ఘుమఘుమలాడే "మష్రూమ్ కర్రీ" - కొత్త వాళ్ల కోసం సింపుల్ పద్ధతి!
కుక్కర్లో మష్రూమ్ గ్రేవీ కర్రీ - చికెన్ కుక్ చేసినట్లుగానే ఉంటుంది!

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 17, 2026 at 10:56 AM IST
Simple Mushroom Curry : మష్రూమ్ కర్రీ తయారీ విధానం కాస్త భిన్నంగా ఉంటుంది. కొత్త వాళ్లయితే కర్రీ చేయడానికి భయపడిపోతుంటారు. కానీ, పుట్టగొడుగుల కర్రీ సింపుల్‌గా ఇలా కూడా చేయొచ్చని తెలిస్తే ఆశ్చర్యపోతారు. 'ఇంతేనా!, ఇలా కూడా చేయొచ్చా?' అంటారు. ఇక్కడ ఇచ్చిన పద్ధతిలో ఓసారి కుక్కర్లో పుట్ట గొడుగుల కర్రీ ట్రై చేసి చూడండి. కుక్కర్లో ట్రై చేస్తాం కాబట్టి సరిపడా గ్రేవీ ఉండేలా చూసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ట్రై చేయాలని గుర్తుంచుకోండి.
లంచ్‌లోకి ఏం చేయాలో తోచనపుడు ఇలా ట్రై చేయండి - పిల్లలు, పెద్దలు టేస్టీగా తింటారు!

కావల్సిన పదార్థాలు :
- పుట్ట గొడుగులు - 350 గ్రాములు
- నువ్వులు - 3 టేబుల్ స్పూన్లు
- ఫ్రైడ్ ఆనియన్
- టమోటాలు - 2
- పెరుగు - 50 గ్రాములు
- పసుపు - పావు స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- కారం - 2 స్పూన్లు
- ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర పొడి - 1 స్పూన్
- గరం మసాలా - అర స్పూన్
- పచ్చిమిర్చి - 6
- అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- కరివేపాకు - 1 రెమ్మ
- నూనె - 4 టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర - కొద్దిగా
- కసూరి మేతి - కొద్దిగా

తయారీ విధానం :
- ఈ పుట్టగొడుగుల కర్రీ తయారీ పద్ధతి చాలా భిన్నంగా ఉంటుంది. చికెన్ కర్రీ చేసినట్లుగానే పదార్థాలన్నింటినీ మ్యారినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మష్రూమ్స్ కట్ చేసుకుని శుభ్రం చేసుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేయించి తీసుకోవాలి. ఆ తర్వాత టమోటాలు కాస్త ఉడికించుకోవాలి.

- మసాలా పేస్ట్ తయారీ కోసం 4 టేబుల్ స్పూన్ల నువ్వులు దోరగా వేయించి గ్రైండర్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత వేయించిన ఉల్లిపాయలు, టమోటా ముక్కలు, పెరుగు కూడా వేసుకుని మెత్తని పేస్ట్ చేసుకోవాలి.

- కుక్కర్లోకి శుభ్రం చేసుకున్న మష్రూమ్ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకుతో పాటు ముందుగా గ్రైండ్ చేసుకున్న టమోటా గ్రేవీ వేసుకోవాలి. ఆ తర్వాత 4 టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరగా 1 గ్లాసు నీళ్లు పోసుకుని కలిపి ఉప్పు, కారం టేస్ట్ చెక్ చేసుకోవాలి.

- ఇపుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 3 విజిల్స్ ఇస్తే చాలు! అంతే ఆ తర్వాత ప్రెజర్ తీసేసి మూత తీసుకుని కలిపి కొద్దిగా కొత్తిమీర, కసూరి మేతి చల్లుకుని 3నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి దించేసుకుంటే చాలు! అద్భుతమైన పుట్టగొడుగుల కర్రీ రెడీగా ఉంటుంది. ఈ కర్రీ చపాతీ, బగారా రైస్‌లోకి కమ్మగా ఉంటుంది.
నోటికి కొత్త రుచినిచ్చే "టమోటా మెంతి సోయా కర్రీ" - కొత్తవాళ్లైనా ఇలా సింపుల్‌గా చేసేయొచ్చు!
ఘుమఘుమలాడే బెంగళూరు "దొన్నె బిర్యానీ" - ఇంట్లోనే ఇలా ట్రై చేయండి!

