మొక్కలను ఒక కుండీ నుంచి ఇంకో దానికి మారుస్తున్నారా? - ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే బతకడం కష్టమట!
-మొక్కలు ఏపుగా పెరిగాయని కుండీలు మారుస్తున్నారా? - అయితే ఇలా మొక్కలను కుండీలు మార్చే క్రమంలో కొన్ని విషయాలు తెలుసుకోవాలని నిపుణుల సూచన!

Published : July 8, 2026 at 4:32 PM IST
Precautions to Take While Changing Plants from One Pot to Another: ఖాళీ స్థలంతో సంబంధం లేకుండా కుండీల్లో మొక్కల్ని పెంచుకోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. అయితే కొన్ని మొక్కలు పెరిగే కొద్దీ.. వాటి వేర్లు విస్తరిస్తుంటాయి. దీంతో చాలా మంది కుండీలో నుంచి మొక్కను తీసి మరో కొత్త కుండీలోకి మార్చుతుంటారు. అయితే ఈ క్రమంలో తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పుల వల్ల మొక్కల ఆరోగ్యం దెబ్బతింటుందంటున్నారు నిపుణులు. అందుకే మొక్కలను కుండీలు మార్చే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమంటున్నారు. మరి అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
సైజు ముఖ్యం: ప్రస్తుతం ఉన్న కుండీ నుంచి కొత్త కుండీలోకి మొక్కల్ని మార్చేటప్పుడు చాలా మంది కాస్త పెద్ద సైజు కుండీనే ఎంచుకుంటుంటారు. కానీ ఇది సరైంది కాదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకుంటే పెద్ద కుండీల వల్ల మొక్కలకు అవసరానికి మించి నీళ్లు అంది, కుళ్లిపోయే అవకాశం ఉంటుందంటున్నారు. ఈ క్రమంలోనే కొత్త కుండీ సైజు మరీ పెద్దగా కాకుండా.. ఇప్పుడున్న సైజు కంటే ఒక అంకె ఎక్కువగా ఉన్నది తీసుకుంటే సరిపోతుందని సూచిస్తున్నారు.
మట్టిలోనూ తేడాలొద్దు: మొక్కల్ని ఒక కుండీ నుంచి మరో కుండీలోకి మార్చేటప్పుడు అందులో నింపే మట్టి విషయంలోనూ జాగ్రత్తపడడం మంచిదంటున్నారు నిపుణులు. అంతకుముందు మొక్క పెరిగిన మట్టి మిశ్రమం లాంటిదే కొత్త కుండీలోనూ వేయమంటున్నారు. దీనివల్ల మొక్కకు అందే పోషకాల విషయంలో లోపం లేకుండా ఉంటుందని చెబుతున్నారు.
కొన్ని మొక్కలకు రోజంతా నీటి అవసరం ఉంటుంది. మరికొన్ని మొక్కలేమో పొడి మట్టిలోనూ ఏపుగా పెరుగుతాయి. కాబట్టి ఆయా మొక్కల అవసరాల్ని బట్టి తేమను నిలిపి ఉంచేలా లేదంటే కాసేపటికే పొడిగా మారే తత్వం ఉన్న మట్టిని ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు. అప్పుడే కుండీ మార్చినా మొక్క ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్తపడచ్చని చెబుతున్నారు.
అనువైన కాలంలో: ఆయా కాలాలతో సంబంధం లేకుండా మొక్కల్ని ఒక కుండీలో నుంచి మరో కుండీలోకి మార్చుతుంటారు కొంతమంది. అయితే ఎప్పుడు పడితే అప్పుడు వీటిని ఒక కుండీలో నుంచి మరో కుండీలోకి మార్చడం వల్ల వాటి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఆయా మొక్కల్ని నాటేటప్పుడు లేదా పాత వాటిని మరో కుండీలోకి మార్చేటప్పుడు అనువైన కాలాన్ని కూడా సరిచూసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
వేర్లు జాగ్రత్త: జనరల్‌గా ఒక కుండీలోని మొక్కల్ని మరో కుండీలోకి మార్చలనుకున్నప్పుడు మొక్కతో పాటు కొంతవరకున్న వేర్లను మాత్రమే తీసుకుంటుంటారు కొందరు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. మొక్కల్ని పాత కుండీ నుంచి వేరు చేసినా.. తిరిగి నాటేటప్పుడు పూర్తి వేర్లతో తీసుకోవడం, అవి డ్యామేజ్ కాకుండా తిరిగి మట్టిలో కూర్చడం ముఖ్యమంటున్నారు. అప్పుడే అవి ఆరోగ్యంగా ఎదగగలవని చెబుతున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ఇలా తిరిగి నాటే క్రమంలో కుళ్లిపోయిన వేర్లు ఏమైనా ఉంటే ముందే కట్ చేయడం మంచిదని చెబుతున్నారు.
నీళ్లు ఎక్కువ వద్దు: మొక్కను కొత్త కుండీలో తిరిగి నాటినాక ఎక్కువ మొత్తంలో నీళ్లు పోస్తేనే అది ఎప్పటిలాగా ఎదుగుతుందని కొందరు అనుకుంటుంటారు. కానీ ఇదీ పొరపాటే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే నాటిన వెంటనే మొక్కకు నీళ్లు పోసి.. రెండు మూడు రోజుల పాటు అలా వదిలేయడం మంచిదంటున్నారు. లేదంటే కొన్ని నీళ్లు అలా పైపైన చల్లడం వల్ల మొక్క మట్టిలో అడ్జస్ట్ అవుతుందని చెబుతున్నారు. ఈ రెండు పద్ధతులు కాకుండా ముందే ఎక్కువ నీళ్లు పెడితే వాటి వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే మొక్కకు అవసరమైనంత మేరకే నీళ్లు పోయాలంటున్నారు. ఇలా పోసిన నీళ్లు మట్టిలో నిల్వ ఉండకుండా కుండీ అడుగున రంధ్రం ఉందో లేదో చూసుకోవడమూ మర్చిపోకూడదని చెబుతున్నారు నిపుణులు.
ఎండల్లోనూ మంచి దిగుబడినిచ్చే "మొక్కలు" ఇవే - ఇంటికి చల్లదనం కూడా!
ఇంట్లో కాలుష్యం తగ్గించే మొక్కలు ఇవే - మరి ఈ మొక్కల లాభాలు ఏంటో తెలుసా!

