వీకెండ్ స్పెషల్ "పటియాలా చికెన్ కర్రీ" - ఇలా చేస్తే ఇంటిల్లిపాదీ రుచికి ఫిదా!
పంజాబీ స్టైల్ చికెన్ కర్రీ - అన్నం, పులావ్, చపాతీల్లోకి సూపర్ కాంబో!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 21, 2026 at 10:23 AM IST
Chicken Patiala Curry Making : వీకెండ్ అనగానే చాలా ఇండ్లలో నాన్‌వెజ్ తప్పక ఉండాల్సిందే! ఇందులోనూ ముఖ్యంగా చికెన్‌తో వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. ఓసారి ఇలా ఇంట్లో కొత్తగా పంజాబీ స్టైల్ పటియాలా చికెన్ కర్రీ చేశారంటే అద్దిరిపోతుంది. ఇది వేడివేడి అన్నంతో పాటు పులావ్, చపాతీ, నాన్, రోటీల్లోకి సూపర్ కాంబినేషన్. మరి ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు ఓ లుక్కేయండి.
పాలకూరతో ఇలా ట్రై చేయండి - తక్కువ రైస్, ఎక్కువ కర్రీ తినేయొచ్చు!

కావాల్సిన పదార్థాలు :
- చికెన్ - అర కిలో (500 గ్రాములు)
- వెల్లుల్లి రెబ్బలు - 12
- పచ్చిమిర్చి - 7
- కారం - 2 టేబుల్ స్పూన్లు
- ధనియాల పొడి - 1 టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- ఆయిల్ - తగినంత
- దాల్చినచెక్క - 1
- యాలకులు - 2
- బిర్యానీ ఆకు - 1
- లవంగాలు - 5
- మిరియాలు - అర టీ స్పూన్
- జీలకర్ర పొడి - 1 టీ స్పూన్
- ఉల్లిపాయలు - 2
- టమోటాలు - 3
- పెరుగు - ఒక కప్పు
- కసూరిమెంతి - 1 టేబుల్ స్పూన్
- నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - అర టీ స్పూన్
- అల్లంవెల్లుల్లి ముక్కలు - 2 టీ స్పూన్లు
- క్యాప్సికం - 1
- కాజు - 3 టేబుల్ స్పూన్
- బటర్ - 1 టేబుల్ స్పూన్
- ఫ్రెష్ క్రీమ్ - 2 టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా రెండు ఉల్లిపాయలు, మూడు టమోటాలను తరిగి ఉంచాలి. అలాగే మిక్సీజార్‌లో కొద్దిగా అల్లం ముక్కలు, 12 వెల్లుల్లి రెబ్బలు, ఐదు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టాలి. ఇదే మిక్సీజార్‌లో మూడు టేబుల్ స్పూన్ల కాజు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి.
- ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో అర కిలో చికెన్, గ్రైండ్ చేసుకున్న అల్లంపచ్చిమిర్చి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం వేయాలి. అదేవిధంగా ఒక టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల నూనె యాడ్ చేసి కలపాలి. ఆ తర్వాత మూతపెట్టి గంట సేపు పక్కనుంచాలి.

- అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయిలో పావు కప్పు నూనె, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. ఇవి వేడైన తర్వాత ఒక దాల్చినచెక్క, రెండు యాలకులు, ఒక బిర్యానీ ఆకు, ఐదు లవంగాలు, అర టీ స్పూన్ మిరియాలు వేసి వేయించాలి.
- మసాలా దినుసులు వేగాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి వేగనివ్వాలి. అలాగే తరిగి ఉంచిన టమోటా ముక్కలు వేసి కలిపి మూతపెట్టాలి.

- టమోటా ముక్కలు మగ్గాక చికెన్ మిశ్రమాన్ని వేయాలి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
- ఈ మిశ్రమం వేగాక పావు కప్పు నీళ్లు పోసి మిక్స్ చేయాలి. అలాగే ఒక కప్పు పెరుగు వేసి కలపాలి. ఆ తర్వాత మూతపెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి 12 నిమిషాల పాటు ఉడికించాలి.
- చికెన్ మిశ్రమం ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కసూరిమెంతి, ఒకటిన్నర కప్పుల వేడి నీళ్లు పోసి మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి ఉడకనివ్వాలి.
- మరోవైపు స్టవ్ ఆన్ చేసి పాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనె, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఇవి వేడైన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. అదేవిధంగా రెండు టీ స్పూన్ల అల్లంవెల్లుల్లి ముక్కలు, తరిగి ఉంచిన పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసి వేగనివ్వాలి.
- అల్లంపచ్చిమిర్చి ఫ్రై అయ్యాక తరిగి ఉంచిన ఉల్లి, క్యాప్సికం ముక్కలు యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఇందులోనే గ్రైండ్ చేసుకున్న కాజు పేస్ట్, అర కప్పు వేడి నీళ్లు పోసి కలపాలి.

- ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చికెన్‌లో వేసి ఒక నిమిషం పాటు మిక్స్ చేయాలి. చివరన ఒక టేబుల్ స్పూన్ బటర్, రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అంతే పంజాబీ స్టైల్ ఘుమఘుమలాడే పటియాలా చికెన్ కర్రీ మీ ముందుంటుంది!
టేస్టీ, యమ్మీ "దలియా" - ఈ స్వీట్‌తో ప్రతీ వేడుక సంతోషంగా జరుపుకోండి!
వారెవ్వా అనిపించే "వామాకు పచ్చడి" - ఎన్నడూ తినని సరికొత్త రుచిని ఆస్వాదిస్తారు!

