దోమలు కుట్టి కుట్టి ఇబ్బందిపెడుతున్నాయా? - సహజ సిద్ధంగా తరిమికొట్టొచ్చట!
-దోమలు కుడితే డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా వంటి జ్వరాలు వచ్చే అవకాశం - వీటి నివారణకు ఈ టిప్స్ పనికొస్తాయంటున్న నిపుణులు!

Published : September 1, 2026 at 5:22 PM IST
Natural Methods to Avoid Mosquitoes: మామూలు రోజుల్లోనే దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఇక వర్షాకాలంలో వీటి దాడి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. తలుపులు తీశామంటే గుంపులు గుంపులుగా వచ్చి ఎక్కడంటే అక్కడ దాడి చేస్తాయి. ఇక వీటి దాడి కారణంగా ఒంటిపై దురద, దద్దుర్లతో పాటు కొన్ని సందర్భాల్లో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి ప్రమాదకర రోగాలు కూడా ఇబ్బందిపెడతాయి. అందుకే వీటి బారి నుంచి తప్పించుకునేందుకు మస్కిటో కాయిల్స్, రిపెల్లెంట్స్, లిక్విడ్స్ వాడేస్తుంటారు. వీటిని అదే పనిగా వాడితే శ్వాసకోశ సమస్యలు వచ్చే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా సహజ సిద్ధమైన పద్ధతులతో దోమలను తరిమేసే చిట్కాలు పాటించాలని సలహా ఇస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
వేపనూనతో: నీమ్ ఆయిల్‌తో దోమలను ఈజీగా తరిమికొట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రమిదలో కొద్దిగా వేప నూనె పోసి, అందులో కొన్ని కర్పూరం బిళ్లలు వేసి వెలిగించాలంటున్నారు. దీని నుంచి వచ్చే పొగ, వాసనకు దోమలు, ఈగలు నిమిషాల్లో ఇల్లు వదిలి పారిపోతాయంటున్నారు.
నిమ్మకాయ: నిమ్మకాయతో కూడా దోమలను వెళ్లగొట్టొచ్చని నిపుణులు వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే నిమ్మకాయను మధ్యలోకి కోసి, ఆ రెండు చెక్కల్లో లవంగాలను గుచ్చాలంటున్నారు. ఆ తర్వాత వీటిని హాల్‌లో, బెడ్‌రూమ్‌లో మూలల్లో ఉంచాలని.. నిమ్మ, లవంగాల మిశ్రమ ఘాటు వాసనను దోమలు అసలు భరించలేవంటున్నారు
పుదీనా: పుదీనా నూనెతో కూడా దోమలను తరిమికొట్టొచ్చని చెబుతున్నారు. ఇందుకోసం ఒక స్ప్రే బాటిల్‌లో నీరు తీసుకుని, అందులో కొన్ని చుక్కలు మింట్ లేదా యూకలిప్టస్ ఆయిల్ కలపాలంటున్నారు. ఈ మిశ్రమాన్ని ఇల్లంతా, ముఖ్యంగా కిటికీలూ, తలుపుల దగ్గర స్ప్రే చేస్తే ఆ సువాసనకు కీటకాలు అసలు లోపలికి రావంటున్నారు.
వెల్లుల్లి రెబ్బలు: వెల్లుల్లి వంటల రుచిని పెంచడమే కాకుండా దోమలను పంపించడంలో ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి నీళ్లలో మరిగించి, ఆ నీటిని చల్లార్చి స్ప్రే బాటిల్‌లో పోసి ఇల్లంతా పిచికారీ చేయాలంటున్నారు. వెల్లుల్లి ఘాటైన వాసనకు దోమలు, ఈగలు క్షణంలో మాయమవుతాయని పేర్కొంటున్నారు.
మొక్కలు: ఇంట్లో పెంచుకునే కొన్ని మొక్కల ద్వారా కూడా దోమల నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు. అంటే ఇంటి బాల్కనీ లేదా కిటికీల దగ్గర తులసి, పుదీనా, లెమన్‌గ్రాస్ లేదా బంతి మొక్కలను పెంచడం వల్ల, ఈ మొక్కల నుంచి వచ్చే నేచురల్ అరోమా దోమలను సహజంగానే దూరం ఉంచుతుందంటున్నారు.
లావెండర్ ఆయిల్: దోమలకు లావెండర్ నూనె అస్సలు నచ్చదని, ఈ వాసన ఉన్నచోట నుంచి అవి పారిపోతాయంటున్నారు. కాబట్టి, ఇంట్లో లావెండర్ నూనె స్ప్రే చేయడం మంచిదని వివరిస్తున్నారు. ఒకవేళ దోమలు మరీ ఎక్కువగా ఉంటే, లావెండర్ ఆయిల్‌ని చేతులు, కాళ్లకు రాసుకుంటే, ఇలా చేస్తే ఒక్క దోమ కూడా మిమ్మల్ని కుట్టదంటున్నారు.
దోమలతో నిద్రలేని రాత్రులా? - ఈ టిప్స్ పాటిస్తే ఒక్కటీ ఉండదు! - మస్కిటో కాయిల్స్ అవసరం లేదు!

