అక్కడ మనుషులు, చిరుత పులులు జిగిరీ దోస్తులు!
- రాజస్థాన్ లోని బేరా గ్రామస్తులతో పులుల సాన్నిహిత్యం! - పెంపుడు జంతువుల మాదిరి కలిసి తిరుగుతున్న వైనం!

Published : January 5, 2026 at 2:16 PM IST
Leopard village in india : స్నేహానికి మొదటి, ఇంకా ఆఖరి మెట్టు నమ్మకం! ఇది ఎంత బలంగా ఉంటే ఆ బంధం అంత రాక్ సాలిడ్‌గా ఉంటుంది. మనుషులు, పెంపుడు జంతువుల మధ్య ఈ ఫ్రెండ్షిప్ ఉంటే పెద్దగా వింతేమీ లేదు. కానీ, పులికి-మనుషులకు మధ్య ఉంటే మాత్రం కచ్చితంగా అది చిత్రమే! ఆ విచిత్రానికి వేదికైంది ఓ గ్రామం! అక్కడ ఒకరిద్దరు కాదు, ఊరు ఊరంతా చిరుతలతో దోస్తీ కట్టారు. మరి, నిప్పు-నీరుకు మధ్య దోస్తానా ఎలా కుదిరింది? ఇంతకీ ఈ చోద్యం ఎక్కడ??
పులి ఎదురుగా కనపడిందంటే పై ప్రాణాలు పైన్నే పోతాయి! అంతగా మనం హడలెత్తిపోతాం. కానీ, రాజస్థాన్ రాష్ట్రంలోని పాలీ జిల్లా బేరా గ్రామస్తులు మాత్రం ఓ పిల్లిని, ఓ కుక్కను చూసినట్టుగానే చూస్తూ వెళ్లిపోతుంటారు. చిరుత పులులు కూడా అక్కడ ఓ సాధారణ జంతువులాగానే తిరిగేస్తుంటాయి. ఇటు మనుషులు, అటు పులులు ఇద్దరిలోనూ ఎలాంటి బెరుకూ కనిపించదు. ఎవరి పనుల్లో వారుంటారు!

బేరా ఒక గిరిజన గ్రామం. సుమారు 2 వేలకు పైగా కుటుంబాలు ఇక్కడ నివసిస్తుంటాయి. వీరు "రబారీ" తెగకు చెందిన వారు. పశువుల పెంపకమే ఈ తెగ ప్రధాన వృత్తి. వీరి పూర్వీకులు వందల ఏళ్ల క్రితం ఇరాన్ నుంచి వలస వచ్చారని చెబుతారు. మనం కొన్ని జంతువులను దైవంగా భావించేట్టుగానే.. వీరు చిరుత పులిని కొలుస్తారు. తమను రక్షించే దేవుళ్లుగా దాన్ని భావిస్తారు!
శివు, పార్వతి, విష్ణు :
ఇక్కడ మనుషులు, చిరుత పులి మధ్య సహవాసం ఈనాటిది కాదు. వందల ఏళ్ల క్రితం వీరి పూర్వీకుల నుంచే అలవాటైందట. పూర్వం మనుషులు కూడా అడవుల్లోనే ఉన్నారు కాబట్టి.. పులులు అక్కడి మనుషులకు అలవాటయ్యాయి. ఇప్పుడు గ్రామాలు వెలసినప్పటికీ అవి అలాగే ఉంటున్నాయి. ఎర్రటి తలపాగాతో ఉండే అక్కడి గిరిజనులను పులులు వెంటనే గుర్తుపడతాయట. వారు కూడా ఆ పులులకు శివుడు, పార్వతి, విష్ణు, లక్ష్మీ అంటూ ముద్దు పేర్లు పెట్టి పిలుస్తుంటారు!

దాడి చేయవా? :
చిరుత పులులు గ్రామంలోని పశువుల మీద పెద్దగా దాడి చేయవట. ఒకవేళ ఎప్పుడైనా గొర్రెలు, మేకల మీద దాడిచేసినా కూడా అక్కడి ప్రజలు దాన్ని సానుకూలంగానే చూస్తారట. ఎందుకంటే దైవంగా భావించే పులికి ఆహారం ఇవ్వడమనేది తమ బాధ్యతగా భావిస్తారు. ఇక, వాటికి ఇబ్బంది కలిగించే పనులు ఏవీ చేయరు అక్కడి ప్రజలు. పులులు భయపడతాయనే ఉద్దేశ్యంతో కనీసం టపాసులు కూడా కాల్చరు!
పులులకు భరోసా :
ప్రస్తుతం ఆ గ్రామ సమీపంలోని అడవుల్లో కనీసం 100 వరకు చిరుతలు ఉంటాయని అంచనా. అవి పుట్టినప్పటి నుంచీ అక్కడి వాతావరణానికి అలవాటై ఉండడం వల్ల గ్రామంలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అక్కడి జనం వాటితో వ్యవహరించే విధానం వల్ల వారిపై ఎన్నడూ పులులు దాడి చేయలేదట. అలాంటి ఘటన ఇప్పటి వరకూ ఒక్కటి కూడా చోటు చేసుకోలేదని ఆ గిరిజనులు చెబుతారు.

టూరిస్టులు :
ఈ గ్రామం గురించి తెలుసుకున్న టూరిస్టులు అక్కడికి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తుంటారు. పులులను దగ్గర్నుంచి చూడాలనుకునే వారితోపాటు వైల్డ్ లైఫ్ ఫొటో గ్రాఫర్లు కూడా బేరా గ్రామంలో వాలిపోతుంటారు. టూరిస్టులు పెరగడంతో అక్కడ రిసార్టులు కూడా వెలిశాయి. రాత్రిపూట స్టే చేసే అవకాశం కూడా ఉంది. చిరుతలతో దోస్తీ చేసే అక్కడి వారిని, ఆ ఊరిని చూసేందుకు ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చిపోతుంటారు. అవకాశం ఉంటే మీరు కూడా ఓసారి వెళ్లిరండి.
వందల ఏళ్లుగా రబారీ గిరిజనులు చిరుత పులులతో మమేకమయ్యారు. అవి కూడా వారితో కలిసిపోయాయి. పెంపుడు జంతువుల మాదిరిగానే గ్రామంలో తిరుగుతుంటాయి. పులులను అక్కడి ప్రజలు దైవంగా భావిస్తారు. ఇప్పటి వరకు ఒక్క పులి కూడా అక్కడి మనుషులపై దాడి చేసిన చరిత్ర లేదు. మేకలు, గొర్రెలపై దాడి చేస్తే.. వాటికి ఆహారం ఇస్తున్నామని, అది తమ బాధ్యత అని అక్కడి జనం అనుకుంటారు. గిరిజనులు నెత్తిపై ధరించే తలపాగాను చూసి పులులు వారిని గుర్తిస్తాయి. అక్కడి ప్రజలు వాటికి ముద్దు పేర్లు కూడా పెట్టి పిలుస్తుంటారు.
- దిలీప్ అరోరా, వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్, రాజస్థాన్

