ETV Bharat / offbeat

అక్కడ నడిచింది పులినా, సింహమా? - జంతువుల 'పాదముద్రలను' ఇలా ఈజీగా గుర్తుపట్టొచ్చు!

పాదముద్రలతో ఏ 'జంతువో' సింపుల్​గా చెప్పేయొచ్చు! - వేటి అడుగులు ఎలా ఉంటాయో తెలుసా?

Animals Pug Marks Identification
Animals Pug Marks Identification (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 15, 2026 at 11:10 AM IST

3 Min Read
Choose ETV Bharat

Animals Pug Marks Identification : మనుషుల వేలిముద్రలు ఎలా కచ్చితమైన సమాచారాన్ని స్తాయో, అడవుల్లో వన్యప్రాణుల పాదముద్రలు(పగ్ మార్క్స్) వాటి ఉనికిని స్పష్టంగా బయటపెడతాయి. పాదముద్ర వెడల్పు, గోళ్ల ఆకారం, మట్టిపై పడిన ఒత్తిడి ఇలా ప్రతి చిన్న కొలతలోనూ ఆ జంతువు గుట్టు దాగి ఉంటుంది. అసలు అక్కడ నడిచింది సింహమా, పెద్దపులా, చిరుతా? ఆ జంతువు ఆడదా, మగదా? అన్నది ఈజీగా అంచనా వేయొచ్చంటున్నారు తిరుపతికి చెందిన వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ ఎస్సీవీ రమణ నాయక్. నిశ్శబ్ద అరణ్యంలో వన్యప్రాణుల పాదముద్రలు చెప్పే విశేషాలేంటి? కేవలం అడుగులే కాకుండా అటవీ ప్రాంతంలో జంతువుల ఉనికిని పసిగట్టే ఇతర ఆధారాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Animals Pug Marks
Lion (Getty Images)

సింహం :

  • ఫెలిడే కుటుంబానికి చెందిన సింహం అడుగుల పరిమాణంలో మగ, ఆడ మధ్య సుమారు 1.5 సెం. మీ. మేర స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుందని చెబుతున్నారు వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ ఎస్సీవీ రమణ నాయక్.
  • మగ సింహం ముందు పాదం పొడవు సుమారు 14.5 సెం.మీ. ఉంటుంది. శరీరం బరువు ఎక్కువగా ఉండటం వల్ల దీని అడుగు నేలపై లోతుగా, వెడల్పుగా పడుతుంది. ఆడ సింహం పాదం పొడవు సుమారు 13 సెం. మీ. ఉంటుందని చెబుతున్నారు.
Animals Pug Marks
Tiger (Getty Images)

చిరుత పులి :

  • మగ చిరుత పాదముద్రలు పెద్దవిగా, వెడల్పుగా ఉండి, మందపాటి కాలివేళ్లతో ఉంటాయి. వెనుక పాదం అడుగుభాగం గుండ్రంగా, సగటున 9 సెం.మీ. పొడవు ఉంటుందంటున్నారు.
  • ఆడ చిరుత పాదముద్రలు చిన్నగా, సన్నగా ఉండి నాజూకైన కాలివేళ్లతో ఉంటాయని చెబుతున్నారు. వెనుక పాదం పొడవు సగటున 8 సెం. మీ. ఉండి, ముద్ర కొద్దిగా కోణీయంగా కనిపిస్తుందంటున్నారు.

ఎలుగుబంటి :

  • ఈ జంతువు అడుగుజాడలు మిగతా వన్యప్రాణులతో పోలిస్తే డిఫరెంట్​గా ఉంటాయి. నేలపై పడిన ఎలుగుబంటి పాదముద్ర అచ్చం మనిషి చెప్పుల ముద్రను పోలి ఉంటుందంటున్నారు వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ రమణ నాయక్.
  • దీని పాదం పొడవు వచ్చేసి సుమారు 15 నుంచి 18 సెం.మీ. (6-7 అంగుళాలు) వరకు ఉంటుందని చెబుతున్నారు.

నక్క :

  • ఆడ నక్కల కంటే మగ నక్కలు కొంచెం పెద్దవిగా ఉంటాయి. కానీ, వీటి పాదాల పరిమాణం విషయానికొచ్చేసరికీ తేడాలు తక్కువగా, అస్పష్టంగా ఉంటాయని చెబుతున్నారు.
  • నార్మల్​గా నక్కల పాదముద్రలు 1.5 నుంచి 2 అంగుళాల వెడల్పు, 2 నుంచి 2.5 అంగుళాల పొడవు ఉంటాయి.
Animals Pug Marks
Animal (Getty Images)

పెద్దపులి, చిరుతలను వేటాడితేనే కాదు - అడవుల్లో ఈ 'పనులు' చేసినా జైలు శిక్ష, జరిమానాలు!

