పెళ్లి చూపుల్లోనే ఈ విషయాలు మాట్లాడుకుంటే బెటర్ - 'ప్రీనప్' అగ్రిమెంట్ తెలుసా?
పెళ్లికి ముందే 'ఉభయకుశలోపరి' ఒప్పందం - ఆ తర్వాత తేడాలొచ్చినా ఇబ్బంది లేదు!

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 26, 2026 at 11:58 AM IST
Prenuptial Agreement : పెళ్లి చూపులు వధూవరుల ముఖపరిచయంతో పాటు ఇరు కుటుంబాల పరస్పర అవగాహన కోసం ఏర్పాటు చేసేవి. ఒకరి అభిప్రాయాలను మరొకరితో పంచుకోవడమే వీటి ప్రధాన ఉద్దేశం. వధూవరులు ఒకరినొకరు ఇష్టపడితే చాలు! ఇరు కుటుంబాలు కట్న, కానుకలు మాట్లాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ, నేటి తరం పెళ్లికి ముందే 'ప్రీనప్' అగ్రిమెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు. '‘నేను ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నాను. నీకేమైనా ఎఫ్‌డీలు ఉన్నాయా? ‘నా ఈఎమ్‌ఐ నాది, నీ లోన్ ఈఎమ్‌ఐ నీది!' అని ముందుగానే లెక్కలు మాట్లాడుకుంటున్నారు. పెళ్లికి ముందే ఇలాంటి ఒప్పందాలు ఆహ్వానించదగిన పరిణామమే అని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, వీటికి చట్టబద్ధత ఉందా?
ఒకప్పుడు పెళ్లి చూపుల్లో 'అబ్బాయి జాబ్ చేస్తున్నాడా? సొంత ఇల్లు ఉందా?, అమ్మాయికి వంట వచ్చా?' అని అడిగేవారు. ఈ డిజిటల్ యుగంలో పెళ్లి చూపులు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పెళ్లికి ముందే విడాకుల ఒప్పందాలపైనా చర్చ జరుగుతోంది. ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో, ఆయన ప్రియురాలు జార్జినా రోడ్రిగ్జ్ వివాహానికి ముందు ఇరువురి మధ్య కుదిరిన ప్రత్యేక ప్రీనప్షియల్ ఒప్పందం (Prenuptial Agreement) చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక సెలెబ్రిటీ జంట తీసుకున్న నిర్ణయంగా చూడకుండా నేటి మహిళలు ముఖ్యంగా వివాహ వ్యవస్థలో ఆర్థికంగా ఎలా చైతన్యవంతం అవ్వాలో చెప్పే పాఠంగా పరిగణించాలి.

ఫోన్ కింద పడేసే వారిలో మహిళలే ఎక్కువ! - సర్వేలో మొబైల్ వాడకంపై కీలక విషయాలు!
మరి సాధ్యమేనా?
మన పెద్దవాళ్లు 'పెళ్లంటే పవిత్ర బంధం, నూరేళ్ల పంట' అంటుంటారు. అలాంటి పెళ్లి చూపుల సమయంలోనే ఇలాంటి ప్రీనప్షియల్ ఒప్పందాల గురించి మాట్లాడుకోవడం అంటే ఎలా? అనుకుంటున్నారా? రియాలిటీలోకి వస్తే ఈ రోజుల్లో యువత 'సెటిలయ్యాక పెళ్లి చేసుకుంటాం' అని పెళ్లిని వాయిదా వేస్తున్నారు. మంచి కెరియర్, సొంత ఫ్లాట్, కారు, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అన్నీ సంపాదించాకే అనడంతో ఆలస్యంగా వివాహాలు అవుతున్నాయి. ఈ క్రమంలోనే వివాహం తర్వాత 'నా కష్టార్జితంతో కొన్న ఫ్లాట్ నాదే! నేను దాచుకున్న బంగారంతో నీకేం పని?' అనే వాదనలు, ఆర్థిక వివాదాలు తరచూ వింటున్నాం. అందుకే, ప్రీనప్షియల్ ఒప్పందాలు అవసరమే అనే వారి సంఖ్య పెరుగుతోంది.
ఆత్మగౌరవానికి ప్రతీక
పెళ్లికి ముందే ఆర్థిక విషయాలపై స్పష్టత కలిగి ఉండటం అభద్రతా భావం కాదని, అది ఆత్మగౌరవాన్నీ, భద్రతనూ కాపాడుకునే తెలివైన మార్గం అని నిపుణులు చెప్తున్నారు. సహజంగా మహిళలు పెళ్లి తర్వాత తమ ఆర్థిక నిర్ణయాలను పూర్తిగా భాగస్వామికి వదిలేస్తుంటారు. కానీ, ఇద్దరూ ఉద్యోగులే అయినపుడు వ్యక్తిగత ఆర్థిక స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఎవరి సంపద వారి వద్ద సురక్షితంగా ఉంటూనే, ఉమ్మడి లక్ష్యాలు, కుటుంబ బాధ్యతల దిశగా అడుగులు వేయాలి.

భవిష్యత్తు భద్రతకు
జీవితంలో అనిశ్చితి ఎప్పుడూ ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకుని భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ముందే ప్లాన్ చేసుకోవాలి. బీమా, అత్యవసర నిధులు (ఎమర్జెన్సీ ఫండ్స్), వీలునామా వంటి అంశాలపై స్పష్టత ఉంటే వివాహ బంధంలో మనస్పర్థలు, వివాదాలు చాలా వరకు తగ్గిపోతాయి.
చట్టం అంగీకరిస్తుందా?
ప్రీనప్షియల్ ఒప్పందాలను మన చట్టాలు ఒప్పుకోవు. హిందూ వివాహచట్టంలో వీటి ప్రస్తావనే లేదు కానీ, జనరల్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఆర్థికాంశాల మీద ఒక ఒప్పందానికి వచ్చి ఇద్దరి సంతకాలతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చెల్లుతుంది.
స్త్రీల ఆర్థిక భద్రత కోసం ఎన్ని చట్టాలు చేసినా భార్య తరఫున వచ్చే కట్న, కానుకలు, బంగారంతో జీవించాలనుకునేవాళ్లు ఎంతో మంది ఉన్నారు. పెళ్లయ్యాక ఏదైనా తేడా వచ్చి విడిపోవాల్సి వస్తే ఇచ్చిన కట్నానికి సాక్ష్యాల్లేక, తిరిగి తీసుకున్న సందర్భాలూ తక్కువే. ఇలాంటివన్నీ కట్టడి చేయాలన్నా, విడాకుల కేసుల్లో ఆస్తుల పంపకాలు త్వరగా తేలాలన్నా ఈ ఆర్థిక ఒప్పందాల దిశగా ఆలోచించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

