"కారం పొడులు" మీకు ఇష్టమా? - ఇలాంటి "పుదీనా కారం పొడి" సింపుల్‌గా చేసేయండి!
నోటికి రుచినిచ్చే పుదీనా కారం పొడి - అప్పటికప్పుడు ఇలా ట్రై చేయండి

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 12, 2026 at 10:10 AM IST
PUDINA KARAM PODI : కారం పొడులంటే మీకు ఇష్టమా? అయితే, ఓ సారి పుదీనా కారం పొడి చేసిపెట్టుకోండి. ఇడ్లీ, దోసెల్లాంటి టిఫిన్లతో పాటు వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటుంటే అద్భుతంగా ఉంటుంది. ఈ పొడి తయారీ చాలా సింపుల్ ఎక్కువ నూనె అవసరం లేకుండా హెల్దీగా తయారు చేసుకోవచ్చు. నోటికి రుచిగా ఏదైనా తినాలనుకున్నపుడు ఈ పొడితో తింటే చాలా బాగుంటుంది.
ఇడ్లీ, దోసె ఏదైనా సరే - అద్దిరిపోయే "పల్లీ, టమోటా చట్నీ"!
కావల్సిన పదార్థాలు :
- పుదీనా - 3 పెద్ద కట్టలు
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- ఎండు మిర్చి - 25
- మినప్పప్పు - పావు కప్పు
- పచ్చి శనగపప్పు - పావు కప్పు
- ధనియాలు - ముప్పావు కప్పు
- జీలకర్ర - 1 స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- వెలుల్లి పాయలు - 6

తయారీ విధానం :
- పుదీనా 3 పెద్ద కట్టలు తీసుకుని ఆకులు తుంచి పెట్టుకోవాలి. మొత్తం 3 కప్పుల పుదీనా నీళ్లలో కడిగి శుభ్రం చేసుకోవాలి. మిగతా పదార్థాలు కప్పు కొలతతో తీసుకుంటాం కాబట్టి పుదీనా కూడా కప్పు కొలతతో తీసుకోవాలి. ఆ తర్వాత తడి లేకుండా క్లాత్‌పై ఫ్యాన్ గాలికి లేదా గంట సేపు ఎండలో ఆరబెట్టుకోవాలి.

- ఇపుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. కారానికి సరిపడా ఎండు మిర్చి వేసుకుని వేయించాలి. మిర్చి కాస్త రంగు మారే వరకు వేయించి పక్కకు తీసుకోవాలి. మళ్లీ అదే నూనెలో పావు కప్పు మినప్పప్పు, పావు కప్పు పచ్చి శనగపప్పు వేసుకుని ఫ్రై చేయాలి. ఆ తర్వాత ముప్పావు కప్పు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించాలి. రంగు మారే వరకు సన్నటి మంటపై వేయించి పక్కకు తీసుకోవాలి.

- ఇపుడు అదే ప్యాన్‌లోకి కొద్దిగా నూనె వేసుకుని శుభ్రం చేసుకున్న పుదీనా వేసుకుని వేయించాలి. పుదీనాకాస్త క్రిస్పీగా వేగే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి. ఇపుడు పదార్థాలన్నింటినీ చల్లార్చుకుని తీసుకోవాలి. ముందుగా ఎండుమిర్చి మిక్సీలోకి తీసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత వేయించిన పప్పులు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇపుడు వేయించి చల్లార్చిన పుదీనా వేసుకుని గ్రైండ్ చేయాలి.

- పదార్థాలన్నీ ఒకేసారి కాకుండా ఇక్కడ ఇచ్చిన విధంగా గ్రైండ్ చేయాలి. చివరగా వెలుల్లి పాయలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుంటే చాలు! ఇప్పటికే కిచెన్ అంతా ఘుమఘుమలాడుతుంది. ఈ కారం పొడి గాజు సీసాలో నిల్వ చేసుకుంటే నెల రోజులైనా మంచి వాసన ఉంటుంది. ఇడ్లీ, దోసెల్లాంటి టిఫిన్లతో పాటు వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది.
కరకరలాడే క్యాటరింగ్ స్టైల్ చిక్కుడు కాయ ఫ్రై - అన్నం, రోటీల్లోకి అద్భుతం!
కారంగా, కమ్మగా "ఎండు మిర్చి నిల్వ పచ్చడి" - చింతపండు, ఉప్పు, నూనె పక్కా కొలతలివే!

