ETV Bharat / offbeat

పిల్లలు ఇష్టంగా తినే "పప్పు చేగోడీలు" - బియ్యప్పిండితో ఇలా సింపుల్​గా చేసుకోండి!

బియ్యప్పిండితో కరకరలాడే "చేగోడీలు" - నూనె తక్కువ, రుచి ఎక్కువ!

Crispy Pappu Chegodilu
Crispy Pappu Chegodilu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : January 11, 2026 at 2:53 PM IST

4 Min Read
Choose ETV Bharat

Crispy Pappu Chegodilu Recipe : సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో ఇంటి దగ్గర ఉండే పిల్లలు తినడానికి స్నాక్స్ అడుగుతుంటారు. ఇదే క్రమంలో చాలా మంది చిన్నారుల కోసం మురుకులు, చెక్కలు, కారప్పూస, బెల్లం గవ్వలు వంటి పిండి వంటకాలు ప్రిపేర్ చేస్తుంటారు. వాటితో పాటు కొంతమంది "చేగోడీలు" తయారు చేస్తుంటారు. అయితే, వీటిని ఇంట్లో చేసినప్పుడు బయట కొనే వాటిల్లా క్రిస్పీగా, గుల్లగా రావట్లేదని ఫీల్ అవుతుంటారు. అలాంటి వారు ఓసారి ఈ పద్ధతిలో 'పప్పు చేగోడీలు' ట్రై చేయండి. అచ్చం స్వీట్ షాప్ వాటిల్లా క్రిస్పీగా, క్రంచీగా వచ్చి సూపర్ టేస్టీగా ఉంటాయి. పైగా, నూనెను అంతగా పీల్చుకోవు! మరి, లేట్ చేయకుండా కరకరలాడే ఈ పప్పు చేగోడీలను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యప్పిండి - నాలుగు కప్పులు
  • పచ్చిశనగపప్పు - మూడు కప్పులు
  • మైదా - రెండు కప్పులు
  • ఉప్పు - రుచికి తగినంత
  • కారం - మూడు టీస్పూన్లు
  • వాముపొడి - ఒక టీస్పూన్
  • ఇంగువ - అర టీస్పూన్
  • పసుపు - అర టీస్పూన్
  • నెయ్యి - రెండు టీస్పూన్లు
  • నూనె - వేయించేందుకు సరిపడా

శనగపిండి లేకుండానే కరకరలాడే "జంతికలు" - నూనె తక్కువ, రుచి ఎక్కువ!

Crispy Pappu Chegodilu
Crispy Pappu Chegodilu (Getty Images)

తయారీ విధానం :

