'డబ్బు' విలువ తెలిసేలా పొదుపు పాఠాలు! - పిల్లల వయసును బట్టి ప్లాన్ చేసుకోవాలట!
-పిల్లల వయసును బట్టి పొదుపు పాఠాలు నేర్పే పద్ధతి కూడా మారాలంటున్న నిపుణులు!

Published : August 31, 2026 at 1:27 PM IST
Money Lessons from Mothers: అమ్మను ఆదిగురువుగా భావిస్తాం. ఎందుకంటే అన్నింటినీ తన దగ్గర నుంచే నేర్చుకుంటాం. ఆహారపు అలవాట్ల నుంచి జీవితంలో ఉపయోగపడే ఆర్థిక పాఠాల వరకూ అన్నీ తనని చూసే నేర్చుకుంటారు. తను చెబితేనే అనుసరిస్తారు. అయితే పొదుపును పాఠాలుగా కాకుండా రోజువారీ పనుల్లో భాగం చేసి నేర్పించాలని, అప్పుడే ఎప్పటికీ గుర్తుండిపోతాయంటారు నిపుణులు. ఈ క్రమంలోనే పిల్లల వయసును బట్టి పొదుపు పాఠాలు నేర్పే పద్ధతి కూడా మారాలంటున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
రెండు జార్ల పద్ధతిలో: 6 నుంచి 12 ఏళ్ల పిల్లలకు రెండు గాజు జార్లను కొనివ్వాలంటున్నారు నిపుణులు. అందులో ఒకదానిపై పొదుపు, మరో దానిపై ఖర్చు అని రాయాలని చెబుతున్నారు. పుట్టినరోజుకీ, అప్పుడప్పుడు దాచుకోమని ఇచ్చిన డబ్బుని రెండు భాగాలు చేసి అందులో వేయమని చెప్పాలట. ఒకదానిలో వేసే మొత్తాన్ని సొంత ఖర్చులు, అవసరమైన వస్తువులు కొనుక్కోవడానికి ఉపయోగించమని చెప్పాలంటున్నారు. మరొకటి పొదుపు కోసం. నచ్చిన వీడియోగేమ్, వస్తువులు.. ఇలా కాస్త ఖరీదైనవి ఏవో ఒకటి వాళ్లకీ కావాలనిపిస్తాయి. అలాంటివి కావాలంటే పొదుపు చేసుకోవాల్సిందే అని చెప్పమంటున్నారు. తగినంత డబ్బులు సమకూరిన తరవాత దగ్గరుండి వాళ్లతోనే కొనిపించాలంటున్నారు. దాంతో దాచుకోవడమే కాదు, కావాల్సింది పొందాలంటే ఎంత కష్టపడాలో కూడా పిల్లలకు తెలుస్తుందని వివరిస్తున్నారు.
మద్దతు ఇస్తూనే: 12 నుంచి 18 ఏళ్లున్న పిల్లలను ఇంటి ఆర్థిక నిర్ణయాల్లో పాలుపంచుకోనివ్వాలంటున్నారు నిపుణులు. ఒకసారే డబ్బుల లెక్కలు అంటే వాళ్లకు అర్థం అవ్వడం కష్టమే అని, అందుకే ఒక వస్తువుని రెండు వేర్వేరు బ్రాండ్స్‌లో వెతకమనాలని, ఏది తక్కువ ధరకు వస్తుందో గమనించమని చెప్పాలంటున్నారు. ఉదాహరణకు రోజూ మనం కొనే పాలు, గుడ్లు, పప్పు, ఉప్పులతోనూ ఈ నైపుణ్యాలు అలవాటు అవుతాయని వివరిస్తున్నారు. ఒక వస్తువును తీసుకుని 2 నుంచి 3 షాపుల్లో ధర కనుక్కొని ఎక్కడ తక్కువకు వస్తోందో గమనించమని చెప్పాలంటున్నారు. ఆ తరవాతే కొనమంటే సరిపోతుందని వివరిస్తున్నారు. రూ.100 ఇచ్చి మార్కెట్‌కి పంపి, కొనాల్సిన జాబితా ఇచ్చి, మిగిలిన డబ్బులు తనకే అంటే ఆచితూచి కొంటారంటున్నారు. అయితే ఇలా కొనేముందు నాణ్యతనీ గమనించమనాలని చెబుతున్నారు. ఇవన్నీ నేర్చుకోవడంలో భాగమే అని, అలాగే గారాబం పక్కనపెట్టి... ఆర్థిక వనరులు, ఇంటి పరిస్థితి గురించీ స్పష్టంగా చెప్పాలంటున్నారు. ఈ వయసులోనే విద్యా రుణాలు, స్కాలర్‌షిప్‌లు వంటి వాటి గురించి చెప్పాలని, వాళ్లనే స్వయంగా వాటిని సంపాదించుకునేలా ప్రోత్సహించాలంటున్నారు. భవిష్యత్తులో క్రెడిట్, డెబిట్ కార్డుల సరైన వినియోగానికి పునాది పడేదీ ఈ వయసులోనే అని వివరిస్తున్నారు.
జీవితం.. లెక్కలు: 18 నుంచి 21 ఏళ్లంటే కెరియర్‌పై చాలావరకూ అవగాహన ఏర్పడుతుందని, చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఆర్థిక పాఠాలన్నీ ఆచరణలో పెట్టాల్సిన సమయమూ ఇదే అంటున్నారు. ఉద్యోగం చేయాలా, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలా అనే నిర్ణయం వాళ్లకే వదిలేయాలంటున్నారు. కాకపోతే బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డుల వినియోగం గురించి తప్పక జాగ్రత్తలు చెప్పాలంటున్నారు. అంతేకాకుండా, డిజిటల్ పెట్టుబడులపైనా అవగాహన కల్పించాలని, అవసరమయితే సిప్, మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు కనీస మొత్తాన్ని పొదుపు చేయించాలంటున్నారు. దాంతో చిన్నవయసులోనే పొదుపు, మదుపు వల్ల కలిగే ప్రయోజనాలు తెలుస్తాయని, ముఖ్యంగా ఉన్నతచదువు, పెళ్లి ఇలా భవిష్యత్ అవసరాల గురించి చెప్పమంటున్నారు. వాటిని వాళ్లకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకోవాలంటే ఆర్థిక ప్రణాళిక ఎంత ముఖ్యమో వివరించమంటున్నారు. అప్పుడు తమకేం కావాలో ఆలోచిస్తారని, దానికి అనుగుణంగా నడుస్తారని, ఇది దీర్ఘకాలంలో వాళ్లకి చాలా సాయపడుతుందంటున్నారు.
మినిమమ్ బ్యాలెన్స్ లేకుండానే సేవింగ్స్ అకౌంట్! - ఏ బ్యాంకులోనైనా ఓపెన్ చేయొచ్చు

