కందిపప్పుతో పప్పు, సాంబార్ రొటీన్ - ఇలా "పచ్చడి" చేయండి! - టేస్ట్ సూపర్!
అమ్మమ్మల పద్ధతిలో నోరూరించే 'కంది పచ్చడి' - తక్కువ పదార్థాలతో సింపుల్‌గా రెడీ!

Published : January 11, 2026 at 3:45 PM IST
Old Style Kandi Pachadi Recipe in Telugu : కొన్నిసార్లు ఇంట్లో సమయానికి కూరగాయలు ఉండవు. బయటకు వెళ్లి తెచ్చుకునేంత టైమ్ ఉండకపోవచ్చు. అలాంటి సందర్బాల్లో ఇంట్లో ఉండే కందిపప్పుతో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఒక అద్భుతమైన "పచ్చడి" రెసిపీ ఉంది. నార్మల్‌గా మనందరం కందిపప్పుతో పప్పు కూరలు, సాంబార్, రసం వంటివి చేసుకుంటుంటాం. అయితే, ఎప్పుడూ రొటీన్‌గా అవే కాకుండా ఈసారి ఇలా 'పచ్చడి' చేసుకుని చూడండి.
అమ్మమ్మల పద్ధతిలో చేసుకునే ఈ రెసిపీ సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే భలే కమ్మగా ఉంటుంది! ఇది రైస్‌లోకి మాత్రమే కాకుండా టిఫెన్స్లోకీ మంచి రుచికరంగా ఉంటుంది. పైగా దీని తయారీ కోసం ఎక్కువ పదార్థాలూ అవసరం లేదు. కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. బిగినర్స్ కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మరి, ఆలస్యం చేయకుండా రుచికరమైన ఈ ఇన్స్టంట్ కంది పచ్చడిని ఎలా చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- ఒక కప్పు - కందిపప్పు
- రుచికి తగినన్ని - ఎండుమిర్చి
- రెండు టీస్పూన్లు - జీలకర్ర
- కొద్దిగా - చింతపండు
- వెల్లుల్లి రెబ్బలు - 8 నుంచి 10
- అర టీస్పూన్ - పసుపు
- రుచికి తగినంత - ఉప్పు
శనగపిండి లేకుండానే కరకరలాడే "జంతికలు" - నూనె తక్కువ, రుచి ఎక్కువ!

తయారీ విధానం :
- ఈ పచ్చడి తయారీకి ముందుగా ఒక స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయిలో కందిపప్పును వేసి లో ఫ్లేమ్‌లో ఐదారు నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి.
- కందిపప్పు దోరగా వేగిన తర్వాత అందులోనే మీరు తినే కారాన్ని బట్టి తగినన్ని ఎండుమిర్చి, జీలకర్ర, కొద్దిగా చింతపండు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకుని వాటన్నింటినీ మరో నాలుగైదు నిమిషాలు సన్నని సెగ మీద వేయించాలి.
- అవన్నీ చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి.

- కందిపప్పు మిశ్రమం కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత గ్రైండ్ చేసుకున్న కందిపొడి మిశ్రమంలో పసుపు, రుచికి తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకుని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలా పచ్చడిని మరోసారి మిక్సీ పట్టుకుని పక్కనుంచాలి.
- ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, పచ్చడిని మరీ లూజుగా కాకుండా కాస్త గట్టిగానే ముద్దలా వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులోకి తాలింపును రెడీ చేసుకోవాలి.
టిఫెన్స్లోకి కిర్రాక్ "కొబ్బరి కొత్తిమీర చట్నీ" - తక్కువ పదార్థాలతో నిమిషాల్లోనే రెడీ!

తాలింపు కోసం :
- నూనె - కొద్దిగా
- ఆవాలు - ఒక చెంచా
- జీలకర్ర - కొద్దిగా
- కరివేపాకు - ఒకట్రెండు రెబ్బలు
- ఎండుమిర్చి - రెండు
- ఇంగువ - పావు టీస్పూన్

- తాలింపు కోసం స్టవ్ మీద చిన్న కడాయిలో నూనె పోసి హీట్ చేసుకోవాలి.
- ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తుంపలు, కరివేపాకు, ఇంగువ వేసుకుని పోపును చక్కగా వేయించుకోవాలి.
- అనంతరం ఆ తాలింపును ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసి మిక్స్ చేసుకుంటే చాలు.
- అంతే, అమ్మమ్మల పద్ధతిలో సూపర్ టేస్టీగా ఉండే "కంది పచ్చడి" నిమిషాల్లోనే రెడీ అవుతుంది!
- ఇక దీన్ని ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసుకున్నారంటే మూడు నుంచి నాలుగు రోజుల పాటు తాజాగా నిల్వ ఉంటుంది.
- మరి, క్విక్ అండ్ ఈజీగా చేసుకునే ఈ రుచికరమైన పచ్చడి నచ్చినట్లయితే మీరూ ఓసారి ప్రయత్నించి చూడండి. ఇంటిల్లిపాదీకి చాలా బాగా నచ్చుతుంది.

టిప్స్ :
- కందిపప్పు వేయించుకునేటప్పుడు అది మాడిపోకుండా సన్నని సెగ మీదనే నెమ్మదిగా వేయించుకోవాలి. అప్పుడే పచ్చడి టేస్ట్ చాలా బాగా వస్తుంది.
- ఒకవేళ మీరు ఈ పచ్చడిని తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే పప్పుతో పాటు ఇతర పదార్థాలను తగ్గించి తీసుకుంటే సరిపోతుంది.
పిల్లలు ఇష్టంగా తినే "పప్పు చేగోడీలు" - బియ్యప్పిండితో ఇలా సింపుల్‌గా చేసుకోండి!

