కారంగా, కమ్మగా "ఎండు మిర్చి నిల్వ పచ్చడి" - చింతపండు, ఉప్పు, నూనె పక్కా కొలతలివే!
కొత్త వాళ్లైనా సరే సింపుల్‌గా ఇలా పెట్టేయొచ్చు - సంవత్సరం నిల్వ ఉంటుంది!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 9, 2026 at 10:32 AM IST
Pandu Mirchi Pachadi : వేడి వేడి అన్నంలోకి కాస్త ఎండు మిర్చి చట్నీ, నెయ్యి వేసుకుని తింటుంటే ఆ మజానే వేరు. కారంగా, కమ్మగా రోజూ తినేకంటే కాస్త ఎక్కువే లాగించేస్తారు. అసలు ఎండు మిర్చి చట్నీ ఎలా పెట్టుకోవాలి? పదార్థాల కొలతలు ఏంటి? ఉప్పు, నూనె ఎంత ఉపయోగిస్తారు? పక్కా కొలతలు ఏంటో ఇపుడు తెలుసుకుందాం. సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడిని ఇలా ఇక్కడ ఇచ్చిన పద్ధతిలో ట్రై చేయండి.
టమోటా ధర తగ్గింది - "పండు మిర్చితో నిల్వ పచ్చడి" ఇలా పెట్టేయండి!

కావల్సిన పదార్థాలు :
- పండు మిర్చి - అరకేజీ
- చింతపండు - 125 గ్రాములు
- ఉప్పు - 125 గ్రాములు
- పసుపు - 1 టీ స్పూన్
- వెల్లుల్లి పాయలు - 20 నుంచి 25
- నూనె - 150గ్రాములు
- ఎండు మిర్చి - 3
- ఆవాలు - 1 స్పూన్
- జీలకర్ర - 1 స్పూన్
- కరివేపాకు - 1 రెమ్మ
- ఇంగువ - అర స్పూన్
- ఆవ పిండి - 1 స్పూన్
- మెంతి పిండి - 1 స్పూన్

తయారీ విధానం :
- ముందుగా అరకేజీ పండు మిర్చి శుభ్రం చేసుకుని క్లాత్‌తో క్లీన్ చేసుకుని తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలి. ఇపుడు కేజీ పండు మిర్చికి పావుకేజీ చింతపండు లెక్కన తీసుకోవాలి. అరకేజీ పండు మిర్చిలోకి 125గ్రాముల చింతపండు తీసుకుని గింజలు, పీచు లేకుండా మిక్సీలోకి తీసుకోవాలి.

- ఇపుడు 125గ్రాముల ఉప్పు వేసుకోవాలి. చింతపండు, ఉప్పు గ్రైండ్ చేసి తీసుకోవడం వల్ల పచ్చడిలో బాగా కలిసిపోతుంది. ఇపుడు పండు మిర్చి ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 10 నుంచి 15 వెల్లుల్లి పాయలు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన చట్నీ ఓ గిన్నెలోకి తీసుకుని రోజంతా పక్కన పెట్టుకోవాలి.

- 24గంటల పాటు ఊరిన తర్వాత తాలింపు పెట్టుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. ఇపుడు తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 150గ్రాముల నూనె వేసుకుని వేడెక్కగానే వెలుల్లి, ఎండు మిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకుని కలిపాక వేడి వేడి నూనెలో ముందుగా రెడీ చేసుకున్న పచ్చడి వేసుకుని కలపాలి.

- ఇపుడు 1 స్పూన్ ఆవ పిండి, 1 స్పూన్ మెంతి పిండి వేసుకుని కలిపి మరో రెండు నిమిషాల పాటు కలిపిన తర్వాత నూనె తేలే సమయంలో దించి చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటే సంవత్సరం పాటు చక్కగా ఉంటుంది.
ఘుమఘుమలాడే "చికెన్ తొక్కు పచ్చడి" - పక్కా కొలతలతో రెండు నెలలు నిల్వ!
పదండి "పచ్చిమిర్చి పచ్చడి" టేస్ట్ చేద్దాం - చపాతీ, దోసెల్లోకి అద్భుతంగా ఉంటుంది!

