ఎన్నడూ ట్రై చేయని కొత్తరకం "బెండకాయ పచ్చడి" - పెనంపై కాల్చి చేయడంలోనే టేస్ట్ సీక్రెట్!
నయా స్టైల్లో నోరూరించే 'బెండకాయ చట్నీ' - పిల్లలకూ చాలా బాగా నచ్చుతుంది!

Published : January 6, 2026 at 7:14 PM IST
New Method to Make Bendakaya Pachadi : నార్మల్‌గా బెండకాయతో చేసుకునే వంటల్లో ఫ్రైను ఎక్కువగా ఇష్టపడుతుంటారు చాలా మంది. దాని తర్వాత ఎక్కువ మంది ఇష్టంగా తినే వాటిల్లో 'బెండకాయ పచ్చడి' ఉంటుంది. అయితే, ఈ పచ్చడిని ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈసారి డిఫరెంట్‌గా ఇలా ట్రై చేయండి. బెండకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలను పెనం మీద కాల్చి ఈ పద్ధతిలో "పచ్చడి" చేశారంటే టేస్ట్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మీ ఫేవరెట్ లిస్టులో చేరిపోతుంది. అంత కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి. ఇక వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తిన్నారంటే మరింత అద్భుతం. పిల్లలు కూడా ఇలా చేసి పెడితే వద్దనకుండా కమ్మగా తింటారు. అలాగే, దీని తయారీ విధానం కూడా చాలా సింపుల్! మరి, లేట్ చేయకుండా నోరూరించే ఈ కొత్తరకం బెండకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- బెండకాయలు - అర కిలో
- నూనె - తగినంత
- పల్లీలు - నాలుగు టేబుల్‌స్పూన్లు
- పచ్చిమిర్చి - రుచికి తగినన్ని
- టమాటాలు - ఆరేడు(కొద్దిగా పండినవి)
- వెల్లుల్లి రెబ్బలు - 25 నుంచి 30
- చింతపండు - పెద్ద నిమ్మకాయంత
- ఉల్లిపాయలు - ఒకట్రెండు
పల్లీలను ఇలా వేయించి "చట్నీ" చేయండి - టేస్ట్ అదుర్స్, వారం రోజులు నిల్వ!

తయారీ విధానం :
- ఈ పచ్చడి తయారీ కోసం ముందుగా తాజా బెండకాయలను తీసుకుని శుభ్రంగా కడగాలి.
- ఆపై వాటిని రెండు ఇంచుల పరిమాణంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
- అలాగే, ఒక చిన్న గిన్నెలో మీరు తినే పులుపును బట్టి కొద్దిగా చింతపండును తీసుకుని శుభ్రంగా కడిగి కాసేపు నానబెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద చపాతీ కాల్చుకునే ఇనుప పెనం పెట్టి నాలుగైదు టేబుల్స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి.
- ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్‌లో నిదానంగా గరిటెతో కలుపుతూ వాటిపై కాలిన మచ్చలు ఏర్పడే వరకు బాగా వేయించుకోవాలి.

- ఇలా నిదానంగా వేయించుకున్నప్పుడే బెండకాయ ముక్కలు లోపలి వరకు చక్కగా వేగి జిగురు లేకుండా ఉంటాయి.
- బెండకాయ ముక్కలు మంచిగా వేగాయనుకున్నాక వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కనుంచాలి.
- తర్వాత అదే నూనెలో పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత అందులో మీ రుచికి తగినన్ని పచ్చిమిరపకాయలను ముక్కలుగా తుంచి వేసుకుని వాటిపై తెల్ల మచ్చలు ఏర్పడే వరకు మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ బాగా వేయించాలి.
- అలా వేయించుకున్నాక పచ్చిమిర్చి-పల్లీలను మరో ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం అదే పాన్‌లో అదనంగా మరో నాలుగైదు టేబుల్స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి.

- ఆయిల్ హీట్ అయ్యాక పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను వేసి వాటిని పెనం మీద గరిటెతో కలుపుతూ కాల్చుకోవాలి.
- టమాటా మంచిగా వేగి వాటిపై స్కిన్ సెపరేట్ అవుతున్నట్లుగా అనిపిస్తున్నప్పుడు వీటిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని పక్కనుంచాలి.
- నెక్ట్స్ అదే పెనం మీద పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసి సన్నని సెగ మీద దోర దోరగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి.
- ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి-పల్లీలు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

- తర్వాత గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్‌లో వేయించి పక్కనుంచిన బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టుకున్న చింతపండు వేసుకుని పల్స్ మోడ్‌లో మధ్యమధ్యలో ఆపుతూ మూత తీసి కలిపి రోట్లో రుబ్బుకున్నట్లుగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఆవిధంగా గ్రైండ్ చేసుకున్నాక అందులో మీడియం సైజ్‌లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మరోసారి లైట్‌గా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇక చివర్లో కొద్దిగా సన్నని కొత్తిమీర తరుగు కూడా వేసుకుని ఒక్కసారి అలా లైట్‌గా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
- ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, ఈ పచ్చడిని మిక్సీలో కంటే ఇదే ప్రాసెస్‌లో రోట్లో రుబ్బుకుంటే మరింత టేస్టీగా వస్తుంది.
- ఇప్పుడు అందులోకి తాలింపును సిద్ధం చేసుకోవాలి.
ఇంట్లో కూరగాయలు లేకపోతే "ఉల్లిగడ్డ కారం" - వేడి వేడి అన్నంలోకి అదుర్స్!

తాలింపు కోసం :
- నూనె - తగినంత
- మినప్పప్పు - రెండు టీస్పూన్లు
- శనగపప్పు - ఒక టేబుల్‌స్పూన్
- ఆవాలు - కొద్దిగా
- జీలకర్ర - ఒక చెంచా
- ఎండుమిర్చి - నాలుగు
- కరివేపాకు - కొద్దిగా
- ఇంగువ - కొద్దిగా

- పోపు కోసం స్టవ్ మీద చిన్న కడాయిలో నూనె వేసుకుని వేడయ్యాక ఎండుమిర్చి తుంపలు, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి.
- శనగపప్పు వేగి రంగు మారుతున్నప్పుడు ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపును చక్కగా ఫ్రై చేసుకోవాలి.
- తాలింపు మంచిగా వేగిందనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిని వేసి ఒకసారి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలు.
- అంతే, ఎన్నడూ తినని రుచిలో నోరూరించే "బెండకాయ రోటి పచ్చడి" మీ ముందు ఉంటుంది!
- ఈ కొలతలతలో బెండకాయ పచ్చడిని ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్‌లో ఉంచారంటే వారం రోజుల పైనే తాజాగా నిల్వ ఉంటుంది!

చిట్కాలు :
- బెండకాయ ముక్కలను పెనం మీద వేయించి చేసుకోవడం ద్వారా ఈ పచ్చడి చాలా అంటే చాలా రుచికరంగా వస్తుంది.
- అలాగే, మీరు ఈ పచ్చడిని తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే బెండకాయలతో పాటు ఇతర పదార్థాలను తగ్గించి తీసుకుంటే సరిపోతుంది.
పచ్చికారంతో నోరూరించే "ఆలూ కర్రీ"! - సరికొత్త రుచిలో భలే కమ్మగా!

