"పాలకూర పచ్చి బఠానీ కర్రీ" - ఇదొక్కటి చాలు పూరీ, రైస్‌లో పర్ఫెక్ట్గా ఉంటుంది!
పాలకూర కర్రీ ఇలా భిన్నంగా ట్రై చేయండి - చాలా రుచిగా ఉంటుంది!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 14, 2026 at 2:57 PM IST
PALAKURA CURRY RECIPE : పూరీలు, చపాతీ, రైస్‌లోకి పాలకూర పచ్చి బఠానీ కర్రీ అద్భుతంగా ఉంటుంది. ఉదయం చేశారంటే బ్రేక్‌ఫాస్ట్‌లో పూరీలు, మధ్యాహ్నం రైస్‌లోకి తినేయొచ్చు. పాలకూరలో చాలా మంది టమోటాలు ఇష్టపడరు. అలాంటి వాళ్లు టమోటాలను స్కిప్ చేసి వాడుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన విధంగా రాయలసీమ స్టైల్లో ఓ సారి ఉల్లిపాయ తరుగు, పచ్చి బఠానీ వేసి ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా, కారంగా చపాతీలు, పూరీల్లోకి మంచి రుచిగా ఉంటుంది.
శివరాత్రికి "చిలగడ దుంప బొబ్బట్లు" - నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి!

కావాల్సిన పదార్థాలు :
- పాలకూర - 5 కట్టలు
- పల్లీలు - 3 టేబుల్ స్పూన్లు
- పచ్చి బఠానీ - పావు కప్పు
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - అర స్పూన్
- శనగపప్పు - అర స్పూన్
- మినపప్పు - అర స్పూన్
- ఆవాలు - అర స్పూన్
- ఉల్లిపాయ - 1
- వెల్లుల్లి పాయలు - 6
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - కొద్దిగా
- కారం - 2 స్పూన్లు
- ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
- టమోటాలు - 2

తయారీ విధానం :
- ముందుగా స్టవ్ పై మందపాటి కడాయి పెట్టుకుని పల్లీలు ప్రై చేసుకోవాలి. సన్నటి మంటపై మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుతూ వేయించాలి. ఆ తర్వాత పక్కన పెట్టుకుని మిక్సీలో మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.

- ఇపుడు అదే కడాయిలో నూనె వేసుకుని పోపు గింజలు జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకుని వేయించుకోవాలి. పోపు గింజలు చిటపటలాడిత తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. అందులోనే వెల్లుల్లి పాయలు కూడా వేసుకోవాలి. ఇదే సమయంలో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. ఇపుడు పచ్చి బఠానీ కూడా వేసి కలుపుకోవాలి. రెండు, మూడు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి.

- ఇపుడు పసుపు, కారం, ధనియాల పొడి వేసుకుని బాగా కలపాలి. ఆ తర్వాత రెండు పెద్ద టమోటాల ముక్కలు వేసుకుని కలపాలి. టమోటాలు మగ్గించుకున్న తర్వాత శుభ్రం చేసుకుని కట్ చేసుకున్న పాలకూర కూడా వేసుకుని ఓ సారి కలిపి మూతపెట్టి మగ్గించుకోవాలి.

- ఐదు నిమిషాల తర్వాత ఓ సారి మూత తీసి చూస్తే పాలకూర మగ్గిపోయి ఉంటుంది. ఓ సారి బాగా కలిపి గ్రైండ్ చేసిన తర్వాత పల్లీల పొడి వేసుకుని బాగా కలపాలి. నూనె తేలే వరకు మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. చివరగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అంతే! ఈ కర్రీ చపాతీ, పూరీల్లోకి అద్భుతంగా ఉంటుంది.
నోరూరించే "వెల్లుల్లి మిరియాల రసం" - కమ్మగా గొంతులోకి దింగుతుంటే ఆహా అనాల్సిందే!
ఆంధ్రా స్టైల్ "పుల్ల గోంగూర పచ్చడి" - ఆమ్లెట్ వేసుకుని తింటుంటే అద్దిరిపోతుంది!

