నూనెలో వేయించకుండానే టేస్టీ "పూరీలు"! - మూడు పద్దతుల్లో ఈజీగా చేసుకోండిలా!
ఆయిల్ లేకుండానే "పూరీలు" పొంగుతాయి! - 'హెల్దీ టిఫెన్' ఇలా ప్రిపేర్ చేసుకోండి!

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 28, 2026 at 5:22 PM IST
Types of Oil Free Puri Preparation : మనలో ఎక్కువ మంది ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలలో ఒకటి "పూరీ". కానీ, ఆయిల్ ఎక్కువగా ఉంటుందని, తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని భయపడుతుంటారు చాలా మంది. దాంతో ఇష్టమైనప్పటికీ వాటిని తినడానికి దూరంగా ఉంటారు. మీరూ ఇలాగే పూరీలను తినకుండా పక్కన పెడుతున్నారా? ఇక, ఆ అవసరం లేదు. చాలా అంటే చాలా తక్కువ ఆయిల్లో హెల్దీగా పూరీలు రెడీ చేసుకోవచ్చు. మీకు నచ్చిన టిఫెన్‌ను ఇష్టంగా లాగించేయొచ్చు. మరి, ఆయిల్ లెస్ పూరీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అందుకు కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఓవెన్‌లో ఇలా :
- ఇందుకోసం ఒక వెడల్పాటి ప్లేట్ లేదా బేషన్లో జల్లించిన పూరీ పిండిని తీసుకోవాలి.
- ఆ తర్వాత అందులో రుచికి తగినంత ఉప్పు, స్మూత్‌గా రావడం కోసం కాస్త నూనె, తగినన్ని నీళ్లు పోసుకుని ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
- తర్వాత అందులో నుంచి కొద్దికొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి.
- నెక్ట్స్ అలా ప్రిపేర్ చేసుకున్న పూరీలకు కాస్త నూనె రాసి మైక్రోవేవ్‌లో సేఫ్ ప్లేటులో పెట్టాలి.
- తర్వాత మధ్య మధ్యలో అటూ ఇటూ తిప్పుతూ రెండు నిమిషాలు వేడి చేస్తే సరి.
- అంతే, సూపర్ టేస్టీగా ఉండే పూరీలు పెద్దగా ఆయిల్ లేకుండానే మీ ప్లేటులోకి వచ్చేస్తాయి!
- ఒకవేళ మీరు కావాలంటే బేకింగ్ పద్ధతిలోనూ పూరీలను రెడీ చేసుకోవచ్చు.
- ఇందుకోసం ముందుగా ఓవెన్‌ను 200 డిగ్రీల వద్ద ప్రీహీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ప్రిపేర్ పూరీలను బేకింగ్ ట్రేలో ఉంచి సుమారు 8 నుంచి 10 నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుంది.
ఎయిర్ ఫ్రైయర్ చేసుకోండిలా :
- ఎయిర్ ఫ్రైయర్లోనూ ఆయిల్ లెస్ పూరీలు ప్రిపేర్ చేసుకోవచ్చు
- ఇందుకోసం ముందుగా 180 డిగ్రీల వద్ద ఎయిర్ ఫ్రైయర్‌ను ప్రీహీట్ చేసుకోవాలి.
- నెక్ట్స్ ఒత్తుకున్న పూరీలకు ఇరు వైపులా ఆయిల్ అప్లై చేయాలి. ఒకవేళ నూనె వద్దనుకుంటే నెయ్యిని వాడుకోవచ్చు.
- తర్వాత వాటిని ఎయిర్ ఫ్రైయర్ ట్రేలో ఉంచి, 7 నుంచి 8 నిమిషాలు వేయిస్తే చాలు. మధ్యమధ్యలో అటూ ఇటూ తిప్పుతూ ఉండాలి.
- అంతే, మీకు నచ్చిన పూరీలు చాలా తక్కువ నూనెతో, తక్కువ టైమ్‌లోనే రెడీ అవుతాయి!
ఇడ్లీ పాత్రలోనూ టేస్టీ పూరీలు :
- ఇడ్లీ పాత్రలో కూడా మంచి రుచికరమైన పూరీలు తయారు చేసుకోవచ్చు! ఇందుకోసం మొదటగా ఇడ్లీ గిన్నెలో తగినన్ని నీళ్లు తీసుకుని మరిగించాలి.
- అవి మరిగేలోపు ఇడ్లీ ప్లేటుకు ఆయిల్ అప్లై చేయాలి. ఆ తర్వాత ఆ ప్లేటుపై ముందుగా ఒత్తుకున్న పూరీలను ఉంచాలి.
- ఇప్పుడు ఇడ్లీ పాత్రలో నీళ్లు మరిగాయనుకున్నాక మూత తీసి అందులో పూరీలు ఉంచిన ప్లేటును పెట్టి 5 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి.
- ఐదు నిమిషాల తర్వాత పూరీలను రెండో వైపునకు తిప్పి మరో 5 నిమిషాలు ఉంచి దించాలి.
- ఇలా కుక్ చేసుకున్న పూరీలను ఒక మందం పాటి ప్లేటులోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టి, అందులో మరో చిన్న గిన్నె బోర్లించి దానిపై పూరీలు ఉన్న ప్లేటు పెట్టి, గిన్నెను మొత్తం కవరయ్యేలా మూతతో మూయాలి.
- తర్వాత స్టవ్‌ను సిమ్‌లో ఉంచి 10 నిమిషాలపాటు కుక్ చేస్తే సరి. నూనె లేకుండానే(ప్లేట్‌కు రాసేది కాకుండా) కరకరలాడే పూరీలు రెడీ అవుతాయి!
- ఇక వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ భలే ఇష్టంగా తింటారు. బరువు తగ్గాలంటూ ఆయిల్ ఫుడ్‌కు దూరంగా ఉండే వాళ్లూ ఈ పూరీలను ఎలాంటి ఇబ్బందీ లేకుండా తినేయొచ్చు!
బియ్యంలో పురుగులా? - ఈ టిప్స్ ట్రై చేస్తే ఒక్కటీ కనిపించదు!
"కూల్‌డ్రింక్" మిగిలితే పారబోస్తున్నారా? - ఈ ఉపయోగాలు తెలిస్తే అలా అస్సలు చేయరు!

