"నీళ్లలో తడిసిపోవు, చేతుల్లో మాసిపోవు" - బ్యాక్టీరియా అంటని కరెన్సీ నోట్లు!
కొత్త కరెన్సీ నోట్ల అభివృద్ధి - వార్నిష్ట్ కరెన్సీకి RBI కసరత్తు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 30, 2026 at 12:43 PM IST
New Indian Currency Notes : నీళ్లలో తడిసిపోకుండా, చేతులు మారినా మాసిపోకుండా, బ్యాక్టీరియా అంటుకోకుండా కరెన్సీ నోట్లు ఉంటే ఎంతో బాగుంటుందో కదా! అవును! సరిగ్గా ఇలాంటి నోట్లనే అభివృద్ధి చేస్తోంది ఆర్‌బీఐ. నాణ్యత మాత్రమే కాదు! సెక్యూరిటీ పరంగానూ కొత్త ఫీచర్లు తీసుకురానుంది.
నాలుగైదు చేతులు మారగానే చిరిగిపోయే నోట్లు, మరో వైపు చాపకింద నీరులా చెలామణీ అవుతున్న నకిలీ కరెన్సీ! ఈ నేపథ్యంలో నోట్ల నాణ్యత పెంచేదిశగా ఆర్‌బీఐ చర్యలు చేపట్టింది. అంతేకాదు! వాటిలో కొత్త సెక్యూరిటీ ఫీచర్ల దిశగా "వార్నిష్డ్ కరెన్సీ" ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. పలుచని, రక్షిత అల్ట్రా వయొలెట్ క్యూర్‌డ్ వార్నిష్ పూతపూసిన కాగితపు నోట్లు నీళ్లలో పడినా తడవకుండా, చేతులు మారినా మాసిపోకుండా కొత్తగానే కనిపిస్తాయి. ఇవి ప్రస్తుత నోట్లతో పోలిస్తే 3 రెట్లు అధిక నాణ్యత కలిగి ఉంటాయి. ఈ మేరకు మైసూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణా కేంద్రంలో రూ.100 నోటుపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలాంటి కరెన్సీ ఇప్పటికే యూరప్ దేశాల్లో చెలామణీలో ఉంది.
లక్షలు దానం చేస్తున్న "బిచ్చగాడు" - సీఎం సహాయనిధికి భారీగా విరాళం!
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యూపీఐ లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు పెరిగినప్పటికీ కరెన్సీ నోట్ల వినియోగం ఏ మాత్రం తగ్గలేదని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సాధారణ ప్రజలు, చిరు వ్యాపారులు ఇంకా నగదు లావాదేవీలకే మొగ్గుచూపుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వార్షిక నివేదిక వెల్లడించింది. దీని వల్ల దేశ కరెన్సీ- జీడీపీ నిష్పత్తి గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే (2024-25) 11.7శాతం నుంచి (2025-26) 12.1 శాతానికి పెరిగింది.

నకిలీ నోట్లూ ఎక్కువే
నగదు చెలామణీలో నకిలీ నోట్లు చాపకింద నీరులా విస్తరిస్తూ చేతులు మారుతున్నాయి. 2024-25లో దేశంలో పట్టుబడిన మొత్తం నకిలీ నోట్ల సంఖ్య 2,17,396 కాగా, 2025-26లో 5.7% 2,29,746కు పెరిగిపోవడం గమనార్హం. ఇందులో ప్రధానంగా రూ.500 నకిలీ నోట్లు 20.5% (1,41,907), ఆ తర్వాత రూ.20 నకిలీ నోట్లు 253 నుంచి 47.4% (373)కు చేరాయి. రూ.200 నకిలీ నోట్లు 32,660 నుంచి 30,591కు తగ్గగా, రూ.100 నకిలీ నోట్లు 51,069 నుంచి 45,621కు తగ్గాయి. మార్కెట్‌లో చెలామణీలో ఉన్న నకిలీ నోట్లలో 97.6 శాతం నోట్లను బ్యాంకులు విజయవంతంగా గుర్తించి అడ్డుకట్ట వేశాయి.
తగ్గిన ప్రింటింగ్ ఖర్చులు
రిజర్వ్ బ్యాంకు కొత్త నోట్ల ముద్రణ 3.03 లక్షల నుంచి 2.81 లక్షలకు తగ్గించేసింది. దీంతో నోట్ల ముద్రణా వ్యయం 2024-25లో రూ.6,372.8 కోట్ల నుంచి 2025-26లో రూ.4,875.2 కోట్లకు తగ్గింది.

సరికొత్త టెక్నాలజీ
కరెన్సీ నోట్లు సురక్షితంగా, పరిశుభ్రంగా ఉండేలా ఆర్‌బీఐ సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తోంది. ఈ ఏడాది జూలై తర్వాత విడతల వారీగా కొత్త సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన నోట్లు విడుదల కానున్నాయి. నోట్ల ద్వారా బ్యాక్టీరియా వ్యాపించకుండా యాంటీ-మైక్రోబియల్, యాంటీ-బ్యాక్టీరియల్ ట్రీట్‌మెంట్‌ను జోడిస్తున్నారు.

సవాళ్లు ఉన్నా బలమైన ఆర్థిక వ్యవస్థ
పశ్చిమాసియా సంక్షోభం, పెరిగిన ముడి చమురు ధరలు మండిపోతున్నా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆర్‌బీఐ నివేదిక స్పష్టం చేసింది. ముడిచమురు నిల్వలు, రవాణా, సరఫరా వ్యవస్థ అంతరాయాలు వంటి అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులున్నా బలమైన ఆర్థిక మూలాలే అందుకు కారణమని వెల్లడించింది. ఆహార ధాన్యాల నిల్వలు అందుబాటులో ఉండడం వల్ల ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుందని అంచనా వేసింది. అంతర్జాతీయంగా రూపాయి వినియోగం గణనీయంగా పెరుగుతోందని, వాణిజ్య భాగస్వామ్య దేశాలన్నింటికీ పరస్పరం ప్రయోజనకరంగా మారిందని ఆర్‌బీఐ పేర్కొంది.
మేడిన్ ఇండియా "బాహుబలి రైలు" వచ్చేస్తోంది! - స్పీడ్, విశేషాలు ఏమిటో తెలుసా?

