రంజాన్ స్పెషల్ "సూప్" - ఇన్స్టంట్ ఎనర్జీ చాలా టేస్టీగా!
- రంజాన్ మాసంలో హలీమ్ మాత్రమే ట్రై చేస్తున్నారా? - ఓసారి ఇలా గంజి తయారు చేసుకోండి!

Published : February 28, 2026 at 1:55 PM IST
Ramdan Special Ganji Recipe: ముస్లింలకు పవిత్రమైన రంజాన్ మాసం నడుస్తోంది. రంజాన్ అనగానే ఉపవాస ప్రార్థనలతోపాటు నోరూరించే వంటకాలు గుర్తొస్తాయి. ముఖ్యంగా హలీమ్ స్పెషల్ వంటకంగా చెప్పొచ్చు. దీన్ని కేవలం ముస్లింలు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు. అయితే, రంజాన్ మాసంలో హలీమ్ మాత్రమే కాకుండా టేస్ట్ చేయాల్సిన ఫుడ్ మరొకటి ఉంది. అదే గంజి రెసిపీ. దీనినే "ఆష్" అని కూడా అంటారు. ఉపవాసం ఉన్న తర్వాత చాలా మంది దీన్ని తప్పక తాగుంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. తయారు చేసుకోవడం కూడా సులువే. మరి, లేట్ చేయకుండా కమ్మని గంజి ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- బియ్యం - 1 కప్పు
- పెసరపప్పు - 1 కప్పు
- నెయ్యి - తగినంత
- దాల్చినె చెక్క - చిన్న ముక్క
- లవంగాలు - 2
- బిర్యానీ ఆకు - 1
- జీలకర్ర - 1 టీస్పూన్
- పచ్చిమిర్చి - 2
- ఉల్లిపాయ - 1
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
- పుదీనా - కొద్దిగా
- టమాటా - 1
- ఉప్పు - రుచికి సరిపడా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం:
- ఈ గంజి రెసిపీ తయారు చేయడానికి ముందుగా ఓ పొడి ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి బియ్యం వేసి లో-ఫ్లేమ్‌లో దోరగా వేయించాలి.
- బియ్యం ఫ్రై అయ్యాక తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. అదే పాన్‌లోకి పెసరపప్పు వేసి దోరగా వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి.

- బియ్యం, పెసరపప్పు పూర్తిగా చల్లారినాక మిక్సీజార్‌లోకి వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిని అర కప్పు కొలత ప్రకారం ఓ చిన్న గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన పిండిని స్టోర్ చేసుకుంటే ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు.
- అర కప్పు బియ్యంపెసర పిండిలో కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన ఉంచాలి.

- గంజి రెసిపీ కోసం కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, పుదీనాను సన్నగా కట్ చేసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నె పెట్టి 3 టేబుల్స్పూన్ల నెయ్యి పోసి వేడి చేసుకోవాలి.
- కాగిన నెయ్యిలో జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు వేసి లో-ఫ్లేమ్‌లో వేయించాలి.
- మసాలా దినుసులు వేగినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు వేసి కలుపుతూ వేయించాలి.
- ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్లోకి మారినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.

- అల్లం మగ్గినాక పుదీనా తరుగు వేసి ఓ నిమిషం వేయించాలి. అనంతరం అందులోకి టమాటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి మెత్తగా ఉడికించాలి.
- టమాటాలు ఉడికిన తర్వాత 5 కప్పుల నీరు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి హై-ఫ్లేమ్‌లో మరిగించాలి.
- వాటర్ మరుగుతున్నప్పుడు కలిపి పెట్టుకున్న పెసరపిండిని వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
- అనంతరం ఫ్లేమ్‌ను లో టూ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి సుమారు 10 నిమిషాల పాటు మరిగించాలి.
- మిశ్రమం రెడీ అయినాక కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే సరి. రంజాన్ స్పెషల్ గంజి రెడీ. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్.

చిట్కాలు :
- పెసరపప్పు, బియ్యం లో-ఫ్లేమ్‌లో మాత్రమే వేయించాలి. ఎక్కువ మంట మీద వేయిస్తే లోపలి వరకు వేగవు, పైగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది.
- పెసరపప్పు మిశ్రమం నీటిలో ఉడికేటప్పుడు ఏమైనా చిక్కగా అనిపిస్తే మరో అర కప్పు నుంచి కప్పు నీటిని బాగా మరిగించి యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ వాటర్ కలిపితే ఉప్పును కూడా సరిచూసుకోవాలి.
- ఈ గంజి మరి చిక్కగా, మరి పల్చగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి.
వెడ్డింగ్ స్టైల్ "బెండకాయ ఫ్రై" - కరకరలాడుతూ సూపర్‌గా ఉంటుంది!
మటన్ కీమాతో అద్దిరిపోయే "సమోసాలు" -పైన క్రంచీ, లోపల జ్యూసీగా!