  • ఈ క్రిస్పీ అండ్ టేస్టీ పప్పు చేగోడీల తయారీకి ముందుగా ఒక గిన్నెలో పచ్చిశనగపప్పును తీసుకుని ఒకసారి కడగాలి. తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి రెండు నుంచి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి.
  • శనగపప్పు నానిన తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద పొడి క్లాత్​పై పలుచగా పరచి పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. అంటే, పప్పును చెమ్మ లేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవాలి.
  • ఆలోపు పిండిని సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం ఒక వెడల్పాటి బేషన్ తీసుకుని అందులో జల్లించుకున్న పొడి బియ్యప్పిండి, మైదా పిండి వేసుకుని అవి రెండు మంచిగా కలిసేలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
Crispy Pappu Chegodilu
Crispy Pappu Chegodilu (Getty Images)
  • అనంతరం స్టవ్ మీద ఒక కడాయిలో ఆరు కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి మరిగించుకోవాలి.
  • నీళ్లు వేడెక్కి మరుగుతున్నప్పుడు మూత తీసి అందులో రుచికి తగినంత ఉప్పు, కారం, వాముపొడి, పసుపు, ఇంగువ, నెయ్యి వేసుకుని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.
  • మిశ్రమం మొత్తం కలిసేలా కలిపాక స్టవ్​ను లో ఫ్లేమ్​లో ఉంచి అందులో ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒక చేత్తో కొద్దికొద్దిగా వేసుకుంటూ మరో చేతితో కలుపుతూ రెండు నిమిషాలు ఉడకనివ్వాలి.
  • పిండి మెుత్తం కలిసేలా కలుపుతూ రెండు నిమిషాలు సన్నని సెగ మీద ఉడకనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మూతపెట్టి అది కాస్త చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి.
Crispy Pappu Chegodilu
Crispy Pappu Chegodilu (Getty Images)
  • అది కాస్త చల్లారిన తర్వాత మణికట్టుతో వత్తుతూ పిండిని మెత్తని ముద్దలా కలుపుకోవాలి. పిండిని ఎంత సాఫ్ట్​గా కలిపితే చేగోడీలు అంత బాగా వస్తాయి.
  • ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్​గా ఉండాలని గుర్తుంచుకోవాలి.
  • ఆవిధంగా పిండిని సిద్ధం చేసుకున్నాక అందులో నుంచి కొద్దిగా తీసుకుని మిగతా దానిపై మూత ఉంచి ముందు ఉండలా చేసి ఆపై సన్నగా పొడుగ్గా రోల్ చేసుకోవాలి.
  • ఆపై పొడుగ్గా చేసుకున్న పిండి రోల్​ని మీకు కావాల్సిన పరిమాణంలో కట్ చేసుకోవాలి. తర్వాత చపాతీ పీటపై ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు కొద్దిగా వేసి అది రోల్ చేసుకున్న చేగోడీ పిండికి అంటుకునేలా మరోసారి రోల్ చేసుకోవాలి.
Crispy Pappu Chegodilu
Crispy Pappu Chegodilu (Getty Images)
  • తర్వాత దాన్ని చేగోడీలా రింగ్ షేప్​లో చుట్టుకొని చివర్లు చక్కగా అతికించుకుని ఒక ప్లేట్​లోకి తీసుకుని పక్కనుంచాలి. ఇదే ప్రాసెస్​లో మిగిలిన పిండి మొత్తాన్ని తయారు చేసుకోవాలి.
  • అనంతరం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత నూనె వేసి వేడి చేయాలి. ఆయిల్ బాగా వేడయ్యాక మంటను తగ్గించి ముందుగా ప్రిపేర్ చేసుకున్న చేగోడీలను నెమ్మదిగా పాన్​లో సరిపడా వేసుకోవాలి.
  • చేగోడీలు వేసిన వెంటనే కదపకుండా హై ఫ్లేమ్​లో నూనెలో పైకి తేలే వరకు అలాగే వేగనివ్వాలి.
Crispy Pappu Chegodilu
Crispy Pappu Chegodilu (Getty Images)
  • అలా తేలుతున్నప్పుడు స్టవ్​ను మీడియం ఫ్లేమ్​కి టర్న్ చేసి గరిటెతో తిప్పుతూ క్రిస్పీగా మారేంత వరకు వేయించుకోవాలి. చేగోడీలు చక్కగా వేగినట్లయితే నూనె​లో నురగలు రావడం పూర్తిగా తగ్గిపోతుంది.
  • ఆవిధంగా వేయించుకున్నాక వాటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్​లోకి తీసుకుని కాసేపు ఉంచి ఆపై సర్వ్ చేసుకుంటే చాలు.
  • అంతే, స్వీట్ షాప్ స్టైల్​లో కరకరలాడే కమ్మని "పప్పు చేగోడీలు" రెడీ అవుతాయి!
  • ఇక వీటిని చల్లారాక ఎయిర్ టైటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 15 నుంచి 20 రోజుల పాటు ఫ్రెష్​గా నిల్వ ఉంటాయి!
Crispy Pappu Chegodilu
Crispy Pappu Chegodilu (Getty Images)

చిట్కాలు :

  • ఇక్కడ మీరు శనగపప్పు వద్దనుకుంటే దాని ప్లేస్​లో పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. ఒకవేళ పెసరపప్పును తీసుకుంటే గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది.
  • ఈ రెసిపీ కోసం బియ్యప్పిండి తీసుకున్న కప్పునే నీళ్లు, ఇతర పదార్థాలు తీసుకోవడానికి వాడుకోవాలి.
  • ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీలో ఈ చేగోడీలు చేసుకోవాలనుకుంటే పప్పుతో పాటు ఇతర పదార్థాలను తగ్గించి తీసుకుంటే చాలు.

పిండి ఇలా కలిపి "కారప్పూస" చేయండి - స్వీట్ షాప్ స్టైల్ రుచితో కరకరలాడుతుంది!

పాకం లేకుండా "అరిసెలు" - పావుగంటలో రెడీ - నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి!