ETV Bharat / offbeat

మీరు వంటలు బాగా చేస్తారా? - "చుక్క నూనె" లేకుండా వండితే బహుమతులు - myGOV సూపర్​ కాంటెస్ట్​!

- వంటల్లో నూనె వాడకాన్ని తగ్గించాలన్న ప్రధాని మోదీ - ఈ క్రమంలోనే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, myGOV సహకారంతో కాంటెస్ట్​!

myGOV Oil Free Cooking Challenge
myGOV Oil Free Cooking Challenge (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : May 15, 2026 at 3:02 PM IST

3 Min Read
Choose ETV Bharat

myGOV Oil Free Cooking Challenge: భారతీయ వంటకాల్లో నూనెకు ఎంతో ఇంపార్టెన్స్​ ఉంటుంది. ఇది లేనిదే వంట పూర్తి కాదు. సలాడ్స్​ దగ్గర నుంచి పిండి వంటల వరకు ఎంతో కొంత నూనె వాడుతూనే ఉంటాం. కానీ, రుచి కోసం మనం వాడే నూనె, కాలక్రమేణా ఆరోగ్యాన్ని హరిస్తుంది. కొలెస్ట్రాల్​, గుండె జబ్బులు వంటి సమస్యలు వస్తాయి. అందుకే, నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని ఇటీవలే హైదరాబాద్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ సూచన చేశారు.

వంట నూనెలో కేవలం 10 శాతం తగ్గించినా.. అది దేశ ఆర్థిక వ్యవస్థకే కాకుండా మన వ్యక్తిగత ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందన్నారు. అయితే, మోదీ సూచన మేరకు భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అద్దిరిపోయే కాంటెస్ట్​ తీసుకొచ్చింది. చుక్క నూనె లేకుండా వంటకాలు చేయాలని ప్రోత్సహించింది. మరి ఈ కాంటెస్ట్​లో ఎలా పాల్గొనాలి? పాటించాల్సిన నియమాలు వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

కాంటెస్ట్​ ముఖ్య ఉద్దేశం ఇదే: నూనె వినియోగాన్ని తగ్గించి, ఊబకాయాన్ని ఎదుర్కోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునకు అనుగుణంగా భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI), myGOV సహకారంతో.. "డ్రాప్ ది ఆయిల్ ఛాలెంజ్: ఆరోగ్యకరమైన భారతదేశం కోసం ఆయిల్​ ఫ్రీ కుకింగ్​ ఛాలెంజ్​" పేరుతో కుకింగ్​ కాంటెస్ట్​ తీసుకొచ్చింది. ఈ పోటీ ముఖ్య ఉద్దేశ్యం నూనె లేకుండా వంట చేయడం. చుక్క నూనె లేకుండా వంట చేసి దానిని ఫొటో లేదా వీడియో రూపంలో మైగవ్​ పోర్టల్​లో సంబంధిత కాంటెస్ట్​లో అప్​లోడ్​ చేయాలి.

ఎవరు అర్హులు? : ఈ పోటీలో పాల్గొనడానికి భారతీయులు అర్హులు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఈ కాంటెస్ట్​ ఒక నెల రోజుల వరకు ఉంటుంది. ఇప్పటికే పోటీ మొదలైంది. జూన్​ 5వ తేదీ వరకు అవకాశం ఉంది. జూన్​ 6 తర్వాత పంపిస్తే పరిగణనలోకి తీసుకోరు. ఇక ఈ పోటీలో పాల్గొన్న వారికి FSSAI నుంచి ఇ సర్టిఫికెట్స్​ లభిస్తాయి. బెస్ట్​ 50 వంటకాలకు FSSAI తరఫున గిఫ్ట్​ హ్యాంపర్స్ లేదా కాన్సోలేషన్​ బహుమతులు​ లభిస్తాయి.

