ETV Bharat / offbeat

'వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌' చేస్తున్నారా? - ఇంటిని ఇలా మార్చుకుంటే రోజంతా ఫుల్ యాక్టివ్​​​!

ఆఫీస్ కంఫర్ట్ ఇంట్లో దొరకట్లేదా? - ఈ ​టిప్స్​తో మీ ఫోకస్ నెక్ట్స్ లెవల్ అంటున్న నిపుణులు!

Home Office Furniture
వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Getty Images)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 2, 2026 at 3:41 PM IST

3 Min Read
Choose ETV Bharat

Creative Ideas Home Office Furniture : నేటి ఆధునిక సమాజంలో సాంకేతికత పెరగడం, కొత్త పరిశ్రమలు రావడం వల్ల ఉపాధి అవకాశాలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా నగరాల్లో చదువుకున్న యువత అంతా డెస్క్ జాబ్స్ వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆఫీసులో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే, నార్మల్​గా ఆఫీస్​లో పని చేసుకోవడానికి అనుకూలమైన వాతావరణం, సౌకర్యమైన ఫర్నిచర్ ఉంటాయి. కానీ, అదే ఇంట్లో నుంచి పనిచేసినప్పుడు ఏదో ఒక గదిలో ఉన్న కుర్చీలు, సోఫాలతోనే చాలా మంది సర్దుకుపోతుంటారు

వాస్తవానికి దీనివల్ల వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ తగ్గిపోవడంతో పాటు, అసౌకర్యంగా ఉండడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే నిత్యం ఇంటి నుంచి పని చేసే వారు, వారానికి రెండు, మూడు రోజులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసే ఉద్యోగులు ఇంటినే ఆఫీస్‌గా తమకు అనుకూలంగా మలచుకోవాలంటున్నారు. అదెలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నార్మల్​గా చాలా ఆఫీసుల్లో ఉద్యోగులు పగటి పూట కూడా లైట్ల వెలుతురులో పనిచేయడం చూస్తుంటాం. కానీ ఇలా రోజంతా కృత్రిమ లైటింగ్‌లో పనిచేయడం వల్ల కళ్లు అలసిపోతాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే, ఇంటి నుంచి పనిచేసినప్పుడు బయటి నుంచి సహజ వెలుతురు పడేలా టేబుల్‌ని కిటికీ దగ్గర ఏర్పాటు చేసుకోవడం మంచిదంటున్నారు. అలాగే నైట్​ టైమ్​లో పనిచేసే వారు కళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేలా వార్మ్‌ టేబుల్‌ ల్యాంప్స్‌ వాడడం బెటర్ అంటున్నారు.

చాలా మంది మధ్యమధ్యలో బ్రేక్​ తీసుకున్నా, పనిలో పడి ఎక్కువసేపు కూర్చుండిపోతారు. అలాంటప్పుడు వెన్ను నొప్పి రాకుండా ఎర్గోనామిక్‌ ఛైర్‌ వాడడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ ఛైర్ వీపు, మెడకు సరైన సపోర్ట్‌ అందించి నొప్పులు రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా, శారీరక భంగిమ దెబ్బతినకుండానూ ఉంటుందంటున్నారు.

ఇంటి నుంచి పనిచేసుకునే వారిలో కొంతమంది తమ హోమ్‌ ఆఫీస్‌ని కలర్‌ఫుల్‌గా మార్చేస్తుంటారు. అలా మార్పులు చేసేటప్పుడు ముదురు రంగులు వాడడం వల్ల కళ్లపై, మనసుపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి ఆ గదిలోని గోడలకు వైట్, క్రీమ్‌, లేత బూడిద రంగులు వేసుకోవడం బెటర్ అంటున్నారు. అలాగే అందులోని ఫర్నిచర్‌ కూడా ఇవే రంగుల్లో ఉండేలా చూసుకుంటే మనసుకు ప్రశాంతత చేకూరుతుందంటున్నారు.

ఈ అమ్మాయిలు ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు? - ఏం ఆలోచిస్తున్నారంటే!

నేటి రోజుల్లో చాలామంది తమ ఆఫీస్‌ డెస్కుల్లో పచ్చటి మొక్కలు ఏర్పాటుచేసుకోవడం చూస్తున్నాం. ఇంటి నుంచి పనిచేసే వారు కూడా ఈ చిట్కా ఫాలో అవ్వాలనుకుంటే, అందుకు మనీ ప్లాంట్‌, పీస్‌ లిల్లీ, స్నేక్‌ ప్లాంట్‌ వంటి ఇండోర్ ప్లాంట్స్ పర్‌ఫెక్ట్​గా సూటవుతాయని చెబుతున్నారు. ఈ మొక్కలు రూమ్​లోని గాలిని శుభ్రపరచడంతో పాటు మనసుకు ప్రశాంతతనూ అందిస్తాయంటున్నారు. ఇక వీటిని సెట్ చేసుకోవడానికి ఆకర్షణీయమైన రంగుల్లో ఉన్న సెరామిక్‌, టెర్రకోటా ప్లాంటర్స్‌ ప్రస్తుతం మార్కెట్లో బోలెడన్ని డిజైన్లలో లభిస్తున్నాయి.

కొంతమంది ఇంటిని ఆఫీస్​లా మార్చుకున్నప్పుడు ఆ రూమ్​లో రకరకాల ఫొటోఫ్రేముల్నీ ఏర్పాటుచేసుకుంటారు. అయితే ఇందుకోసం పర్సనల్, ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోలు కాకుండా, మీరు అవార్డులు, రివార్డులు అందుకున్న ఫొటోలు ఏర్పాటు చేసుకుంటే బెటర్ అంటున్నారు. లేదంటే మీకొచ్చిన మెడల్స్‌ని ఫ్రేమ్‌గా చేయించినవి; ప్రేరణాత్మక కొటేషన్‌ బోర్డులు వంటివి ఏర్పాటుచేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇలాంటి ఫొటోఫ్రేమ్​లు మీలో ప్రోత్సాహాన్ని పెంచుతూ స్ఫూర్తినిస్తాయని చెబుతున్నారు.

ఆఫీస్‌ డెస్క్‌ వద్ద వైర్లు ఎక్కువగా ఉన్నా ఆ ప్లేస్ చిందరవందరగా కనిపిస్తుంది. తద్వారా ఏకాగ్రత దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ వైర్లు కనిపించకుండా కేబుల్‌ మేనేజ్‌మెంట్‌ స్లీవ్స్‌, ట్రేలు వంటివి ఏర్పాటుచేసుకోవడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. తద్వారా ఆ ప్రాంతం నీట్‌గా ఉండడంతో పాటు సురక్షితంగా, సౌకర్యంగా పనిచేసుకోవచ్చంటున్నారు.

ఈ ఫ్యాన్లతో విద్యుత్తు బిల్లు 65శాతం ఆదా! - కరెంట్​ లేకున్నా 10 గంటలు తిరుగుతాయి!

తాజావో కాదో గిల్లి, గిచ్చి చెక్ చేస్తున్నారా? - పండ్లు, కూరగాయల క్వాలిటీ చెప్పేసే కోడ్స్ ఇవే!