్యమని దీనివల్ల స్పష్టమవుతోందని పండితులు చెబుతున్నారు.

మహాశివుడి దశావతారాలు, వాటి ప్రత్యేకతలు ఇవే - Dasavataras Of Lord Shiva

త్రిగుణ లయం:

శివారాధనలో భాగంగా నుదుటిపై విభూతిని మూడు అడ్డ గీతలుగా ధరించడాన్ని 'త్రిపుండ్రం' అంటారు. ఇది మనిషిలోని మూడు ప్రధాన దోషాలైన అహంకారం, స్వార్థం, అజ్ఞానాన్ని అధిగమించడాన్ని సూచిస్తుందట. ఈ మూడు గీతలు సృష్టి, స్థితి, లయకారక శక్తులను కూడా ప్రతిబింబిస్తాయని పండితులు చెబుతున్నారు.

సాధారణంగా విభూతిని నుదుటిపైన, ఛాతీ దగ్గర, గొంతుభాగంలోనూ పెట్టుకుంటారు. దీనివల్ల శరీరంలోని ముఖ్యమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు ఉత్తేజితమవుతాయి. నుదుటిపై ధరించడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి.శాస్త్రీయ కోణంలో చూస్తే, ఆవు పేడ, పవిత్ర మూలికలతో తయారుచేసే స్వచ్ఛమైన విభూతికి శరీరంలోని అధిక తేమను, చెమటను పీల్చుకునే గుణం ఉంటుందట. ఇది జలుబు, తలనొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని చెబుతారు. ఈ విధంగా శివునికి చేసే విభూది పూజ మానవాళికి అటు ఆధ్యాత్మిక ఉన్నతిని, ఇటు శారీరక ఆరోగ్యాన్నీ ప్రసాదిస్తుందని పండితులు చెబుతున్నారు.

భూమ్మీద శివుడు నాట్యం చేసిన 5 ప్రాంతాలివే - మనకు సమీపంలోనే ఉన్నాయి!