కాంటెస్ట్​ రూల్స్​ ఇవే :

  • myGOV​ పోర్టల్​ ద్వారా మాత్రమే ఈ పోటీలో పాల్గొనాలి. ఒక వ్యక్తికి ఒకసారి మాత్రమే పాల్గొనే అవకాశం. అదే విధంగా ఈ పోర్టల్​లో వివరాలు ఎప్పటికప్పుడు అప్​డేట్​ చేస్తుండాలి.
  • పోటీదారులు తమ వంటకం వివరాలను PDF లేదా Word ఫార్మాట్‌లో సమర్పించాలి. అయితే ఆ పీడీఎఫ్​లో మీరు చేసే వంట పేరు, ఆ వంటకు కావాల్సిన పదార్థాలు, స్టెప్​ బై స్టెప్​ కుకింగ్​ ప్రాసెస్​, కుకింగ్​ టైమ్​, ఎంత మందికి చేస్తున్నారు, ఆరోగ్య ప్రయోజనాలు, రెసిపీ ఫైనల్ ఫొటోలు 2 లేదా 3(ఫొటోలు JPEG ఫార్మాట్​లో ఉండాలి), ఫోన్​ నెంబర్​ వంటి అన్ని వివరాలూ ఉండాలి.
  • ఈ రెసిపీలో చుక్క నూనె ఉండకూడదు. అది మీ సొంత రెసిపీ అయ్యుండాలి.
  • ఒకవేళ మీరు చేసిన రెసిపీ వేరే ఫ్లాట్​ఫారమ్​లో ఉందనిపిస్తే దానిని క్యాన్సిల్​ చేసే హక్కు అధికారులకు ఉంటుంది. అలాగే ఒక్కసారి కాంటెస్ట్​లో పాల్గొన్నాక దానిని విత్​డ్రా చేసుకునే అధికారం ఉండదు.

ఈ పోటీలో ఎలా పాల్గొనాలి?:

  • ఈ పోటీలో పాల్గొనాలనుకునేవారు myGOV పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • ముందుగా మీ రెసిపీని ప్రిపేర్​ చేసి దానికి సంబంధించిన ఫొటోలు లేదా వీడియోలు రెడీగా ఉంచాలి.
  • మీ ఫోన్​ లేదా లాప్​టాప్​లో myGOV అధికారిక వెబ్​సైట్​ను ఓపెన్​ చేయాలి.
  • మీకు ఇప్పటికే అకౌంట్​ ఉంటే ఆ వివరాలతో లాగిన్​ అవ్వాలి. ఒకవేళ కొత్త వారు అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్​ చేయాలి.
  • లాగిన్​ అయిన తర్వాత హోమ్​ పేజీలోకి వెళ్లి Get Involved కాలమ్​లో Do/Task అనే ఆప్షన్​ ఉంటుంది. దానిపై క్లిక్​ చేయాలి.
  • స్క్రీన్​ మీద వివిధ రకాల పోటీలు కనిపిస్తాయి. అందులో "Drop the Oil Challenge Oil Free Cooking Challenge for Healthier India" అని ఉంటుంది. దానిపై క్లిక్​ చేయాలి.
  • కిందకు స్క్రోల్​ చేసి మీ రెసిపికి సంబంధించిన ఫొటోలు లేదా వీడియోలను అప్​లోడ్​ చేసి, ఆరోగ్య ప్రయోజనాలను ఎంటర్​ చేసి Save ఆప్షన్​పై క్లిక్​ చేయాలి. ఫైనల్​గా DOపై క్లిక్​ చేస్తే మీ సబ్మిషన్​ పూర్తవుతుంది. ప్రస్తుతం ఈ కాంటెస్ట్​లో 72 మంది పాల్గొన్నారు.

మీరు వాడే "వంటనూనె" కల్తీది కావొచ్చు - ఇలా ఈజీగా తెలుసుకోవచ్చంటున్న FSSAI

రోజుకు ఎంత 'వంట నూనె' వాడాలో తెలుసా? - నిపుణులు ఏమంటున్నారంటే!