క్రిస్పీ అండ్ జ్యూసీ "మష్రూమ్ కట్లెట్స్" - టేస్ట్ అద్దిరిపోతాయి - స్నాక్స్‌కు బెస్ట్!
-పుట్టగొడుగులతో అద్దిరిపోయే స్నాక్ రెసిపీ - ఒక్కసారి తింటే ఫేవరెట్ లిస్టులో చేరిపోతుంది!

Published : March 2, 2026 at 11:17 AM IST
Mushroom Cutlets Recipe: వెజిటేరియన్స్‌కు మాంసకృత్తులు అందించే పదార్థాల్లో మష్రూమ్స్ ఒకటి. అందుకే చాలా మంది వీటిని తింటుంటారు. అయితే నార్మల్‌గా పుట్టగొడుగలతో చాలా మంది ఫ్రై, గ్రేవీ రెసిపీలు మాత్రమే చేస్తారు. కానీ క్రంచీ స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. అదే కట్లెట్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తయారు చేసుకోవడం కూడా సులువే. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు వీటిని చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. మరి లేట్ చేయకుండా కరకరలాడే మష్రూమ్ కట్లెట్స్ ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:
- మష్రూమ్ - 200 గ్రాములు
- నూనె - 2 టేబుల్‌స్పూన్లు
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
- పచ్చిమిర్చి - 2
- కారం - 1 టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- జీలకర్ర పొడి - అర టీస్పూన్
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- గరం మసాలా - అర టీస్పూన్
- ఉడికించిన బంగాళాదుంప - 1
- కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్‌స్పూన్లు
- బ్రెడ్ క్రంబ్స్ తగినంత

తయారీ విధానం:
- ముందుగా పుట్టగొడుగులను శుభ్రంగా కడిగి వీలైనంత సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టాలి. అదే విధంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా సన్నగా తరగాలి. బంగాళాదుంపను ఉడికించి పొట్టు తీసేసి తురుముకుని పక్కన ఉంచాలి.
- స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి.
- ఆనియన్స్ లైట్‌గా కలర్ మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు ఫ్రై చేయాలి.
- అనంతరం తరిగిన పుట్టగొడుగులు వేసి మీడియం ఫ్లేమ్‌లో కలుపుతూ కొద్దిసేపు వేయించాలి.

- మష్రూమ్స్ కాస్త వేగినాక కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మరో మూడు నిమిషాలు వేయించాలి.
- మసాలాలు కూడా చక్కగా ఫ్రై అయ్యాక కొత్తిమీర తరుగు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన చల్లారనివ్వాలి.
- ఈలోపు ఓ గిన్నెలోకి బ్రెడ్ క్రంబ్స్ రెడీగా ఉంచాలి. మరో గిన్నెలోకి 2 టేబుల్స్పూన్ల మైదా పిండి వేసి అందులోకి సరిపడా వాటర్ పోసి కలుపుకోవాలి. మరీ పల్చగా, మరీ మందంగా కాకుండా ఉండాలి.
- వెడల్పాటి మిక్సింగ్ బౌల్లోకి రెడీ చేసుకున్న మష్రూమ్ మిశ్రమం, తురుముకున్న బంగాళాదుంప, కార్న్‌ఫ్లోర్ వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని ముద్దలాగా చేసుకోవాలి. ముద్దలాగా రాకపోతే మరికొంచెం కార్న్‌ఫ్లోర్ కలుపుకోవచ్చు.

- అనంతరం పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ కట్లెట్ షేప్‌లో చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి.
- స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్‌ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఈలోపు ప్రిపేర్ చేసుకున్న ఓ కట్లెట్ తీసుకుని ముందుగా మైదా పిండిలో డిప్ చేసి బ్రెడ్ క్రంబ్స్‌లో రోల్ చేసుకుని కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఇలా కడాయికి సరిపడా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్‌లో వేయించాలి.
- కట్లెట్స్ క్రిస్పీగా వేగి గోల్డెన్ కలర్లోకి మారినాక తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ విధంగా మిగిలిన వాటిని ఫ్రై చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మష్రూమ్స్ కట్లెట్స్ రెడీ.

బ్రెడ్‌తో నోరూరించే కస్టర్డ్ స్వీట్ - తియ్య తియ్యగా అద్దిరిపోద్ది!
సండే స్పెషల్: పుల్లగా, కారంగా "గోంగూర రొయ్యల కూర" - టేస్ట్ అద్దిరిపోతుంది!

