ధూమ్ తాత - ఏకంగా 300 స్టార్ హోటళ్లకు మస్కా!
- సినిమా తరహా దొంగలాగా జల్సా చేస్తున్న వృద్ధుడు - అతను చెప్పిన కారణంతో నోరెళ్లబెట్టిన పోలీసులు!

Published : July 4, 2026 at 11:42 AM IST
Hotel bill evasion : ధూమ్ మూవీ సిరీస్ సూపర్ హిట్. మూడు సినిమాలుగా వచ్చిన ఈ సిరీస్‌లో జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, ఆమిర్ ఖాన్ దొంగ పాత్రల్లో నటించారు. ఆ ముగ్గురినీ తలదన్నేలా ఏకంగా 300 స్టార్ హోటళ్లకు మస్కా కొట్టించాడో వృద్ధుడు. అతని పేరు బింగ్ సన్ జాన్. వయసు 69. మరి, ఈ రియల్ ధూమ్ తాత స్టోరీ ఏంటో ఇక్కడ చూడండి.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన బింగ్ సన్ జాన్, ఈ నెల 25న ఛత్తీస్‌గఢ్ వెళ్లాడు. రాజధాని రాయ్‌పుర్‌లో "హయత్" పేరుతో ఉన్న ఫైవ్‌స్టార్ హోటల్లో దిగాడు. అల్లరి నరేష్ సనిమాలోని "మిలియనీర్ మిత్రా" క్యారెక్టర్ మాదిరిగా కలరింగ్ ఇచ్చాడు. లగ్జరీ రూమ్‌లో మూడు రోజులు ఎంజాయ్ చేశాడు. "నా ల్యాప్ టాప్ మిరిచిపోయాను, అర్జెంటు పని ఉంది. కాస్త మీ దగ్గర ఉంటే ఇవ్వండి. వెంటనే ఇచ్చేస్తాను" అని తీసుకున్నాడు. 27వ తేదీన రూమ్ సర్వీస్ వాళ్లు అతని గదికి వెళ్లి చూడగా మనిషి కనపడలేదు. అతని సామాను కూడా కనిపించలేదు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్. అప్పుడుగానీ వాళ్లకు అర్థం కాలేదు ధూమ్ తాత టాలెంట్. చెప్పాపెట్టకుండా ఎస్కేప్ అయిపోయాడని తెలుసుకొని ఖంగుతున్నారు. హోటల్ బిల్లు 63,755 రూపాయలైంది. అది కట్టకుండా పోవడమే కాదు, మళ్లీ ఇస్తానని తీసుకున్న ల్యాప్ టాప్ కూడా నొక్కేశాడు. దాని విలువ ఏకంగా రూ.1.48 లక్షలు. మొత్తంగా రెండు లక్షలకు పైగా టోపీ పెట్టి జంప్ అయిపోయాడు.
మోసం జరిగిపోయిన తర్వాత హోటల్ నిర్వాహకులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. హోటల్లోకి చెక్ -ఇన్ అయిన టైమ్‌లో ఇచ్చిన డాక్యుమెంట్స్, మొబైల్ నంబర్ ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. టెక్నాలజీ సాయంతో నిందితుడు భువనేశ్వర్‌లో ఉన్నాడని తెలుసుకున్నారు. గప్ చుప్‌గా వెళ్లి పట్టేసుకున్నారు.
నివ్వెర పోయిన పోలీసులు!
ఇదేదో ఒక్కసారి చేసిన మోసం కాదు, ఒక్క హోటల్‌ను చేసిన మోసం కాదు. గడిచిన 36 ఏళ్లుగా జాన్ పని ఇదేనని తెలుసుకొని షాక్ అయ్యారు. ఒక హోటల్‌కు వెళ్లినప్పుడు "ఐయామ్ ఫారిన్ టూర్ గైడ్" అని చెప్పుకుంటాడు. ఇంకో హోటల్‌కు వెళ్లినప్పుడు "దిసీజ్ జాన్, ఇంగ్లిష్ టీచర్" అంటాడు. ఇంకోసారి "బమ్ చిక్ బమ్ చేయి బాగా.. ఒంటికి యోగా మంచిదేగా" అని పాడుతూ నేను యోగా ట్రైనర్ అని చెప్తాడు. ఇలా, ఎన్ని గెటప్‌లు వేశాడో అతనికే తెలియదు. ఎక్కడికి వెళ్లినా స్టార్ హోటల్‌కు వెళ్లడం, కావాల్సినన్ని రోజులు ఉండడం, బిల్లు కట్టకుండా వెళ్లిపోవడం. పనిలో పనిగా చేతికందింది పట్టుకొని వెళ్లిపోవడం. ఇదీ జాన్ స్టైల్! ఇప్పటి వరకు ఇలా 300 పైగా హోటళ్లను మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు.
"మరి, ఇన్నేళ్లుగా పోలీసులకు దొరకలేదా?" అంటే, చాలా సార్లు దొరికాడు. ఇతనిపై 10 రాష్ట్రాలకు పైగా కేసులున్నాయి. తిహాడ్ జైలు సహా వివిధ రాష్ట్రాల్లోని వివిధ జైళ్లలో ఏకంగా 15 ఏళ్లు ఉన్నాడు. అయినా కూడా అతని పద్ధతిలో మార్పురాలేదు. పంథా మార్చుకోలేదు. ఎందుకు తాత ఇలా అంటే, అతను చెప్పిన సమాధనం విని పోలీసులు విస్తుపోయారు. ఈ పని చేయడం తనకు ప్యాషన్ అని చెప్పాడు. సీరియల్ కిల్లర్, ఇంటర్నేషనల్ క్రిమినల్ ఛార్లెస్ శోభరాజ్ అంటే తనకు చాలా ఇష్టమని, అందుకే అతన్ని ఫాలో అవుతున్నాను అని చెప్పాడు. ఆయన పద్ధతుల్లోనే మోసాలు చేస్తున్నట్టు వెల్లడించాడు.
73 సార్లు తప్పించుకున్న అంతర్రాష్ట్ర దొంగ - చివరకు ఓ మహిళ కంప్లైంట్‌తో చిక్కాడిలా