తోడేలు :

  • కానిడే కుటుంబానికి చెందిన తోడేళ్లలో మగవాటి అడుగులు స్పష్టంగా, లోతుగా ఉంటాయి. పొడవు, వెడల్పుల నిష్పత్తి వచ్చేసి 1 : 3గా ఉంటుంది.
  • ఆడ తోడేలు పాదం సన్నగా ఉంటుంది. పొడవు, వెడల్పుల నిష్పత్తి వచ్చేసి సుమారు 1 : 5గా ఉంటుంది.
  • కేవలం ఒకే ఒక్క ముద్రను చూసి తోడేలు ఆడదా, మగదా అని చెప్పడం కష్టమంటున్నారు. పక్కపక్కన అనేక ముద్రలు ఉంటేనే పోల్చడం సాధ్యమవుతుందంటున్నారు.
Animals Pug Marks
Pug Mark (Getty Images)

దుమ్ములగొండి (హైనా) :

  • హైనిడే కుటుంబానికి చెందిన ఈ జంతువుల్లో ఒక విచిత్రమైన తేడా కనిపిస్తుంది. మిగతా క్రూర జంతువులకు భిన్నంగా, హైనాల్లో ఆడవి మగవాటికంటే సుమారు 10 శాతం పెద్దవిగా ఉంటాయంటున్నారు వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ రమణ నాయక్.
  • ఆడ హైనాల పాద ముద్రలే స్వల్పంగా పెద్దవిగా ఉంటాయి. నేల స్వభావం, నడిచే వేగం ఆధారంగా ఈ కొలతల్లో స్వల్ప మార్పులుంటాయని చెబుతున్నారు.

అడవి పంది :

  • సుయిడే కుటుంబానికి చెందిన అడవి పందుల గిట్టల ఆకారం ప్రత్యేకమైంది. గిట్టలు గుండ్రంగా, ముందరి భాగం మొండిగా(బ్లంట్ టోస్) ఉంటుంది.
  • మగ పంది పాదం పెద్దదిగా ఉండి, పొడవు, వెడల్పులు సుమారు 8 సెం.మీ. లేదా అంతకంటే ఎక్కువ ఉంటాయంటున్నారు. ఆడ పంది పాదం చిన్నదిగా ఉండి, ముద్ర 5 నుంచి 7 సెం. మీ. వరకు ఉంటుంది.
  • ఇవి మృదువైన నేలపై నడిచినప్పుడు వెనక గిట్టల గుర్తులు పడతాయని చెబుతున్నారు.
Animals Pug Marks
Animals (Getty Images)

అడవి కుక్క(రేచు కుక్క/ధోల్) :

  • మగ, ఆడ అడవి కుక్కల పాదముద్రల ఆకారంలో పెద్ద వ్యత్యాసాలు ఉండవంటున్నారు.
  • శరీర పరిమాణంలో మగవి పెద్దవిగా ఉండటంతో వీటి అడుగులు ఆడవాటి కంటే కొంచెం వెడల్పుగా పడతాయి.
  • వీటి ముందు పాదం పొడవు 6 సెం. మీ కంటే ఎక్కువే ఉంటుంది.

వీటి ద్వారా వన్యప్రాణుల ఉనికి తెలుసుకోవచ్చు!

  • చిరుతలు, పులులు తమ ఉనికిని చాటుకోవడానికి చెట్ల మొదళ్లు, బెరడుపై గోళ్లతో గీతలు పెడుతుంటాయి.
  • అడవుల్లో ఎలుగుబంట్లు, అడవి పందులు చెదపురుగుల కోసం పుట్టలను తవ్వడం, కీటకాలు లేదా దుంపల కోసం నేలను తవ్విన గుర్తులు కనిపిస్తుంటాయి.
  • వన్యప్రాణులు తమ మూత్రం ద్వారా టెరిటోరియల్ మార్కింగ్ చేసుకుంటాయి. ఈ వాసన ద్వారా కూడా వన్యప్రాణుల ఉనికిని గుర్తించవచ్చంటున్నారు వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ ఎస్సీవీ రమణ నాయక్.

'గొంతు విప్పకుండానే కిలోమీటర్ల దూరం ముచ్చటిస్తాయి' - వీటికి మేధాశక్తి ఎక్కువే!

'ఎవరెస్ట్​'కి మించిన పర్వతాలు - ఎక్కడున్నాయి? ఎలా గుర్తించారంటే!