రాఖీ పండక్కి మీ సోదరికి ఏ గిఫ్ట్ ఇస్తున్నారు? - తనకు ఏం ఇష్టమో మీకెలా తెలుసు?
అన్నాచెల్లెళ్ల అనుబంధాల పండుగ రాఖీ - బహుమతులతో మధురజ్ఞాపకాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 26, 2026 at 12:59 PM IST
Rakhi Gift for Sister : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ రోజున బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. రాఖీ కట్టిన సోదరిని ఆనందపరిచేలా విలువైన బహుమతులు ఇస్తుంటారు. కొందరు నగదు రూపంలో, మరికొందరు ఆభరణాలు కానుకగా సమర్పిస్తుంటారు. అయితే, ఈ సారి రాఖీ పండుగకు మీ సోదరి మనసును హత్తుకునేలా, ఆమె ముఖంలో చిరునవ్వు తెచ్చేలా ఏదైనా చేయండి. ఆమె జ్ఞాపకాలలో శాశ్వతంగా నిలిచిపోయే బహుమతిని ఇవ్వండి. మీ సోదరి మీకు ఎంత ప్రత్యేకమో మీరు ఇచ్చే బహుమతి చెప్పకనే చెప్తుంది. ఇక్కడ కొన్ని రకాల రాఖీ బహుమతి ఆలోచనలు షేర్ చేస్తున్నాం.
రాఖీ పండుగ సందర్భంగా మీ అక్క, చెల్లికి ఏ బహుమతి ఇవ్వాలా? అని ఆలోచిస్తున్నారా? అది కేవలం ఒక సాధారణ బహుమతి కాకూడదు! మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమకు నిజమైన ప్రతీకగా నిలవాలి. రక్షాబంధన్ కేవలం పవిత్రమైన పండుగ మాత్రమే కాదు! సంతోషం, బాధలతో నిండిన బాల్యపు జ్ఞాపకాల వేడుక, జీవితాంతం నిలిచిపోయే విడదీయరాని బంధం. ఈ ప్రత్యేకమైన రోజున మీ సోదరి మనసును హత్తుకునేలా, ఆమె ముఖంలో చిరునవ్వు తెచ్చేలా ఏదైనా చేయండి. ఆమె జ్ఞాపకాలలో శాశ్వతంగా నిలిచిపోయే బహుమతిని ఇవ్వండి.
'రాఖీ పౌర్ణమి నాడే చంద్రగ్రహణం' - జ్యోతిషులు ఏమంటున్నారంటే!
క్యాష్ : మీ చెల్లికి ఏది ఇష్టమో మీకు తెలియనపుడు, ఏ బహుమతి ఇవ్వాలో అర్థంకానపుడు ఎంచుకునే మేలైన మార్గమిది. ఇది ఉత్తమమైన, సులభమైన మార్గం. అమ్మాయిలు షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. కాబట్టి మీరు ఆమెకు నగదు బహుమతిగా ఇస్తే, ఆమె చాలా సంతోషించి, తనకు నచ్చిన దేన్నైనా సులభంగా కొనుక్కోగలదు.
ఆభరణాలు : ఆభరణాలు నచ్చని అమ్మాయిలు ఉంటారా?! ప్రతి ఒక్కరూ వారి దుస్తులకు సరిపోయే రకరకాల ఆభరణాలను ధరించడానికి ఇష్టపడతారు. కాబట్టి రక్షాబంధన్ వంటి ప్రత్యేక సందర్భంలో మీరు వారి ఇష్టానికి అనుగుణంగా ఆభరణాలను బహుమతిగా ఇవ్వవచ్చు. అది నెక్లెస్, బ్రాస్‌లెట్, గాజు లేదా చెవిపోగులు కావచ్చు. మార్కెట్లో ప్రస్తుతం వన్‌గ్రామ్ గోల్డ్ నగలు తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. వాటిని బహుమతిగా అందించి మీ సోదరి మనసు గెలుచుకోండి.
ఫిక్స్‌డ్ డిపాజిట్ : మీరు మీ సోదరీమణుల భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకుంటే, మీ బడ్జెట్‌కు అనుగుణంగా వారి పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఖాతాను తెరవవచ్చు. దీనిపై వచ్చే వడ్డీ కాలక్రమేణా పెరుగుతుంది. ఈ డబ్బు మీ సోదరీమణులకు ఉపయోగపడుతుంది.
బ్యూటీ కిట్ : ఈ రోజుల్లో అమ్మాయిలు తమ చర్మ సంరక్షణ పట్ల చాలా శ్రద్ధ వహిస్తున్నారు. వారు తరచుగా మార్కెట్లో దొరికే ఖరీదైన చర్మ సంరక్షణ ఉత్పత్తులన్నింటినీ కొని ఉపయోగిస్తున్నారు. కాబట్టి 'బ్యూటీ కిట్' మీ సోదరికి ఒక గొప్ప బహుమతిగా ఉంటుంది. అందులో మీరు ఫేస్ మాస్క్, సీరం, లిప్ బామ్, బాడీ లోషన్, ఫౌండేషన్, కాజల్, మస్కారా మరియు ఐలైనర్ వంటి సౌందర్య సాధనాలను ఉంచుకోవచ్చు.
OTT సబ్‌స్క్రిప్షన్ : ఈ రోజుల్లో ప్రతిఒక్కరూ OTT ప్లాట్‌ఫామ్‌లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లను చూడటానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి మీరు మీ సోదరికి నచ్చిన ఓటీటీ సేవలకు సబ్‌స్క్రిప్షన్‌ను బహుమతిగా అందించవచ్చు.

