నోటికి కమ్మగా ఉండే "కలగూర పులుసు" - ఇలాంటి రెసిపీ ఎపుడైనా ట్రై చేశారా?
ఆకుకూరలతో సింపుల్‌గా చేసుకునే రెసిపీ - ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!
Kalagura Pulusu (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 12, 2026 at 12:59 PM IST
Kalagura Pulusu Making : ఆకుకూరలతో వివిధ రకాల రెసిపీలు చేస్తుంటారు. ఇందులో కలగూర పులుసు కూడా ఒకటి. అయితే వీటిని ఎప్పుడూ చేసే పద్ధతిలో కాకుండా ఓసారి ఇలా చేశారంటే సూపర్‌గా వస్తుంది. అంతేకాక ఇంటిల్లిపాదీకి ఫేవరెట్ రెసిపీగా మారుతుంది. మరి కలగూర పులుసు చేయడానికి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
టేస్టీ "రంభా చికెన్" రెసిపీ మీకోసం - అద్దిరిపోయే ఈ కర్రీ దాబాల్లో మాత్రమే దొరుకుతుంది!

కావాల్సిన పదార్థాలు :
- తోటకూర - 2 కప్పులు
- మెంతికూర - ఒక కప్పు
- బచ్చలికూర - ఒక కప్పు
- ఆయిల్ - 3 టేబుల్ స్పూన్లు
- మెంతులు - 2 చిటికెడ్లు
- ఎండుమిర్చి - 2
- ఆవాలు - అర టీ స్పూన్
- జీలకర్ర - అర టీ స్పూన్
- శనగపప్పు - 3 టేబుల్ స్పూన్లు
- వెల్లుల్లి రెబ్బలు - 10
- కరివేపాకు - కొద్దిగా
- ఇంగువ - 2 చిటికెడ్లు
- టమోటాలు - 2
- పచ్చిమిర్చి - 2
- వంకాయ - 1
- పసుపు - పావు టీ స్పూన్
- ధనియాల పొడి - 1 టీ స్పూన్
- కారం - 1 టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- చింతపండు - 15 గ్రాములు
- శనగపిండి - 2 టేబుల్ స్పూన్లు
- కొత్తిమీర - కొంచెం

తయారీ విధానం :
- ముందుగా కావాల్సిన పరిమాణంలో తోటకూర, మెంతికూర, బచ్చలికూర, ఉల్లిపాయలను తరిగి ఉంచాలి. అలాగే రెండు టమోటాలు, ఒక వంకాయ, రెండు పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి.
- అలాగే చిన్న గిన్నెలో 15 గ్రాముల చింతపండు, సరిపడా నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టాలి. పది నిమిషాల అనంతరం పావు కప్పు పరిమాణంలో చింతపండు రసం తీసి పక్కనుంచాలి.
- ఇంకోవైపు చిన్న గిన్నెలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ శనగపిండి, కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా మిక్స్ చేసి పక్కనుంచాలి.

- అదేవిధంగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత రెండు చిటికెడ్ల మెంతులు వేసి వేయించాలి.
- మెంతులు వేగాక రెండు ఎండుమిర్చి, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, మూడు టేబుల్ స్పూన్ల శనపప్పు యాడ్ చేసి వేగనివ్వాలి. ఇందులోనే కచ్చాపచ్చాగా దంచుకున్న 10 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, రెండు చిటికెడ్లు ఇంగువ వేసి ఫ్రై చేయాలి.
- ఈ మిశ్రమం ఫ్రై అయిన తర్వాత అర కప్పు ఉల్లిపాయ తరుగు, తరిగి ఉంచిన పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.

- ఆనియన్స్ వేగిన తర్వాత తరిగి ఉంచిన టమోటా ముక్కలు, పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేయాలి. అదేవిధంగా ఒక టీ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, పావు కప్పు నీళ్లు పోసి బాగా కలుపుతూ వేయించాలి.
- టమోటా ముక్కలు మగ్గాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి కలపాలి. అనంతరం మూతపెట్టి వంకాయ ముక్కలను మగ్గించాలి.
- వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత రెండు కప్పుల తోటకూర తరుగు, ఒక కప్పు మెంతికూర తరుగు, ఒక కప్పు బచ్చలికూర తరుగు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. అనంతరం ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి.

- ఈ మిశ్రమం ఉడికిన తర్వాత తీసిపెట్టుకున్న పావు కప్పు చింతపండు రసం పోసి ఉడకనివ్వాలి. ఇందులోనే రెడీ చేసుకున్న శనగపిండి నీళ్లు మూడు నిమిషాల పాటు ఉడికించాలి.
- 3 నిమిషాల తర్వాత చివరన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
- అంతే ఘుమఘుమలాడే కలగూర పులుసు రెడీ అయినట్లే!
పసందైన "అటుకుల కొబ్బరి పూర్ణాలు" - పర్ఫెక్ట్గా పొంగాలంటే ఇలా ట్రై చేయండి!

