హామీ లేకుండా "రూ.10 లక్షల ఎడ్యుకేషన్ లోన్" - విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం సూపర్ ఆఫర్!
-ఎలాంటి ఆస్తులు తనఖా పెట్టకుండా విద్యారుణం పొందాలా?- ఈ పూర్తి వివరాలు మీ కోసమే!

Published : May 6, 2026 at 12:26 PM IST
PM Vidyalaxmi Education Loan Scheme: ప్రతిభ ఉంటుంది.. నాణ్యమైన ఉన్నత విద్యాసంస్థల్లో చేరితే మరింత రాటుదేలవచ్చన్న ఆశ ఉంటుంది. కానీ పేదరికం, ఆర్థిక పరిస్థితులు ఆ ఆశను నిరాశగా మారుస్తాయి. జీవితంలో ఎదగాలన్న కోరికను మధ్యలోనే తుంచేస్తాయి. అయితే ఇలాంటి విద్యార్థుల కష్టాలు తీర్చేలా కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని తీసుకువచ్చింది. అదే పీఎం విద్యాలక్ష్మి పథకం. నాణ్యమైన ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు అవసరమైన ఆర్థిక సాయం అందించేందుకు ఈ పథకం సాయపడుతుంది. అసలు ఈ పథకం ఏంటి? ఇది విద్యార్థులకు ఎలా మేలు చేయబోతోంది? అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
PM విద్యాలక్ష్మి పథకం అంటే ఏమిటి?: పేదరికం కారణంగా చదువుకోలేని ప్రతి విద్యార్థికి ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రధాన మంత్రి విద్యాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. పై చదువుల కోసం ఈ స్కీమ్ కింద ప్రతి విద్యార్థికి సుమారు రూ.10 లక్షల వరకు రుణం అందిస్తారు. కొన్నిసార్లు ఈ రుణంపై గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది. లోన్ తీర్చడానికి 15 సంవత్సరాల సమయం ఉంటుంది.
పీఎం విద్యాలక్ష్మి పథకం ప్రత్యేకతలు:
- టాప్ 860 క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్లలో(QHEI) సీటు వచ్చిన విద్యార్థులకు ఎలాంటి పూచీకత్తు లేకుండానే లోన్ మంజూరు అవుతుంది.
- రూ.7.5 లక్షల వరకు లోన్ తీసుకుంటే 75% క్రెడిట్ గ్యారెంటీని ప్రభుత్వం ఇస్తుంది.
- కుటుంబ వార్షిక ఇన్కమ్ రూ.4.5 లక్షల వరకు ఉన్న విద్యార్థులకు వడ్డీలో 100% మినహాయింపు ఉంటుంది.
- ఫ్యామిలీ ఇన్కమ్ సంవత్సరానికి రూ.8 లక్షలు ఉంటే, రూ. 10 లక్షల లోన్ పై 3% వడ్డీ సబ్సిడీ రూపంలో లభిస్తుంది.
- రుణం తీర్చడానికి 15 సంవత్సరాల సమయం ఉంటుంది. కోర్సు పూర్తయిన తర్వాత ఒక సంవత్సరం వరకు వడ్డీలో మినహాయింపు ఉంటుంది.
- ఈ పథకంలో అమ్మాయిలకు ప్రాధాన్యత ఉంటుంది.
ఈ స్కీమ్‌కు ఎవరు అర్హులు?:
- భారతదేశంలోని టాప్ 860 QHEIలో సీటు సంపాదించిన విద్యార్థులు మాత్రమే ఈ పథకాని అర్హులు.
- విద్యార్థి గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 10వ తరగతి/ 12వ తరగతి పాసై ఉండాలి.
- మెరిట్ లేదా ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. మేనేజ్మెంట్ కోటాలో సీట్ పొందిన విద్యార్థులకు అవకాశం లేదు.
- ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులు కారు.
- విద్యార్థికి అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ఇంటిగ్రేటెడ్ కోర్సు ఏదైనా ఒక కోర్సుకు మాత్రమే తీసుకునే రుణానికి వడ్డీ రాయితీ లభిస్తుంది.
అప్లై చేయడానికి కావలసిన డాక్యుమెంట్లు:
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- నివాస ధృవీకరణ పత్రం
- 10వ తరగతి/ 12వ తరగతి మార్కుల జాబితా
- ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్ కార్డ్, ఫీజు వివరాలు
- ఆదాయ ధృవీకరణ పత్రం
ఈ స్కీమ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి:
- ముందుగా పీఎం విద్యాలక్ష్మి పోర్టల్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Student Login పై క్లిక్ చేసి, ఆపై "Create An Account"పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు Student Registration Form ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు, మొబైల్ నెంబర్, ఇ-మెయిల్ ఐడీ ఎంటకర్ చేయాలి.
- ఆ తర్వాత అక్కడ సూచనల ఆధారంగా పాస్వర్డ్ ఎంటర్ చేసి దానిని కన్ఫార్మ్ చేయాలి.
- అనంతరం క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి డిక్లరేషన్ బాక్స్‌లో టిక్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి.
- అప్పుడు మీ మొబైల్ నెంబర్, మెయిల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ రెండు ఓటీపీలను ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది.
- ఆ తర్వాత Login పై క్లిక్ చేసి User ID(మెయిల్), Password, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
- మరోసారి ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేస్తే PM Vidyalaxmi పేజీ ఓపెన్ అవుతుంది.
- ఆ హోమ్ పేజీలో "Apply for Education Loan"పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి Get OTPపై క్లిక్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి అప్లికేషన్ ఫారమ్‌లో మీ పర్సనల్ డిటైల్స్, ఎడ్యుకేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. ఏ బ్యాంకు నుంచి రుణం కావాలో ఆ వివరాలను ఎంటర్ చేసి ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
అప్లికేషన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?
- పీఎం విద్యాలక్ష్మి అధికారిక పోర్టల్‌లో మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
- "Track Loan Application"పై క్లిక్ చేయాలి.
- మీ లోన్ అప్లికేషన్ నెంబర్‌ను ఎంటర్ చేస్తే స్టేటస్ తెలుస్తుంది.
వడ్డీ రాయితీ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- పీఎం విద్యా లక్ష్మి స్కీమ్ కింద లోన్ వచ్చిన తర్వాత అధికారిక పోర్టల్‌లో యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
- Student Homepageలో "Apply for Interest Subvention"ను ఎంచుకోవాలి.
- "Claim Interest Subvention" ఆప్షన్‌పై క్లిక్ చేసి వివరాలు ఫిల్ చేయాలి.
- కావాల్సిన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేస్తే మెసేజ్ వస్తుంది.
ఎడ్యుకేషన్ లోన్ EMI భారం ఈజీగా తగ్గాలా? ఇలా చేయండి!
ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్ - బెస్ట్ బెనిఫిట్స్ ఇవే! - Education Loan

