ఘుమఘుమలాడే "చికెన్ జహాపనా" - ఇఫ్తార్ విందులో సూపర్ రెసిపీ!
- రంజాన్ స్పెషల్ 'చికెన్ కర్రీ' - తిన్నవారెవరైనా సరే వహ్వా అనేస్తారంతే!

Published : March 1, 2026 at 5:02 PM IST
Ramzan Special Chicken Curry : ప్రస్తుతం ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం నడుస్తోంది. ఈ సందర్భంగా రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం బంధుమిత్రులతో కలిసి ఇఫ్తార్ విందును ఆరగిస్తుంటారు ముస్లిం సోదరులు. ఈ క్రమంలోనే అందరూ హాలీమ్, బిర్యానీల నుంచి కబాబ్‌ల వరకు రకరకాల రెసిపీలు టేస్ట్ చేస్తుంటారు. అయితే, ఇఫ్తార్ విందులో రెగ్యులర్‌గా చేసుకునే వంటకాలు కాకుండా ఈసారి వెరైటీగా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా? అలాంటి వారికోసమే ఒక స్పెషల్ రెసిపీ వెయిట్ చేస్తోంది.
అదే, నోరూరించే "చికెన్ జహాపనా". ఇది రెగ్యులర్ చికెన్ కర్రీలతో పోల్చితే సరికొత్త రుచిలో వావ్ అనిపిస్తుంది. ముఖ్యంగా బిర్యానీలోకి చాలా చాలా బాగుంటుంది. అలాగే, ఈ కర్రీ తయారీకి ఎక్కువ సమయం కూడా పట్టదు. అప్పటికప్పుడు చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. దీని రుచికి తిన్నవారేవరైనా సరే వహ్వారే అనేస్తారంతే. మరి, లేట్ చేయకుండా ఈ రంజాన్ స్పెషల్ చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- కిలో - చికెన్
- అర కప్పు - టమాటా ప్యూరీ
- ఆరు - ఉల్లిపాయలు
- ఒక కప్పు - పెరుగు
- నాలుగు టేబుల్‌స్పూన్లు - అల్లంవెల్లుల్లి పేస్ట్
- ఐదారు - పచ్చిమిర్చి
- ఒక స్పూన్ - షాజీరా
- రెండించుల ముక్క - దాల్చినచెక్క
- ఏడెనిమిది - లవంగాలు
- ఆరేడు - యాలకులు
- రెండు - బిర్యానీ ఆకులు
- ఒక స్పూన్ - పసుపు
- రెండు స్పూన్లు - కారం(రుచికి తగినంత)
- రెండు స్పూన్లు - ధనియాల పొడి
- ఒక స్పూన్ - జీలకర్ర పొడి
- ఒక చెంచా - గరంమసాలా
- రుచికి తగినంత - ఉప్పు
- నాలుగు టేబుల్‌స్పూన్లు - నెయ్యి
- ఆరు టేబుల్‌స్పూన్లు - నూనె
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- పుదీనా - కొద్దిగా
- రెండు టేబుల్‌స్పూన్లు - నిమ్మరసం
రంజాన్ స్పెషల్ "షీర్ కుర్మా" - ఈ టిప్స్‌తో చేశారంటే అమృతమే - క్షణాల్లో గిన్నెలు ఖాళీ!

తయారీ విధానం :
- నోరూరించే ఈ రెసిపీ కోసం ముందుగా చికెన్‌ను శుభ్రంగా కడగి పక్కన పెట్టుకోవాలి.
- అలాగే, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలను సన్నగా తరుక్కుని రెడీగా ఉంచుకోవాలి. అర కప్పు పరిమాణంలో టమాటా ప్యూరీని సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత బిర్యానీ ఆకులు, దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, షాజీరా వేసి వేయించాలి.

- అవన్నీ వేగి మంచి వాసన వస్తున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ తరుగు వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- తర్వాత అందులో పుదీనా తరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు వేసి పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేయించాలి.
- అనంతరం ఆ మిశ్రమంలో టమాటా ప్యూరీని యాడ్ చేసుకుని కలిపి సన్నని మంటపై నూనె పైకి తేలే వరకు మగ్గించుకోవాలి.
- ఆ తర్వాత పెరుగు, తగినన్ని నీళ్లు, కారం, పసుపు, ధనియాలపొడి, జీలకర్రపొడి, గరంమసాలా, టేస్ట్‌కు సరిపడా ఉప్పు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
- ఆపై స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ముక్కలు చక్కగా ఉడికి, గ్రేవీ చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి.
- ఆ విధంగా ఉడికించుకున్నాక చివరగా అందులో సన్నని కొత్తిమీర తరుగు, నిమ్మరసం యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు.
- అంతే, సరికొత్త రుచిలో నోరూరించే "చికెన్ జహాపనా" కర్రీ రెడీ అవుతుంది!
- ఒకవేళ మీరు తక్కువ పదార్థాలతో రెడీ చేసుకోవాలనుకుంటే చికెన్‌తో పాటు ఇతర పదార్థాలను తగ్గించి తీసుకుంటే సరిపోతుంది.
- మరి, నచ్చితే మీరూ ఎప్పుడు చేసుకునే పద్ధతిలో కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి. నయా టేస్ట్‌తో ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చేస్తుంది.

పచ్చికారంతో ఘుమఘుమలాడే "గుత్తి వంకాయ కర్రీ" - ఒక్కసారైనా తిని తీరాల్సిందే గురూ!

