పాలకూరతో కమ్మని "మసాలా వడలు" - ఈవెనింగ్ స్నాక్స్‌గా బెస్ట్ ఆప్షన్ - టేస్ట్ వేరే లెవల్!
-అప్పటికప్పుడు చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు! - పాలకూర అంటే నచ్చనివాళ్లూ ఇష్టంగా తింటారు!

Published : January 10, 2026 at 11:02 AM IST
Palakura Masala Vada: వడలను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే.. మసాలా వడలను స్నాక్స్ రూపంలో తీసుకుంటుంటారు మెజార్టీ పీపుల్. సూపర్ టేస్టీగా ఉండే మసాలా వడలను పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటుంటారు. ఇక ఒక కప్పు టీతో వీటిని తింటుంటే ఆ కిక్కే వేరు. అయితే మసాలా వడలను ఎప్పుడూ చేసేలా కాకుండా మరింత రుచికరంగా, హెల్దీగా చేసుకునేలా రెసిపీ తీసుకొచ్చాం. అందుకు పాలకూర సరిపోతుంది. ఈ ఆకుకూర నచ్చని పిల్లలకు ఓసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. వంక పెట్టకుండా తినేస్తారు. మరి లేట్ చేయకుండా కమ్మని పాలకూర మసాలా వడలు ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- శనగపప్పు - 1 కప్పు
- మినప్పప్పు - పావు కప్పు
- పాలకూర -
- ఉల్లిపాయ - 1
- వెల్లుల్లి రెబ్బలు - 6
- అల్లం ముక్క - చిన్నది
- పచ్చిమిర్చి - 3
- జీలకర్ర - 1 టీస్పూన్
- సోంపు - 1 టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- ఇంగువ - పావు టీస్పూన్
- పాలకూర - 1 కట్ట

తయారీ విధానం:
- మిక్సింగ్ బౌల్లోకి శనగపప్పు, మినప్పప్పు తీసుకుని రెండుమూడు సార్లు శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి సుమారు రెండు లేదా మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి.
- పప్పు నానేలోపు ఉల్లిపాయను వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే అల్లంపై పొట్టు తీసేసి సన్నని ముక్కలుగా చేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను అదే విధంగా తరిగి పక్కనుంచాలి.
- మీడియం సైజ్‌లో ఉన్న పాలకూర కట్టను సన్నగా తరిగి శుభ్రంగా కడిగి నీళ్లు పోయేవరకు జల్లి గిన్నెలో వేసి పక్కన ఉంచాలి.
- పప్పు నానినాక అస్సలు నీళ్లు లేకుండా మిక్సీజార్‌లోకి వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసుకున్నాక శనగపప్పు మిశ్రమాన్ని ఓ మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి.
- ఈ పిండిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, జీలకర్ర, సోంపు, ఉప్పు, ఇంగువ, పాలకూర తరుగు వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి.

- పదార్థాలు మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
- నూనె కాగినాక కలిపి పెట్టుకున్న పిండిని కొద్దికొద్దిగా తీసుకుని మసాలా వడల షేప్‌లో చేసుకుని నూనెలో వేసుకోవాలి.
- ఇలా కడాయికి సరిపడా వేసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి.

- వడలు క్రిస్పీగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారినాక తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని వడలుగా చేసి కాల్చుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే పాలకూర మసాలా వడలు రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.

చిట్కాలు:
- శనగపప్పు, మినప్పప్పును కచ్చితంగా రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి. వీలైనంత ఎక్కువసేపు నానబెట్టుకున్నా మంచిదే.
- నానిన పప్పులను మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా అస్సలు నీళ్లు లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా రుబ్బుకుంటే నూనె ఎక్కువ పీల్చుకునే అవకాశం ఉంటుంది.
- పాలకూర కేవలం ఒక కట్టే అని కాకుండా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు.
- వడలను కేవలం మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే వేయించుకోవాలి. సిమ్‌లో వేయిస్తే నూనె పీల్చుతాయి. హై ఫ్లేమ్‌లో కాలిస్తే పిండి లోపలి వరకు ఉడకదు.
తెలంగాణ స్పెషల్ "సకినాలు" - పిండి ఇలా కలిపి చేస్తే కరకరలాడుతూ అద్దిరిపోతాయి!
నోట్లో వేసుకోగానే కరిగిపోయే "కొత్తిమీర పొంగలి" - కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు!

