ఈ పండు తింటే బాడీ స్ప్రే అవసరం లేదు! - శరీరమంతా సువాసన!
ఈ కొత్త పండ్లు గురించి తెలుసా? - స్నేక్ ఫ్రూట్, పియర్ మెలన్ సైతం ఇండియాలో సాగు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 22, 2026 at 10:18 AM IST
Special Fruits in Indonesia : రుచి, వాసన ఆ రెండింటి మధుర ఫలాల గురించి తెలిసిందే కానీ, తిన్న తర్వాత శరీర నుంచి పరిమళాలు వెదజల్లే పండు గురించి తెలుసా? కొన్ని రకాల పండ్లు దూరం నుంచే మంచి వాసనతో నోరూరిస్తుంటాయి. అలాంటిదే ఈ పెర్ఫ్యూమ్ పండు కూడా. తిన్న తర్వాత నోరు మాత్రమే కాదు! శరీరం, చెమట, శ్వాస కూడా సువాసనలతో నిండిపోతుంది. ఇంతకీ ఈ పండు ఎక్కడ పండుతుందో తెలుసా?

రాజ కుటుంబాలకే అవకాశం
"కెపెల్" అనే పేరున్న ఈ పండు ఇండోనేషియాలో లభిస్తుంది. సహజసిద్ధమైన బాడీ డియోడరంట్’గా పిలిచే ఈ పండును పూర్వం కేవలం రాజ కుటుంబాలకు మాత్రమే పరిమితం చేశారట. రాణులు, వారి కుంటుంబ సభ్యులకు మాత్రమే అవకాశం ఉండేదట. సపోటా మాదిరిగానే గోధుమ రంగులో, పచ్చటి గుజ్జుతో ఉండే ఈ పండు మామిడి, పుచ్చకాయ, కొబ్బరి రుచుల మేళవింపుతో ఉంటుంది. పండ్లు కొమ్మలకు కాకుండా నేరుగా కాండానికే గుత్తులుగా కాయడం విశేషం.
ఆరోగ్యానికీ మేలు!
సువాసన మాత్రమే కాదు! ఎ, సి విటమిన్లు అధికంగా ఉంటాయి. పైగా మూత్ర సంబంధ సమస్యల్ని తగ్గించడంలో, శరీరంలోని వ్యర్థాల్ని తొలగించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మూత్రపిండాల ఆరోగ్యానికీ మేలు చేయడంతో పాటు రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తుందట. ఇప్పుడిప్పుడే ఈ పండు దేశంతో పాటు ఏపీ, తెలంగాణల్లోనూ సాగుచేస్తున్నారు.
సముద్రగర్భంలో కనుగొన్న కొత్త జంతువులు - ఆస్ట్రేలియా తీరంలో కనిపించిన "ఘోస్ట్ షార్క్"

తీపి దోసకాయ
ప్రకృతి ప్రేమికులు బెర్రీల్లాంటి పండ్ల మొక్కలను మిద్దె తోటల్లో, బాల్కనీల్లో పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో అరుదైన, విదేశీ మొక్కలపై ఆసక్తి చూపుతుంటారు. ఇలాంటి వాటిల్లో "పెపినో మెలన్" అనే మొక్క ఒకటి. విదేశాలకు చెందిన ఈ మొక్క కుండీల్లోనూ సులువుగా పెరుగుతుంది. దీని రుచి దోసకాయ మాదిరిగానే తియ్యగా ఉంటుంది. అందుకే ఈ పండుని "స్వీట్ కుకుంబర్, పియర్ మెలన్" అనీ అంటారు. చూడముచ్చటగా గుండ్రంగా, పసుపుపచ్చ రంగు మీద ఊదా గీతలతో కనిపిస్తుంది. జ్యూసీజ్యూసీగా తీపి రుచిలో నోరూరిస్తుంది. ఈ పండులో నీటి శాతం ఎక్కువే కావడం వల్ల వేసవిలో శరీరం డీహైడ్రేట్ అవకుండా ఉంటుంది. ఎ,బి,సి,కె విటమిన్లతోపాటు ఇందులోని పొటాషియం అధిక బీపీని నియంత్రించడంలో చక్కటి పాత్ర పోషిస్తుంది. ఈ పండు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ, నిగారింపునూ పెంచుతుందని పెంపకందారులు వెల్లడిస్తున్నారు.

స్నేక్ ఫ్రూట్
ఈ పండు పాము మాదిరిగా ఎరుపు, గోధుమ రంగుల్లో పొలుసుల తొక్క కలిగి ఉంటుంది. అందుకే దీన్ని 'స్నేక్ ఫ్రూట్' అంటుంటారు. అరుదైన దీని రూపం కారణంగానే స్నేక్ ఫ్రూట్ అని పిలిచినా ఇది పొడవుగా ఉండదు. పండు మీదున్న తొక్కను తీసేస్తే వెల్లుల్లి రెబ్బల మాదిరిగా కనిపిస్తుంది. వాటిలోని గింజల్ని తొలగించి రెబ్బల్ని తింటుంటే యాపిల్, పైనాపిల్ రుచి, క్రంచీక్రంచీగా ఎంతో కమ్మగా ఉంటుంది. విభిన్న ఆకారం, అద్భుతమైన రుచితో అధిక పోషకాలను కలిగి ఉంటుంది. జ్ఞాపకశక్తిని పెంచే పొటాషియం, పెక్టిన్ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టే దీన్ని 'మెమరీ ఫ్రూట్' అని కూడా అంటారు. ఈ పండు గుండెకు మేలు చేయడంతో పాటు ఇందులోని సి విటమిన్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగు పడడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయి. కంటి సమస్యలు తగ్గిపోవడంతో పాటు అలసట, నీరసం వంటి సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది. ఎక్కువ పీచు, తక్కువ క్యాలరీలతో ఉండే ఈ పండు మధుమేహులతో పాటు బరువు తగ్గాలనుకునేవాళ్లకీ బాగా సాయపడుతుంది. ఇండోనేషియాకు చెందిన ఈ అరుదైన పండును ఇప్పుడు కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో సాగుచేస్తున్నారు.
"ప్రధానమంత్రి బీమా యోజన" రూ.5లక్షలకు పెంపు? - మీకు రెన్యువల్ మెసేజ్ వచ్చిందా?
"హైదరాబాద్ టు విశాఖ, అరకు" - బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో IRCTC టూర్ ప్యాకేజీ

